చినుకమ్మా.. రావమ్మా..!

17 Jun, 2014 03:23 IST|Sakshi
చినుకమ్మా.. రావమ్మా..!

ఆదిలాబాద్/ఆదిలాబాద్ అగ్రికల్చర్ : వరుణుడి కరుణ కోసం రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. మృగశిరకార్తే(మిరుగు) ప్రవేశించి పది రోజులు గడుస్తున్నా వర్షాల జాడ లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అదును దాటుతుండటంతో తల్లడిల్లుతున్నారు. జూన్‌లో జిల్లా సాధారణ వర్షపాతం 200 మిల్లీమీటర్లు. ఈ నెల 16 వరకు 76 మి.మీ. కాగా, ఇప్పటివరకు కేవలం సగటున జిల్లావ్యాప్తంగా 23.2 మి.మీ. వర్షపా తం నమోదైంది. చిరు జల్లులు తప్పితే ఎక్క డా మంచి వర్షాలు పడలేదు.
 
 ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖాధికారులు స్పష్టం చేయడం ఆందోళన కలిగించే అంశం. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో 202.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 100 శాతం కంటే అధికం. కాగా, వర్షాలు కురుస్తాయనే భరోసాతో కొంత మంది రైతులు విత్తనాలు వేశారు. మరికొంత మంది దుక్కులు దున్ని విత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ ఎండలు 43 డిగ్రీల పైబడి నమోదు అవుతుండటం, వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వరుణుడి కరుణ కోసం కప్పతల్లి ఆడుతున్నారు. ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. కాగా, జిల్లాలో ఈ ఏడాది 6.15 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 85 శాతం వర్షాధారంగానే పంటలు పండిస్తున్నారు. సమయానికి వర్షాలు కురిస్తేనే పంటలు బాగా పండే పరిస్థితి ఉంది.
 
 విత్తనాలు.. ఎరువులు..

 పత్తి విత్తనాలు (450 గ్రాముల ప్యాకెట్)లు 20 లక్షలు అవసరం కాగా ఇప్పటివరకు 17 లక్షల వరకు జిల్లాకు చేరుకున్నాయి. ఇప్పటివరకు సుమారు 10 లక్షల వరకు రైతులు కొనుగోలు చేశారు. సోయాబీన్ విత్తనాలు 90 వేల క్వింటాళ్లు అవసరం కాగా 82 వేల క్వింటాళ్లు చేరుకున్నాయి. అందులో 50 వేల క్వింటాళ్లు ఇప్పటివరకు రైతులు కొనుగోలు చేశారు. మరో 32వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్నాయి. మిగతా విత్తనాల 400 క్వింటాళ్లు, 10 వేల క్వింటాళ్ల వరి, 400 క్వింటాళ్ల పెసర్లు, 100 క్వింటాళ్ల మినుములు, 300 క్వింటాళ్ల మొక్కజొన్న, 100 క్వింటాళ్ల జొన్నలు, 400 క్వింటాళ్ల సీసం అవసరంగా గుర్తించారు. ఈ విత్తనాల కొనుగోలుకు కొంత సమయం ఉంది. 1,21,435 మెట్రిక్ టన్నుల యూరియా, 83,350 మెట్రిక్ టన్నుల డీఏపీ, 51,963 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 28,478 మెట్రిక్ టన్నుల పొటాష్ మంజూరు ఉంది.
 
 రుణ లక్ష్యం రూ.2,228 కోట్లు
ఖరీఫ్ ప్రారంభమైనా రుణాల విషయంలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీ కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో సాగు కోసం ఇప్పుడు రుణాల అవసరం ఉండగా బ్యాంకర్లు మాత్రం రుణమాఫీపై స్పష్టత వచ్చిన తర్వాతనే రుణాలు ఇవ్వడం జరుగుతుందని, లేనిపక్షంలో పాత బకాయిలు కట్టి కొత్త రుణం తీసుకోవాలని మెలిక పెడుతున్నారు. రైతన్న పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. 2013-14లో రూ.1,656 కోట్లు రుణ లక్ష్యం కాగా రూ.1,421 కోట్ల రుణాలు 3,16,542 మంది రైతులకు అందించడం జరిగింది.  గ్రామీణ బ్యాంకుల్లో ఏప్రిల్ నెలలోనే రుణాలు ఇవ్వడం మొదలు పెడతారు. అలాంటిది జూన్ నెల సగం వరకు వచ్చినా ఈ ఏడాది ఒక్క రైతు ఒక్క రూపాయి రుణం తీసుకోలేదు. ఖరీఫ్ ప్రారంభంలోనే  వార్షిక రుణాలు జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం బట్టి రుణ ప్రణాళిక ఖరారు చేసి జిల్లా కలెక్టర్ ఆమోదించేవారు. ఇంత వరకు ప్రణాళిక రూపొందించలేదు.

మరిన్ని వార్తలు