బాలికలే కొంత మేలు!

28 Sep, 2017 01:47 IST|Sakshi

 ఆరేళ్ల లోపు చిన్నారుల్లో ఆరోగ్యవంతంగా ఉంటున్నది బాలికలే

     పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న బాలురు..

     ఏటా అనారోగ్యం బారిన పడుతున్న 12.81% చిన్నారులు

     ప్రమాదకరంగా 21.61% చిన్నారుల ఆరోగ్యం

     శిశు సంక్షేమ శాఖ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు

సాక్షి, హైదరాబాద్‌: బాలికల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపే పౌష్టిక లోపం విషయంలో పరిస్థితి మెరుగుపడుతోంది. ఆరేళ్ల లోపు బాలికల్లో పౌష్టికాహార లోపం ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అంగన్‌ వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్య స్థితిపై మహిళా భివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చేపట్టిన పరిశీలనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్న వారిలో బాలికలే అధికం కాగా.. అనారోగ్యం బారిన పడుతున్న వారిలో బాలురు అధికంగా ఉంటున్నారు. పౌష్టికాహార లోపంతోనే ఈ పరిస్థితి అని అధికారుల పరిశీలనలు చెబుతున్నాయి.

ఆరోగ్యవంతులు 47.72 శాతమే!
రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 23,71,398 మంది చిన్నారులు నమోదయ్యారు. వీరిలో బాలురు 12,22,902 మంది కాగా బాలికలు 11,48,496 మంది ఉన్నారు. గత నెలలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎత్తు, వయసు, బరువు తదితర అంశాలపై అధికారులు పరిశీలన చేశారు. 13.96 లక్షల మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించి ఫలితాలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇందులో కేవలం 47.72 శాతం పిల్లలే ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. 17.79 శాతం పిల్లల ఆరోగ్య స్థితి మధ్యస్థంగా ఉండగా.. 12.87 శాతం పిల్లల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వీరంతా ఎత్తుకు తగినట్టు బరువు లేరు. అంతేకాకుండా వయసుకు తగిన విధంగా ఎత్తు పెరగలేదు. మిగతా 21.61 శాతం పిల్లలు వయసుకు తగిన ఎత్తు, బరువు లేకపోగా.. దీర్ఘకాల జలుబు, జ్వరం, శారీరకంగా బలహీనంగా ఉంటూ తీవ్ర అనారోగ్యకరంగా ఉంటున్నట్లు వెల్లడైంది.

బాలికారోగ్యం మెరుగే..
శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన పరిశీలనలో బాలికల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. బాలికలు ఆరోగ్యపు అలవాట్లు పాటించడం, పోషకాల స్వీకరణలో స్వీయ శ్రద్ధ చూపడంతోనే వారి ఆరోగ్య స్థితి సంతృప్తికరంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బాలురలో పోషకాలు ఇవ్వడంలో ఒత్తిడి కనిపిస్తోందని, ఇది వారి పౌష్టికత్వంపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. దీంతో నాలు గింట మూడు కేటగిరీల్లో వెనుకబడి ఉన్నట్లు విశ్లేషిస్తు న్నారు. సాధారణ కేటగిరీలో బాలికలు 2.68 శాతం మెరుగ్గా ఉన్నారు. ప్రమాదకరంగా ఉన్న వారిలో బాలుర కంటే 0.82 శాతం తక్కువగా, తీవ్ర ఆందోళనకరంగా ఉన్న కేటగిరీలో బాలికలు 3.57 శాతం తక్కువగా ఉన్నారు.

పరిశీలించిన చిన్నారులు :13,96,948
బాలురు:     7,17,599
బాలికలు:     6,79,349 

మరిన్ని వార్తలు