పింఛనీయండి సారూ..!

21 Jun, 2016 03:07 IST|Sakshi
పింఛనీయండి సారూ..!

కరీంనగర్: ఈమె కోమిడి రాధమ్మ. వయసు అరవై ఏళ్లు. ఊరు కరీంనగర్ జిల్లా కదిపికొండ. భర్త కోమిడి వెంకట్‌రెడ్డి. స్వాతంత్య్ర సమరయోధుడు. అనారోగ్యంతో భర్త మరణించిన తరువాత రెండేళ్ల వరకు ఆయన పింఛన్ రాధమ్మకు వచ్చింది. కుటుంబానికి ఇదే ఆధారం. కానీ ఏం జరిగిందో తెలియదు... సర్కారోళ్లు ఐదేళ్లుగా ఆమె పింఛన్ నిలిపివేశారు. ఏమిటని అడిగితే స్పందించిన అధికారి లేడు. ఎంపీ వినోద్ లెటర్ సాయంతో ఢిల్లీలో పెన్షన్ ఆఫీసుకు వెళితే... హైదరాబాద్‌కు పంపిస్తాం వెళ్లమని అక్కడి అధికారులు చెప్పారు. అయినా రాధమ్మకు నేటికీ పెన్షన్ అందలేదు. సీఎంను కలసి తన గోడు వినిపించుకొందామని సోమవారం సచివాలయానికి వచ్చారు.

కానీ లోపలికి వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదు. ‘రాత్రి నుంచి జ్వరం. పొద్దుటి నుంచి తిండి ముట్టలేదు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? భర్త చనిపోయినప్పటి నుంచీ బతుకు భారమైపోయింది. చనిపోవాలనిపిస్తోంది’ అంటూ సచివాలయంలో మీడియా ప్రతినిధుల ముందు రాధమ్మ కంటనీరు పెట్టుకున్నారు. ఓ ప్రమాదంలో గాయపడ్డ తన కుమారుడికి భార్య, ఇద్దరు పిల్లలు. ప్రైవేట్లు చెప్పుకుని చాలీచాలని జీతంతో బతుకీడుస్తున్న అతడికి భారం కాకూడదని తాను విజయవాడ సమీపంలోని ఓ అనాథ ఆశ్రమంలో తలదాచుకొంటున్నానని, తనకు పింఛన్ ఇప్పించాలని ఆమె దీనంగా వేడుకోవడం అక్కడి వారిని కదిలించింది.

మరిన్ని వార్తలు