ప్రాథమిక విద్య పటిష్టతే ధ్యేయం

26 Nov, 2014 23:43 IST|Sakshi

 వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలను డిసెంబర్ నెల నుంచి ఎంఈవోలు తనిఖీ చేయాలని జిల్లా విద్యాధికారి సూచించారు. స్థానిక మెరీయానాట్స్ పాఠశాల ఆవరణలో జిల్లా హెచ్‌ఎంలు, ఎంఈవోలతో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రతీరోజు పాఠశాలలకు పిల్లల తల్లిదండ్రులు వచ్చి పాఠశాలల పనితీరును పరిశీలించాలనీ, కానీ టీచర్లను ప్రశ్నించొద్దని హితవు పలికారు. ఎదైనా సమస్య ఉంటే ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలన్నారు. తన లక్ష్యమంతా ప్రాథమిక విద్యను పటిష్టంగా తయారు చేయడమేనన్నారు.

విద్యార్థులకు బట్టి వ్యవస్థను అలవాటు చేయకుండా, విభిన్న రంగాల్లో ప్రతిభావంతులుగా తయారయ్యే విధంగా చదవడం, రాయడంతోపాటు చతుర్విధ వ్యవస్థలకు అలవాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరుపై వచ్చే నెల నుంచి బృందాల తనిఖీలుంటాయన్నారు. ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో విద్యార్థులకు  స్వయంగా పాఠ్యంశాల బోధన చేయాలన్నారు. పాఠశాలలను కాపాడుకోవలసి బాధ్యత ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులపై ఉందన్నారు. విద్యార్థులను పాఠశాలలకు క్రమం తప్పకుండా పంపించే బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు.

 జిల్లా వ్యాప్తంగా 344 మంది సింగిల్ టీచర్లు పనిచేస్తున్నారని, వారి ప్రాధాన్యతకు తప్పకుండా గుర్తింపునిస్తామన్నారు. గతేడాదికంటే ఈ ఏడాది పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించడమే తమ అంతిమ లక్ష్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా 170 భవనాలు  కూలడానికి సిద్ధంగా ఉన్నాయని, వాటిని పునరుద్ధరించడానికి జిల్లా పరిషత్ సీఈవో అనుమతి ఇచ్చారన్నారు. ఇంక ఎక్కడైనా శిథిలావస్థలో పాఠశాలల భవనాలుంటే ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సమాచారమివ్వకుండా దీర్ఘకాలికంగా పాఠశాలలకు గైర్హాజర్ అయిన ఉపాధ్యాయుల వివరాలను వెంటనే తనకు అందించాలని ఎంఈవోలను ఆదేశించారు.

ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టు జిల్లా విద్యాధికారి వెబ్‌సైట్‌లో ఉందనీ, ఏమైనా తప్పులుంటే సరిచేసి అందుబాటులో ఉన్న ఎంఈవోలకు ఇవ్వాలని ఉపాధ్యాయులకు తెలిపారు. సీనియారిటీ లిస్టును అధికారికంగా డిసెంబర్ 2న విడుదల చేస్తామన్నారు. ఉపాధ్యాయులు మెడికల్ లీవులను దుర్వినియోగం చేస్తే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలుంటే ఉపాధ్యాయులు తనను నేరుగా ఫోన్‌లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎంఈవో గోవర్ధన్‌రెడ్డి, ధారూరు ఎంఈవో శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 ఉపాధ్యాయులూ.. తీరు మార్చుకోండి
 చేవెళ్ల రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల తీరు మారాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ రమేశ్ అన్నారు. మండలంలోని దామరగిద్ద ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య తీరుపై గ్రామ సర్పంచ్ మధుసూదన్‌గుప్త ఫిర్యాదు చేయటంతో బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని ఉపాధ్యాయులు ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్నించారు.

అనంతరం పాఠశాలలోని అన్ని తరగతులు తిరిగి ఉపాధ్యాయుల బోధన తీరును తెలుసుకునేందుకు విద్యార్థులకు వివిధ ప్రశ్నలు వేశారు. 4,5,7,8వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, స్వయంగా విద్యార్థుల పేపర్లను దిద్దారు. ఉపాధ్యాయుల బోధన సక్రమంగా లేదని, అందుకే పాఠశాల విద్యార్థుల పురోగతి బాగా లేదన్నారు.  ఉపాధ్యాయులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. లేకుంటే కఠినచర్యలు తప్పవన్నారు. విద్యార్థుల పరిస్థితిని చూసి ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్యకు మోమో జారీ చేస్తున్నట్లు ప్రకటించారు.

 సర్పంచ్ ఫిర్యాదుతోనే ఆకస్మిక తనిఖీ..
 గ్రామ సర్పంచ్ మధుసూదన్ గుప్త బుధవారం ఉదయం పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య రాలేదు. ఎందుకు రాలేదని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఈ విషయాన్ని డీఈఓకు సర్పంచ్ ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన డీఈఓ ఎంఈఓను తనిఖీకి పంపుతానని చెప్పారు. కానీ డీఈఓ రమేశ్ తానే పాఠశాలను సందర్శించేందుకు ఆకస్మికంగా పాఠశాలకు వచ్చారు.

మరిన్ని వార్తలు