జీఎంఆర్ స్పింటెక్స్‌లో కార్మికుల అస్వస్థత

22 May, 2016 02:53 IST|Sakshi
జీఎంఆర్ స్పింటెక్స్‌లో కార్మికుల అస్వస్థత

50మందికి వాంతులు విరేచనాలు!
గుట్టుచప్పుడు కాకుండా వైద్యం..
మీడియాను లోనికి    అనుమతించకుండా ఆంక్షలు
ఐదుగురు రిమ్స్ సర్జన్లు, పదిమంది సిబ్బందితో స్పింటెక్స్‌లో క్యాంప్

 
 
 జైనథ్ : మండలంలోని భోరజ్ గ్రామం వద్ద ఉన్న జీఎంఆర్ స్పింటెక్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుమారు 50మంది కార్మికులు అస్వస్థకు గురయ్యారు. నాలుగు రోజుల కిందట అక్కడ పనిచేస్తున్న ఓ నలుగురు కూలీలకు వాంతులు, విరేచనాలు కావడంతో యాజమాన్యం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కి తరలించి చికిత్సలు చేయించింది.  శుక్రవారం రాత్రి సుమారు 50మంది కార్మికులు అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో స్పింటెక్స్ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా రిమ్స్‌కు చెందిన ఐదుగురు సర్జన్లను, మరో ఐదుమంది సిబ్బందిని పిలిపించుకొని వైద్యం చేయించారు. విషయం తెలుకున్న ‘సాక్షి’ ఫ్యాక్టరీ వద్దకు వెళ్లగా, అక్కడి సిబ్బంది లోనికి అనుమతించలేదు. తమ ఎండీ అనుమతి లేనిదే లోనికి పంపించమని చెప్పారు. కాగా కార్మికులకు ఎండదెబ్బ తగిలిందని, పరిస్థితి బాగానే ఉందని అక్కడి అధికారులు చెబుతున్నప్పటికి కూడ మీడియాపై ఆక్షంలు విధించడంతో లోపల కార్మికుల పరిస్థితి ఎలా ఉందనేదానిపై ఇంకా స్పష్టత లేదు. కార్మికులకు ఫూడ్ పాయిజన్, లేదా కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా సోకి ఉండవచ్చని తెలుస్తోంది. అంతా బాగానే ఉన్నప్పటికి కూడా అస్వస్థకు గురైన కూలీలను చికిత్స కోసం అన్ని సౌకర్యాలు ఉన్న రిమ్స్‌కి తరలించకుండా, వసతులు లేని ఫ్యాక్టరీలోనే వైద్యులను పిలిపించుకొని వైద్యం చేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.

రోగులను హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తే వారికి మరింత నాణ్యమైన వైద్యం అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. ఇదే విషయమై రిమ్స్ డెరైక్టర్ అశోక్‌ను సంప్రదించగా.. ఫ్యాక్టరిలో స్వంత మందుల ఖర్చుతో వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పడంతో వైద్యులను పంపించామని తెలిపారు. అయితే రోగుల వద్దకు వెళ్లి వారికి చికిత్సలు చేయడం మంచిదే అయినప్పటికి కూడా, బేల మండలంలోని బెదోడ గ్రామంలో వారం రోజుల క్రితం ఫుడ్‌పాయిజన్‌తో 90మంది అస్వస్థకు గురవ్వడంతో రిమ్స్‌లోనే చికిత్సలు అందించిన వైద్యులు, ఒక ప్రెవేటు సంస్థ కోసం తమ రోజువారీ విధులను వదిలి వెళ్లి మరీ చికిత్సలు చేయడం విడ్డూరంగా ఉంది.

షిప్టుల పేరుతో వలస కూలీలతో గొడ్డు చాకిరీ చేయించుకునే ఫ్యాక్టరీ యాజమాన్యం, అస్వస్థకు గురైన కూలీలను అన్ని సౌకర్యాలు ఉండే ఆసుపత్రికి తరలించకుండా ఏదో తూతూమంత్రంగా వైద్యులతో సెలైన్లు ఎక్కించి, మందుల ఇప్పించడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళలో జర్గరానిదేదైన జర్గి కూలీల ఆరోగ్య పరిస్థితి విషమిస్తే తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ  ఇకనైనా యాజమాన్యం కూలీలకు తాగు నీరు, ఆహార వసతులను మెరగుపర్చి, కూలీలకు నాణ్యమైన చికిత్సలు అందిస్తే బాగుంటదని అంతా భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు