సూసైడ్‌ స్పాట్‌గా మారిన గోదావరి బ్రిడ్జి.!

16 Oct, 2019 08:51 IST|Sakshi

సాక్షి, గోదావరిఖని(రామగుండం) : ‘భార్యాభర్తలు గొడవ పడ్డారు.. క్షణికావేశంలో భార్య ఆటో ఎక్కి గోదావరి బ్రిడ్జివద్దకు వెళ్లింది.. అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్‌ 100 నంబర్‌కు ఫోన్‌ చేయడంతో అక్కడే విధినిర్వహణలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు అప్రమత్తమై ఆమెను అదుపులోకి తీసుకుని  ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గోదావరిఖని టూటౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు అదే ఆటోలో బాధితురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు గోదావరి బ్రిడ్జి సమీపంలో ఇటీవల కాలంలో పెరిగిపోయాయి’. 

ఇన్నాళ్లు గోదారి ఎండిపోయి తాగునీటి కోసం గోస పడుతుండగా.. ఇప్పుడు నిండుకుండలా మారిన గోదావరితో మరో లొల్లి మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరిబ్రిడ్జికి ఐదు కిలో మీటర్ల దూరంలో సుందిళ్ల బ్యారేజీ నిర్మించడంతో నీటిమట్టం భారీగా పెరిగింది. రివర్స్‌ పం పింగ్‌తో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీటి నిల్వలు పెరిగిపోయాయి. ఈక్రమంలో ఈ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. ఇటీవల కాలంలో గోదావరిబ్రిడ్జి వద్ద ఆత్మహత్యయత్నాలకు పాల్పడే వారి సంఖ్య కూడా పెరిగింది. గడిచిన రెండు నెలల్లో 15 మంది గోదావరిబ్రిడ్జి వద్ద ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు అప్రమత్తమై తొమ్మిది మందిని రక్షించగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. 

తలనొప్పిగా మారిన ఆత్మహత్యలు..
గోదావరినదిలో ఆత్మహత్య సంఘటనలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. క్షణికావేశంలో వస్తున్న వ్యక్తులు గోదావరిబ్రిడ్జిపైకి చేరుకుని నదిలో దూకుతున్నారు. ఈవిషయాన్ని పలువురు గమనించి పోలీసులకు చేరవేడడంతో బాధితులను రక్షించేందుకు పోలీసులకు తలకుమించిన భారంగా మారుతోంది. నిండుగోదావరి సందర్శకులకు సంతోషాన్నిస్తుండగా పోలీసులకు మాత్రం తలనొప్పిగా మారింది. ప్రతీ రెండురోజులకో సంఘటన జరుగుతుండడంతో పోలీసులు సీరియస్‌గా దృష్టిసారించారు. 

అవుట్‌ పోస్టు ఏర్పాటు..
గోదావరి బ్రిడ్జిపై ప్రమాదాలు తగ్గించడంతో పాటు ఆత్మహత్య ప్రయత్నాలను అడ్డుకునేందుకు టూటౌన్‌ పోలీసుల ఆధ్వర్యంలో గత నెల 26 ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడేవారిని గుర్తించి, వెంటనే కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపుతున్నారు. అయినా కొంతమంది క్షణికావేశంలో వచ్చి ఎవరికీ తెలియకుండా నదిలో దూకి చనిపోయిన సంఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. 

ఫెన్సింగ్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు..
గోదావరినదిపై ఉన్న రెండు బ్రిడ్జీలకు ఇరువైపులా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్టీపీసీ యాజమాన్యం సహకారంతో బ్రిడ్జిపై ఉన్న రెయిలింగ్‌కు ఆనుకుని ఆరుఫీట్ల ఎత్తు వరకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  

>
మరిన్ని వార్తలు