ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేతపై స్టే ఇవ్వండి

31 Jul, 2019 01:57 IST|Sakshi

హైకోర్టును కోరిన పిటిషనర్‌ తరఫు న్యాయవాది

సాక్షి, హైదరాబాద్‌: ఎర్రమంజిల్‌ భవనాన్ని కూల్చరాదంటూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎర్రగడ్డలోని ‘ఇరానుమా’ కూల్చివేత  ప్రయత్నాలను అడ్డుకున్నట్లుగానే ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేత విషయంలోనూ స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయ వాది నళిన్‌ కుమార్‌ కోరారు. రెగ్యులేషన్‌ 13ప్రకారం హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చారని, దీని ద్వారానే హెరిటేజ్‌ కన్జర్వేటివ్‌ కమిటీ ఏర్పడిందన్నారు. వారసత్వ జాబితాలో భవనాల్ని చేర్చినా, తిరిగి ఆ జాబితా నుంచి ఏదైనా భవనాన్ని తొలగించాలన్నా ఆ చట్టంలోని సెక్షన్‌ 15 ప్రకారం చేయాలన్నారు. మరమ్మతులు చేయాలన్నా కమిటీ అనుమతి అవసరమని, ఏ అనుమతి లేకుండా ఎర్రమంజిల్‌ భవన ప్రదేశంలో చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించడం చట్టవ్యతిరేకమన్నారు.  

ఇరానుమా భవనం కూల్చివేయరాదన్న కేసులో హైకోర్టు.. హెరిటేజ్‌ కన్జర్వేటివ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని 2015లో ఇచ్చిన ఆదేశాల్ని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ధర్మాసనం కల్పించుకుని.. దీన్ని లోతుగా విచారించాల్సి ఉందంది. గత విచారణ సమయంలో హెచ్‌ఎండీఏ చట్టంలోని రెగ్యులేష న్‌ 13ను తొలగించినప్పటికీ జోనల్‌ రెగ్యులేషన్‌లో ఉన్నందున మాస్టర్‌ ప్లాన్‌లో అది కొనసాగుతుందని వాదించారని తెలిపింది. ఇప్పుడు జోనల్‌ రెగ్యులేషన్‌కు స్వయంప్రతిపత్తి ఉందని, హెచ్‌ఎండీఏ చట్టంలోని 13వ నిబంధన తొలగింపు ప్రభావం లేదని అందుకు విరుద్ధంగా ఎలా చెబుతున్నారో వివరణ ఇవ్వాలంది. హెచ్‌ఎండీఏ చట్టాన్ని రూపొందించినప్పుడు 13వ నిబంధన లేదని, తర్వాత చేర్చిన ప్రభుత్వం తిరిగి 2015లో తొలగించిందని, కొత్త చట్టంలో 13వ నిబంధన ఏ విధంగా ఉనికిలో ఉంటుందో చెప్పాలని,  పిటిషనర్లను కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు