రుణం.. రణం..

6 Jun, 2014 03:24 IST|Sakshi
రుణం.. రణం..

కొత్తప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్న రైతాంగం ఇప్పుడు నైరాశ్యంలో పడింది. రూ.లక్షలోపు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్  కేవలం 2013-14 ఏడాదికాలానికి తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామనడంతో రైతులు గందరగోళంలో పడ్డారు. ‘ఓడ ఎక్కే వరకు ఓడ మల్లయ్య..ఓడ దిగాక బోడ మల్లయ్య’ చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు.
 
అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో నాలుగేళ్లుగా పంటలు పండక రెన్యూవల్, బుక్‌అడ్జస్టుమెంట్లు కూడా చేయించుకోలేని స్థితిలో ఉన్న రైతుల పరిస్థితి ఏంటని విపక్షాలు, రైతుసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. గురువారం జిల్లాలోని పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేసి.. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
 
 ఖమ్మం వ్యవసాయం/  ఖమ్మం రూరల్, న్యూస్‌లైన్: కొత్త  ప్రభుత్వం వస్తే రుణమాఫీ వస్తుందనుకున్న రైతుల ఆశలు ఇప్పుడు అడియాశలే అయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్షలోపు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించిన టీఆర్‌ఎస్..అధికారంలోకి రాగానే మెలిక పెట్టడంపై రైతులు భగ్గుమంటున్నారు. కేవలం గత సంవత్సరం రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని బ్యాంకర్ల సమావేశంలో ప్రభుత్వం తేల్చిచెప్పడంతో రైతులు ఆందోళన కు దిగారు.
 
 జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నాయకులు కూడా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. రైతుల వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతులు ఆందోళనలు చేశారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి.. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
 
బక్కరైతు బిక్కు బిక్కు
నిన్నటి వరకు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్న కేసీఆర్ మాట మార్చడంతో సన్నచిన్నకారు రైతులే తీవ్రంగా నష్టపోనున్నారు. తీసుకున్న రుణానికి  వడ్డీ భారీగా తోడవడంతో అప్పులు ఏలా తీర్చాలని బక్కరైతులు బిక్కు బిక్కు మంటున్నారు. జిల్లాలో మొత్తం 4.75 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 4,021 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. వీటిలో 3.80 లక్షల మంది రైతులకు చెందిన పంట రుణాలు రూ.2,682 కోట్లు ఉన్నాయి.
 
 బంగారం తాకట్టు పెట్టి పాస్‌బుక్‌ఆధారంగా తీసుకున్న రుణాలు రూ.486 కోట్లు ఉన్నాయి. వీటితో పాటు వివిధ కేటగిరీల కింద రైతులు రూ.853 కోట్ల రుణాలు పొందారు. 2013-14లో రూ.2,455 కోట్ల రుణాలను వివిధ కేటగిరీల కింద రైతులు తీసుకున్నారు. పంటరుణాలుగా రూ.1706 కోట్లు, బంగారం తాకట్టు పెట్టి పాస్‌బుక్ ఆధారంగా రూ.385 కోట్లు, వివిధ కేటగిరీల కింద రూ.364 కోట్ల రుణాలను రైతులు పొందారు. కేసీఆర్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రూ. లక్షలోపు రుణాలు మాఫీ చేస్తే జిల్లాలోని సుమారు మూడు లక్షల మంది రైతులకు చెందిన రూ.3వేల కోట్లు మాఫీ అవుతాయి.
 
అలాకాకుండా కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడిన ప్రకారం 2013 జూన్ 1వ తేదీ నుంచి 2014 జూన్ వరకు తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తే.. జిల్లాలో కేవలం రెండు లక్షల మంది రైతులకు చెందిన రూ. 900 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో నాలుగేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో రైతుల పంటలు నిలువునా ఎండిపోవడం, నీటిపాలు కావడం చూశాం. కుటుంబం గడవలేని స్థితిలో ఉన్న రైతులు అప్పులు చెల్లించలేదు. కేవలం పెద్ద రైతులు మాత్రమే అప్పులు చెల్లించటం, రెన్యూవల్స్ చేయించటం వంటివి చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం బక్క రైతులకు కాకుండా ధనిక రైతులే అధికంగా లాభం పొందే అవకాశం ఉంది.
 
 ఆందోళనల బాటలో అన్నదాతలు..
 గద్దెనెక్కక ముందు ఓ మాట..ఆ తర్వాత మరో మాట కేసీఆర్ మాట్లాడుతున్నారంటూ జిల్లాలోని రైతులు ఆందోళనబాట పడుతున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా రూ. లక్షలోపు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గురువారం జిల్లాలోని ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో రైతు సంఘాల నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆందోళనకు సిద్ధం కావాలని రైతులకు పిలుపు నిచ్చారు. నిరసన కార్యక్రమాలు ఉధృతం చేసేందుకు శుక్రవారం అన్ని రాజకీయపక్షాల రైతుసంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.
 
 ముంపు మండలాల రైతులపై వీడని సందిగ్ధత..
 తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో తీసుకున్న నిర్ణయం జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతానికి వర్తింస్తుందా? లేదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలు సీమాంధ్రలో కలిస్తే అక్కడి తెలుగుదేశం ప్రభుత్వం రుణాలు మాఫీ చేయాలి. జిల్లాలోని ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ వెలువడినప్పటికీ..ఇక్కడి రైతుల రుణాల విషయంలో మాత్రం ఇంత వరకు స్పష్టత రాలేదు.
 
 కౌలు రైతుల పరిస్థితి ఏమిటి?
 సెంటు భూమిలేని వ్యవసాయ కూలీలు చాలామంది భూములు కౌలుకు చేస్తున్నారు. గత ప్రభుత్వం కొంతమంది కౌలు రైతులకు కార్డులు జారీ చేసింది. జిల్లాలో 70 వేల మంది వరకు కౌలు రైతులు ఉన్నారు. యేటా మే చివరి వారం నుంచి వారికి కూడా సాధారణ రైతుల్లాగే కౌలు రైతులకు కూడా వ్యవసాయ రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ మొదటి వారం పూర్తికావస్తున్నా ఇంతవరకు అటు సాధారణ రైతులు, ఇటు కౌలు రైతులకు ప్రభుత్వం వ్యవసాయ రుణాలు ఇవ్వలేదు. రుణమాఫీ విషయంలోనే ఇప్పటికీ ఓ స్పష్టతకు రాలేకపోయిన ప్రభుత్వం కొత్త రుణాల విషయాన్ని ఇంకా ఎంతకాలం నాన్చుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
 రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం
 గ్రామాల్లో వాస్తవంగా ఎంతమంది కౌలు రైతులు ఉన్నారనే విషయమై క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సర్వే చేయాలి. కానీ దీనిపై రెవెన్యూ అధికారులు చేసిన ప్రయత్నాలు లేవు. మేనెల రెండోవారంలోపే కౌలు రైతులను గుర్తించాలి. అనంతరం వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. గత ఏడాది పాలేరు నియోజకవర్గంలో రెండువేల మంది కౌలు రైతులను గుర్తించారు. వారికి రుణ అర్హత కార్డులు కూడా మంజూరు చేశారు. వారిలో కేవలం 500 మందికి కూడా బ్యాంక్‌ల్లో రుణాలు ఇవ్వకపోవడం గమనార్హం. కౌలు రైతులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్లు కొర్రిలు పెట్టడం సర్వ సాధారణమైంది. ‘ఏ ఆధారం చూసి మీకు అప్పు ఇవ్వాలి? ఈ భూమిపై మీకేం హక్కు ఉంది? తీసుకున్న రుణం ఎలా తీర్చుతావు? కాబట్టి రుణం ఇవ్వడం కుదరదు..’ అంటూ బ్యాంకర్లు కొర్రీలు పెడుతుండటంతో కౌలు రైతులు వ్యవసాయ రుణానికి నోచుకోవడం లేదు.

మరిన్ని వార్తలు