మైనర్‌కు వాహనమిస్తే జైలుకే!

22 Feb, 2018 02:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాహన యజమానిపై అభియోగపత్రాలు దాఖలు

సాక్షి, హైదరాబాద్‌ : ‘మైనర్లు వాహనం నడుపుతూ బయటకు వచ్చారంటే ఆ తప్పు పూర్తిగా వారిదే కాదు. వారికి వాహనాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు, యజమానిదీ తప్పే..’అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసింది. ఇటీవల బహదూర్‌పుర, మెహదీపట్నం ప్రాంతాల్లో మైనర్‌ డ్రైవింగ్‌ ముగ్గురు బాలల్ని చిదిమేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో నగర ట్రాఫిక్‌ విభాగం మైనర్‌ డ్రైవింగ్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసుల్లో వాహన యజమానిపైనా కోర్టుల్లో అభియోగపత్రాలను ట్రాఫిక్‌ విభాగం అధికారులు దాఖలు చేస్తున్నారు. గడిచిన వారంలో నలుగురు యజమానులకు న్యాయస్థానాలు ఒక్కో రోజు చొప్పున జైలు శిక్ష విధించినట్లు సిటీ ట్రాఫిక్‌ డీసీపీ–2 ఏవీ రంగనాథ్‌ తెలిపారు.

మరోవైపు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించి వివిధ కేసుల్లో మంగళవారం ఒక్క రోజే 55 మందికి జైలు శిక్షలు పడ్డాయి. 18 మంది డ్రైవింగ్‌ లైసెన్సుల్ని కోర్టులు సస్పెండ్‌ చేశాయి. ట్రాఫిక్‌ ఉల్లంఘనల్లో ఒకే రోజు ఇంత మందికి జైలు శిక్షలు పడటం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి. ఒకవేళ ఆ వాహనం తల్లిదండ్రులదయితే వారు కూడా జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడనుంది.

మూడో కేటగిరీలో మైనర్‌ డ్రైవింగ్‌
ట్రాఫిక్‌ పోలీసులు ఉల్లంఘనల్ని ప్రధానంగా మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పుగా మారేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పును తెచ్చిపెట్టేవి. మైనర్‌ డ్రైవింగ్‌ మూడో కేటగిరీ కిందికి వస్తుందని ట్రాఫిక్‌ పోలీసులు చెప్తున్నారు. ఏటా నగరంలో నమోదవుతున్న ప్రమాదాలను విశ్లేషిస్తే ద్విచక్ర వాహనాల వల్లే ఎక్కువగా జరుగుతున్నాయని తేలింది. యువత ఎక్కువగా వినియోగించేది ఈ వాహనాలే. ఆ తర్వాత స్థానం తేలికపాటి వాహనాలైన కార్లు వంటి వాటిది.

ఈ కారణంగానే ప్రమాదాల బారినపడుతున్న, కారణంగా మారుతున్న వాటిలో ద్విచక్ర వాహనాలే ఎక్కువగా ఉంటు న్నాయి. ద్విచక్ర వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో వాహనచోదకులతో పాటు పాదచారులూ ఎక్కువగా మృత్యువాతపడుతున్నా రు. ముఖ్యంగా అనేక విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో సొంత వాహనాలపై వా టికి వెళ్లి వచ్చే క్రమంలో ఎందరో యువకులు మృత్యువాత పడుతున్నారు. దీనికి తోడు రేసింగ్స్‌ కూడా అనేక మంది ప్రాణాల్ని హరిస్తున్నాయి. ఇలా మరణిస్తున్న వారిలో వాహనాలు డ్రైవ్‌ చేస్తున్న మైనర్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు.

నిబంధనలు ఏం చెప్తున్నాయంటే..
భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం(ఎంవీ యాక్ట్‌) పదహారేళ్ల లోపు వయసు వారు ఎలాంటి వాహనాలనూ నడపకూడదు. వీరు వాహనాలను నడుపుతూ రోడ్ల పైకి రావడం నిషేధం. 16 ఏళ్లు నిండిన వారు గేర్లు లేని సాధారణ వాహనాలు నడిపే అవకాశం ఉంటుంది. పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత మాత్రమే గేర్స్‌తో కూడిన వాహనాలు నడపడానికి అర్హులు. ఆర్టీఏ అధికారులు వీరికే లైసెన్స్‌ మంజూరు చేస్తారు.

చట్టప్రకారం మైనర్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చిన యజమాని శిక్షార్హుడే. అంటే ఎవరికైనా మన వాహనాన్ని ఇవ్వాలంటే తొలుత వారు మేజరేనా? డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందా? అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది. చట్టాలపై తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం, అమలుపై యంత్రాంగాలు దృష్టి పెట్టకపోవడంతో ఎన్నో ‘ఇంటి దీపాలు’చిన్న వయసులోనే ఆరిపోతున్నాయి.

ఎంవీ యాక్ట్‌లోని ఆ సెక్షన్‌ వాడుతున్నారు..
వారం వ్యవధిలో వరుసగా చోటు చేసుకున్న బహదూర్‌పుర, మెహదీపట్నం ఉదంతాలతో ట్రాఫిక్‌ పోలీసులు పంథా మార్చారు. అప్పటి వరకు మైనర్‌ డ్రైవింగ్‌ కేసుల్లో అత్యంత అరుదుగా.. అదీ వాహనం నడిపే వ్యక్తిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసే వారు. మోటారు వాహనాల చట్టంలోని 180 సెక్షన్‌ ప్రకారం ఓ మైనర్‌ కానీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వ్యక్తి కానీ వాహనం నడిపితే.. అతడితో పాటు వారికి వాహనం అందించిన దాని యజమానికీ జరిమానా విధించే అవకాశం ఉంది.

దీన్ని పరిగణనలోకి తీసుకుంటున్న ట్రాఫిక్‌ పోలీసులు గత వారం రోజుల్లో అనేక మంది ‘వాహన యజమానుల’పై చార్జ్‌షీట్స్‌ దాఖలు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు నలుగురికి ఒక రోజు చొప్పున జైలు శిక్షలు విధించాయి. ఈ నలుగురిలో ముగ్గురు మైనర్‌ సంబంధీకులే కాగా.. ఒకరు మాత్రం బయటి వారు.

ఆరు ఉల్లంఘనలపై చార్జ్‌షీట్స్‌..
ట్రాఫిక్‌ విభాగం అధికారులు గతంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపైనే అభియోగపత్రాలు దాఖలు చేసే వారు. ఇటీవల దీంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపటం, మైనర్‌ డ్రైవింగ్, ఈ–చలాన్లు భారీగా పెండింగ్‌లో ఉండటం(టాప్‌ వైలేటర్స్‌), ప్రమాదకరంగా వాహనం నడపటం, సెల్‌ఫోన్‌/ఇయర్‌ ఫోన్‌తో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం.. వంటి ఉల్లంఘనలపైనా చార్జ్‌షీట్లు దాఖలు చేస్తున్నారు.

మంగళవారం 25 ట్రాఫిక్‌ ఠాణాల అధికారులు ఆయా ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 304 అభియోగ పత్రాలను కోర్టులో దాఖలు చేసి, ఉల్లంఘనుల్ని హాజరుపరిచారు. చార్జ్‌షీట్లు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు వీరిలో 55 మందికి జైలు శిక్షలు విధించాయి. ఒక్కోక్కరికీ ఒక రోజు నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష విధించిన కోర్టులు, 18 మంది డ్రైవింగ్‌ లైసెన్సులు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాయి.

మరిన్ని వార్తలు