ఇప్పట్లో వదలదు!

20 Jul, 2020 02:46 IST|Sakshi

గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ లీడర్స్‌ స్టడీ పేరిట ‘లజార్డ్స్‌’ సర్వే

కరోనాపై మెజారిటీ హెల్త్‌కేర్‌ ఇండస్ట్రీ లీడర్స్, ఇన్వెస్టర్ల అంచనా ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది మధ్య వరకు.. ఆ తర్వాత కూడా కోవిడ్‌ మహమ్మారి, దానితో ముడిపడిన పరిణామాలు కొనసాగే అవకాశాలున్నాయా? ఈ ఏడాది చివరలోగా వ్యాక్సిన్‌ రాకపోతే ఆ పరిస్థితే ఎదురుకావొచ్చునని మెజారిటీ ఆరోగ్య పరిరక్షణ రంగం ప్రముఖులు (హెల్త్‌–కేర్‌ ఇండస్ట్రీ లీడర్స్‌) అభిప్రాయపడుతున్నారు. 2021 ద్వితీయార్ధం అంటే వచ్చే ఏడాది జూలై తర్వాత కూడా ఈ మహమ్మారి కొనసాగే అవకాశాలున్నట్టుగా మూడింట రెండొంతుల మంది హెల్త్‌–కేర్‌ ఇండస్ట్రీ ప్రతినిధులు అంచనావేస్తున్నారు. వచ్చే ఏడాది జూలై కంటే ముందుగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ విస్తృత స్థాయిలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కూడా లేవని నాలుగింట మూడో వంతు మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ లీడర్స్‌ స్టడీ పేరిట సర్వే
లజార్డ్స్‌ హెల్త్‌ కేర్‌ గ్రూప్‌ వివిధ అంశాలపై నిర్వహించిన మూడో వార్షిక గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ ఇండస్ట్రీ లీడర్స్‌ సర్వేలో గతంలో చేసిన అధ్యయనాలకు భిన్నమైన అభిప్రాయాలను వెల్లడించింది. గతంలో ఈ సంస్థ ఆరోగ్య రక్షణ రంగంలో విస్తృత వ్యూహాత్మక ప్రాధాన్యతలపై పరిశీలన జరిపింది. ఈ పర్యాయం మాత్రం గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ లీడర్స్‌ స్టడీ–2020 పేరిట నిర్వహించిన ఈ సర్వేలో ‘హెల్త్‌కేర్‌ పరిశ్రమలు: కోవిడ్‌ మహమ్మారికి సంబంధించి దీర్ఘ, స్వల్పకాలికంగా ఎదురవుతున్న సవాళ్లు, ఇబ్బందులు, ఆశిస్తున్న ప్రయోజనాల’ గురించి లోతైన విశ్లేషణ జరిపింది. ఇందులో భాగంగా గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ ఇండస్ట్రీకి వ్యూహాత్మకంగా ఎదురయ్యే సవాళ్లు, అవకాశాలను గురించి పరిశీలించింది.

ఏయే రంగాల్లో సర్వే..
ప్రాధాన్యత సంతరించుకున్న వివిధ ముఖ్యమైన అంశాలపై.. గత మే నెల చివరి వారం నుంచి జూన్‌ ప్రథమార్ధం వరకు ప్రపంచంలోని ప్రధాన బయో ఫార్మాసూటికల్స్, మెడికల్‌ డివైజెస్, డయాగ్నిస్టిక్స్,హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌కు చెందిన 184 మంది సీ–లెవల్‌ ఎగ్జిక్యూటివ్స్, 37 మంది ఇన్వెస్టర్ల అభిప్రాయాలను లజార్డ్స్‌ సంస్థ సేకరించింది. మొత్తం 221 మందిలో పెద్ద ఆరోగ్య పరిరక్షణ పరిశ్రమలు, వివిధ స్థాయిల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థల ప్రతినిధులున్నారు. వీరిలో మూడింట రెండొంతుల మంది కోవిడ్‌ మహమ్మారి వచ్చే ఏడాది ద్వితీ యార్థం తర్వాతా కొనసాగుతుందనే భావనను వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ తయారీపై ఆశలు, ఆకాంక్షలు, ఎప్పటిలోగా ఇది అందుబాటులోకి వస్తుంది, అదికూడా విస్తృతస్థాయిలో ఎప్పటివరకు అందరికీ దొరుకుతుంది అన్న అంశం కేంద్రంగా వీరు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

‘కరోనా  వ్యాక్సిన్‌ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనేది హెల్త్‌కేర్‌ ఇండస్ట్రీ లీడర్ల ఏకైక ఆందోళన. కోవిడ్‌ మహమ్మారిని నియంత్రణలోకి తెచ్చే వ్యాక్సిన్‌ తయారీ ఎంత కాలంలోగా జరుగుతుందనేది వారు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది మధ్య వరకు విస్తృతంగా అందుబాటులోకి రావొచ్చునని భావిస్తున్నారు’ అని లజార్డ్స్‌ హెల్త్‌కేర్‌ గ్రూప్‌ గ్లోబల్‌ హెడ్‌ డేవిడ్‌ గ్లూక్‌మాన్‌ వెల్లడించారు. కాగా, లజార్డ్స్‌.. ప్రపంచంలోని ప్రముఖ ఫైనాన్షియ ల్‌ అడ్వయిజరీ, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో ఒకటి. ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా, సెంట్రల్, సౌత్‌ అమెరికాలలోని 40 నగరాల నుంచి పనిచేస్తోంది.  పలు సంస్థలు, ప్రభుత్వాలకు అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసులను అందచేస్తోంది.

సర్వే ముఖ్యాంశాలు..
► పరిస్థితులు సాధారణమయ్యేందుకు సమర్థమైన వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడమే ముఖ్యమన్న 61 శాతం..
► అందరికీ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావాలంటున్న 71 శాతం 
► సగం మంది కంటే ఎక్కువకే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావొచ్చంటున్న 66 శాతం
► వ్యాక్సిన్‌ డీల్స్‌ 2021లోనే పుంజుకునే అవకాశం
► మహమ్మారి సమసిపోతుందని 52 శాతం, ఆర్థికరంగం కోలుకుంటుందని 45 శాతం
► కోవిడ్‌ అనంతరం వర్చువల్‌ హెల్త్‌కేర్‌ డెలివరీ అధిక శాతం వినియోగం
► పేషెంట్లను ప్రత్యక్షంగా కాకుండా ఇతర మాధ్యమాల్లో పరిశీలించటం పెరుగుతుందన్న 35 శాతం
► మహమ్మారి అంతమయ్యాక తమ గురించి ప్రజల్లో మంచి అభిప్రాయం పెరగొచ్చన్న 50 శాతం బయో ఫార్మా ఎగ్జిక్యూటివ్‌లు
► యూఎస్‌లో వర్చువల్‌ హెల్త్‌కేర్‌ డెలివరీ అధిక వినియోగం ద్వారా ‘న్యూ నార్మల్‌’ఏర్పడుతుందని 75 శాతం మంది ఆశాభావం
► మహమ్మారి త్వరలోనే మాయమవుతుందని, 2021 ద్వితీయార్ధం కల్లా ‘న్యూనార్మల్‌’కు చేరుకుంటామని 64% హెల్త్‌కేర్‌ ఇండస్ట్రీ లీడర్లు సర్వేలో చెప్పారు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు