గోదావరి పుష్కరాలు

22 Sep, 2014 00:51 IST|Sakshi
గోదావరి పుష్కరాలు

సాక్షి ప్రతినిధి,    ఆదిలాబాద్ : గోదావరి పుష్కరాలను వచ్చే ఏడాది మహా కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు నడుం బిగించింది. ఇందుకోసం ముందస్తు ఏర్పాట్లకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. 12 పుష్కరాల అనంతరం ఈ పుష్కరాలు వస్తుండటంతో వీటిని మహాకుంభ పుష్కరాలుగా పండితులు పేర్కొంటున్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి వస్తున్న పుష్కరాలు కావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గోదావరిలో పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించారు. 18 ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని భావిస్తోంది. 2015 జూలై 14 నుంచి 25వ తేదీ పుష్కరాలు కొనసాగనున్నాయి. ఈ రోజుల్లో జిల్లాలోనే సుమరు 1.20 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానామాచరించే అవకాశాలున్నాయని అధికార యంత్రాంగం అంచనా వేసింది.

 గత పుష్కరాల్లో 73 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించినట్లు తేలింది. అలాగే ఈ నది పరీవాహక ప్రాంతాలైన నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కూడా భారీ సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానం ఆచరించే అవకాశాలుండటంతో ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. గతేడాది జరిగిన గంగానది మహాకుంభ మేళలో ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఇంత భారీ మేళాను నిర్వహణ ఏర్పాట్ల తీరును అధ్యయనం చేయాలని ఆదిలాబాద్ అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇందుకోసం అధికారుల బందం వచ్చే నెలలో అలహాబాద్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నోడల్ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో తెలిపారు.

 మూడు జిల్లాల పరిధిలో..
 దేశంలో ప్రఖ్యాతిగాంచిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం, గూడెం లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయం గోదావరి నది తీరంలోనే ఉన్నాయి. జిల్లాలో ఈ రెండు చోట్ల ఎక్కువ మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు భావిస్తున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరం, ఖమ్మం జిల్లా భద్రాచలం వంటి ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో పవిత్ర గోదావరి స్నానాలు చేస్తారు.

తెలంగాణాలోని వివిధ జిల్లాలతో పాటు, ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఆయా జిల్లాల్లో ఇప్పటికే నిర్మించి ఉన్న పుష్కర ఘాట్‌లను మరమ్మతులు చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశాలందాయి. జిల్లాలో ఎనిమిది పుష్కర ఘాట్లకు మరమ్మతులు, వెడల్పు చేయాలని నిర్ణయించారు. అలాగే మరికొన్ని చోట్ల ఈ ఘాట్‌లను యుద్ధ ప్రాతిపదికన నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. వీటి నిర్మాణాల కోసం నీటి పారుదల శాఖ అంచనాలను రూపొందిస్తోంది.

 రైళ్ల నిలుపుదలకు చర్యలు
 బాసర మీదుగా వెళ్లే ఏడు రైళ్లను పుష్కరాల సమయంలో బాసర రైల్వే స్టేషన్‌లో నిలుపుదల ఉండేలా చూడాలని రైల్వే శాఖ మంత్రిని కలవాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా దేశ వ్యాప్తంగా ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం కలగనుంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికను రూపొందిస్తున్నారు.

 ముమ్మర ఏర్పాట్లు
 ఇప్పటికే ఉన్న పుష్కర ఘాట్‌లను మరమ్మతులు చేయడం, కొన్నింటిని వెడల్పు చేయాలని నిర్ణయించారు. నదిలో దిగి స్నానం చేయలేని వద్దులు, చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా షెవర్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, బట్టలు మార్చుకునే తాత్కాళిక గదులు, వీధిదీపాల కోసం ప్రత్యేక విద్యుత్ లైన్ల నిర్మాణం వంటి ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ప్రతి వంద మంది భక్తులకు ఒక పారిశుధ్య సిబ్బంది చొప్పున నియమించాలని, అలాగే నదిలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోతే రక్షించేందుకు గజ ఈతగాళ్లను నియమించాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు