నేర రహిత సమాజమే లక్ష్యం 

14 Mar, 2018 09:59 IST|Sakshi
కాలనీవాసులతో మాట్లాడుతున్న సీపీ దుగ్గల్‌

రామగుండం పోలీస్‌ కమినర్‌ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌

తిలక్‌నగర్‌లో పోలీసుల నిర్బంధ తనిఖీలు 

ధ్రువీకరణ పత్రాలు లేని 40 వాహనాలు స్వాధీనం

పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు

మంచిర్యాల క్రైం: నేరరహిత సమాజ స్థాపన లక్ష్యంగా నిర్బంధ తనిఖీలు చేపడుతున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ తెలిపారు. పట్లణంలోని తిలక్‌నగర్‌ కాలనీలో మంగళవారం ఉదయం 4నుంచి 8గంటల వరకు కార్డెన్‌ సెర్చ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పోలీస్‌ వ్యవస్థ పని చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే తిలక్‌నగర్‌లో నిర్బంధ తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువీకరణపత్రాలు లేని 31 ద్విచక్రవాహనాలు, ఎనిమిది ఆటోలు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అలాగే అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు  వెల్లడించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. యువత పోలీస్‌మిత్ర వలంటరీగా చేరి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను సీపీ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో బెల్టుషాపుల నిర్వహణతో పాటు గుడుంబా, అంబార్‌ విక్రయాలు, పేకాట జోరుగా సాగుతున్నాయన్నారు.

ఈమేరకు సీపీ స్పందిస్తూ కాలనీకి జనమైత్రి పోలీస్‌ ఆఫీసర్‌గా గోవింద్‌ సింగ్‌ ఏర్పాటు చేశామని, సమస్యలుంటే ఆయనకు తెలియపర్చాలన్నారు. తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్‌రావు,  ఏసీపీ గౌస్‌బాబా, సీఐలు చంద్రమౌళి, ప్రమోధ్‌రావు, ప్రతాప్, ట్రాఫిక్‌ సీఐ సతీష్, జన్నారం, సీసీసీ, లక్సెట్టిపేట, శ్రీరాంపూర్, హాజీపూర్‌ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు