భద్రాచలంలో పెరిగిన గోదావరి వరద

9 Sep, 2019 10:32 IST|Sakshi

ఒకేరోజు రెండు ప్రమాద హెచ్చరికలు జారీ

ఎగువ ప్రాంతాల నుంచి చేరుతున్న వరదనీరు

ముంపు ప్రాంతాల్లో అధికారుల అప్రమత్తం

సాక్షి, భద్రాచలం: గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాలుగు రోజులుగా వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 43 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం రాత్రి 10 గంటలకు 51 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. రాత్రి 7 గంటలకు 50.06 అడుగులకు చేరింది.

గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్, ఇంద్రావతి, తాలిపేరు నదుల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు  చెపుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 53 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉంటూ ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి, చర్ల మండలం దండుపేట గ్రామాలకు చెందిన సుమారు 40 కుటుంబాల వారితో పాటు భద్రాచలంలోని కొత్తకాలనీ, రెవెన్యూ కాలనీ, సుభాష్‌నగర్‌ కాలనీల ప్రజలను సైతం అప్రమత్తం చేశా రు. కొందరిని భద్రాచలంలోని యూపీఎస్, నన్నపనేని మోహన్‌ ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రాలకు తరలించారు.  

50 అడుగులు దాటినట్లు చూపుతున్న సూచిక

స్లూయీస్‌ లీకులే కారణం..? 
భద్రాచలంలో కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన స్లూయిస్‌ లీకుల వల్లే గోదావరి వరద నీరు అయా కాలనీల్లోకి చేరింది. వాస్తవానికి గోదావరి వరద నీరు ఈ స్లూయీస్‌ల ద్వారా కాలనీల్లోకి వచ్చే సమయంలో మూడు మోటార్ల ద్వారా వరద నీటిని ఎప్పటికప్పుడు తోడి గోదావరిలోకి పంపా ల్సి ఉంది. అయితే ఈ మూడు మోటార్లలో రెండు పనిచేయక పోవడంతో అశోక్‌నగర్, కొత్తకాలనీల్లోకి స్లూయీస్‌ల ద్వారా వరద నీరు చేరిందని ఆయా ప్రాంతాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

నిలిచిన రాకపోకలు.. 
భద్రాచలం–వెంకటాపురం మార్గంలో ఎటపాక, కన్నాయిగూడెం వద్ద రహదారిని గోదావరి వరదనీరు ముంచెత్తడంతో ప్రయాణికులు మారాయిగూడెం మీదుగా ములకపాడుకు చేరుకొని అక్కడి నుంచి చర్లకు వెళుతున్నారు. దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక, పర్ణశాల ప్రాంతాల్లోని రహదారిని కూడా వరదనీరు ముంచెత్తింది. చర్ల మండలంలోని కుదునూరు, సుబ్బంపేట గ్రామాల్లోని రోడ్లపై రెండు అడుగుల చొప్పున వరదనీరు చేరింది. చర్ల మండలంలోని కొత్తపల్లి–దండుపేట గ్రామాల మధ్యలో ఉన్న రహదారి పై ఆరు అడుగుల మేర వరదనీరు చేరడంతో ఈ మార్గంలో రెండు రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి కూనవరం మీదుగా రాజమండ్రి వెళ్లే బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. పోలీసులు సైతం ఆ మార్గాల్లో బస్సులను పంపవద్దని సూచించడంతో బూర్గంపాడు, కుక్కునూ రు మీదుగా సర్వీసులను దారి మళ్లించారు. 

మరిన్ని వార్తలు