పాలమూరులో మినీ శిల్పారామం

27 Jul, 2019 10:08 IST|Sakshi
మినీ శిల్పారామం నిర్మాణ నమూనా మ్యాప్‌ను అధికారులతో కలిసి పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌(ఫైల్‌)

నిర్మాణానికి రూ.8కోట్లు విడుదల  

ఫుడ్‌కోర్ట్, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆడిటోరియం

త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం

పాలమూరు: పాలమూరు పట్టణం పర్యాటకులను ఆకట్టుకోవడానికి మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే స్థానికంగా కొన్ని ఆహ్లాదకరమైన ప్రాంతాలు ఏర్పాటు కాగా అదే తరహాలో మరో నూతన పార్క్‌ను ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుగుతుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్‌నగర్‌ పట్టణంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా మయూరి పార్క్, మినీ ట్యాంక్‌బండ్, మోడ్రన్‌ రైతుబజార్‌ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చూట్టారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌ ప్టణానికి మినీ శిల్పారామం ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.53ను శుక్రవారం విడుదల చేసింది. ఈ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.8కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

అన్ని హంగులతో..
హైదరాబాద్‌లోని శిల్పారామానికి ఏమాత్రం తీసిపోని విధంగా మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఏర్పాటు చేసే మినీ శిల్పారా మం ఉండనుంది. అదే నమూనాను తీసుకొని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ ఉన్న వాటితో  పాటు మరికొన్ని అదనంగా ఏర్పాటు చేయడానికి ప్రణాళిక తయారు చేస్తున్నారు.  ప్రధాన ముఖ ద్వారం, పచ్చిక బయళ్లు, ఫౌంటెన్‌లు, రకరకాల మొక్కలు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక ఆటస్థలం, పెద్దలు సేదతీరడం కోసం పార్కు, వాకింగ్‌ ట్రాక్స్‌ను, వివిధ రకాల వంటకాలతో ఫుడ్‌కోర్ట్, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియం, సమావేశాల కోసం కాన్ఫరెన్స్‌హాల్, ఫంక్షన్‌హాల్, చేనేత, హస్తకళల స్టాల్స్, పల్లెదనం ఉట్టిపడేలా గ్రామీణ వాతావరణంలో ఉండే ఎద్దుల బొమ్మలు, రైతుల బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు.

పట్టణ నడిబొడ్డున మినీ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌కు అనుకోని పట్టణ ప్రజలు పల్లెలో ఉండే వాతావరణాన్ని ఆహ్లాదించే విధంగా ఈ శిల్పారామాన్ని ఏర్పాటుచేయనున్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణానికి మినీ శిల్పారామాన్ని మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి మహబూబ్‌నగర్‌ పట్టణ ప్రజల తరఫున మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్‌నగర్‌కి ప్రత్యేక ఆకర్షణగా మినీ శిల్పారామాన్ని రూపొందిస్తామని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేయబోయే మినీ శిల్పారామం పట్టణం మధ్యలో ఉండటం వల్ల పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా మినీ శిల్పరామం సందర్శించే అవకాశం ఉంది. అన్ని ప్రాంతాల ప్రజలకు అనువైన స్థలంలో దీనిని నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మినీ ట్యాంక్‌బండ్‌కు సమీపంలో దీనిని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అవసరమైన ప్రణాళిక తయారు చేయడం జరిగింది.

హైదరాబాద్‌లో ఉన్న శిల్పారామం నమూన పద్ధతిలో మినీ శిల్పారామంగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతుంది. మహబూబ్‌నగర్‌ను ఒక టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దడానికి ఎలాంటి అభివృద్ధి పనులకు అయిన శ్రీకారం చుట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే మంత్రి ప్రకటించారు. దీంతో పర్యాటకులు రెండు రోజుల పాటు పాలమూరులో బస చేసే విధంగా ఆలయాలు, పార్క్‌లను నిర్మాణం కానున్నాయి. ఇప్పటికే మయారీ పార్క్‌ సుందరంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఇటీవల పిల్లల మర్రిలో మ్యూజియం ప్రారంభం చేసి దాంట్లో ఎంతో విలువైన సంపదను భద్రపరిచారు. దీంతో పాటు ట్యాంక్‌ బండ్‌ సమీపంలో నెక్లెస్‌ రోడ్‌ ఏర్పాటుకు కూడా శ్రీకారం చుడుతున్నారు. 

మరిన్ని వార్తలు