ఘనంగా సైన్స్‌కాంగ్రెస్‌

24 Nov, 2014 02:59 IST|Sakshi

మాక్లూర్ : ప్రజలు మూఢనమ్మకాలను వదిలి పెట్టి, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని దాస్‌నగర్ శివారులో గల నవ్యభారతి గ్లోబల్‌స్కూల్‌లో ఆదివారం 22వ రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ వారోత్సావాలను ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ సైన్స్‌ను సరైన పద్ధతిలో వినియోగించుకోవాలన్నారు. సైన్స్‌పై అవగాహన లేకపోవడం మూలంగానే చాలామంది మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారని చెప్పారు.

సక్రమైన శాస్త్రీయ పద్ధతిలో సైన్స్‌ను వినియోగించుకుంటే మనందరికి వరంగా మారుతుందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సైన్స్‌కాంగ్రెస్ స్టేట్ కో-ఆర్డినేటర్ వై. నగేశ్ మాట్లాడుతూ వైజ్ఞానిక దృక్పథం, శాస్త్రీయ ఆలోచనలతో పిల్లలు ఎదగాలన్నారు. భవిష్యత్ తరాలకు మంచి విజ్ఞానాన్ని అందించాలన్నారు. జిల్లా కో-ఆర్డినేటర్ నర్ర రామారావు మాట్లాడుతూ  రాష్ట్రస్థాయి సైన్స్‌కాంగ్రెస్‌లో వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థుల నుంచి 82ప్రాజెక్టులు ప్రదర్శనకు వచ్చాయన్నారు.

ఇందులో 13 ప్రాజెక్టులను ఎంపిక చేసి జాతీయస్థాయి సైన్స్‌కాంగ్రెస్‌కు పంపుతామన్నారు. 86 మంది బాల శాస్త్రవేతలు, నిర్ధేశక ఉపాధ్యాయులు, న్యాయ నిర్ణేతలు, విద్యావేత్తలు, శాస్త్రజ్ఞులు, వివిధ శాఖల అధికారులు పాల్గొంటున్నారని చెప్పారు. అనంతరం కంటి, దంత వైద్యశిబిరాలు నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ పోచాద్రి, ఎన్‌జీఎస్ చైర్మన్ సంతోష్, ప్రిన్సిపాల్ శ్రీదేవి, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు