పోలింగ్ పెంపే లక్ష్యం

21 Apr, 2014 05:17 IST|Sakshi

బంజారాహిల్స్, న్యూస్‌లైన్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 53 శాతం మాత్రమే ఉన్న పోలింగ్‌ను 75 శాతానికి పెంచడమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘నో యువర్ పో లింగ్ బూత్’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ వెల్లడించారు. ఓటర్ స్లిప్‌ల పంపిణీ, జాబితాలపై ఆదివారం ఆయన బంజారాహిల్స్ రోడ్‌నెం.14లోని బాదం సరోజాదేవి పాఠశాలలో ఏర్పాటు చేసిన  పోలింగ్‌బూత్‌ను జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా, జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోనల్ కమిషనర్ రొనాల్డ్ రాస్, డీఎంసీ సోమరాజుతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా సోమేష్‌కుమార్ మాట్లాడుతూ, నగరంలో పోలింగ్ శాతం తక్కువగా ఉండటానికి కారణం పోలింగ్ కేంద్రాలు ఎక్కడున్నాయో, జాబితాలో పేరు ఉందో లేదో, ఓటరు స్లిప్‌లు అందాయో లేదో అనే విషయాలు ఓటర్లకు తెలియకపోవడమే కారణమని ఓ సర్వేలో తేలిందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 40 వేల మంది ఓటర్ల పేర్లు జాబితాలో లేవని తెలియడంతో తమకు ఈ ఆలోచన వచ్చిందన్నారు.  

నగరంలో 3091 పో లింగ్ బూత్‌లలో ఓటర్లకు తమ పోలింగ్ బూత్‌లపై అవగాహన, ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చూసుకునే నిమిత్తం పది రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేశామని చెప్పారు. బీఎల్‌ఓలు గైర్హాజరైతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. వందశాతం ఓట ర్లకు ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేస్తామన్నారు. 24 గంటలు పని చేసే 040-21111111 నంబర్‌లో తమ బీఎల్‌ఓ పేరు, తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ పోలింగ్ కేంద్రాల పని తీరును 35 మంది సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు.
 
 30న థియేటర్ల బంద్
 
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈనెల 30న అన్ని థియేటర్లు, షాపింగ్ మాల్స్, పార్కులు, కార్యాలయాలు, పరిశ్రమలు మూయించి వేస్తామని సోమేష్‌కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే థియేటర్లు, ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశామన్నారు.ఇందు కోసం 15 స్క్వాడ్స్ రంగంలోకి దించుతున్నామని, ఎక్కడైనా తెరిచినట్లు తెరిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని బంద్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీని వల్ల ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు