ఎండి'నది'

3 Mar, 2018 08:53 IST|Sakshi
భద్రాచలం వద్ద పిల్లకాల్వలా కనిపిస్తున్న గోదావరి

ఎడారిగా మారిన గోదావరి

భద్రాద్రి వద్ద 4.8 అడుగులు

వేసవిలో పూర్తిగా అడుగంటనున్న నీళ్లు

భద్రాచలం: నిండు గోదావరి నది ఎండిపోయింది. నీళ్లు లేక పూర్తిగా అడుగంటింది. భద్రాచలం వద్ద గురువారం 4.8 అడుగుల నీటిమట్టం ఉంది. గోదావరి వద్ద నూతన బ్రిడ్జి పనుల కోసమని అడ్డుకట్ట వేయడం వల్లనే ఆమాత్రం నీటిమట్టం ఉంది. మిగతా చోట్ల గోదావరి పిల్లకాల్వలా కనిపిస్తోంది. గోదావరిలో ప్రస్తుతం నీళ్లు లేక ఇసుక తిన్నెలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే, వేసవి కాలం పూర్తయ్యే నాటికి గోదావరిలో నీళ్లు ఉండడం కష్టమేనని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. గతేడాది మార్చి 1న, భద్రాచలం వద్ద 6.6 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, మే నెలలో 5 అడుగుల నీటిమట్టం ఉంది. 2016 మే 31న అతి తక్కువగా 3.4అడుగుల కనిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం మార్చి మొదటి వారంలోనే నీటిమట్టం పూర్తిగా అడుగంటింది.

ఈ ఏడాది పూర్తి స్థాయిలో వర్షాలు లేకపోవడంతో గోదావరి నదికి వరదలు కూడా రాలేదు. మొదటి ప్రమాద హెచ్చరికకు కూడా చేరువ కాలేదు. ఇలాంటి పరిణామాలు గోదావరి నీటిమట్టంపై ప్రభావం చూపాయి. ఈ సంవత్సరం ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే జరిగితే గోదావరిలో నీళ్లు పూర్తిగా అడుగంటే ప్రమాదముంది. ఈ ప్రభావంతో పరివాహక ప్రాంతంలో తాగునీటి ఎద్దడి నెలకొననుంది. ఇప్పటికే బోరుబావుల్లో నీళ్లు పూర్తి స్థాయిలో రావట్లేదు. అడవులు అంతరించుకుపోతుండడం, ఏజెన్సీ ప్రాంతంలో జామాయిల్‌ సాగు విపరీతంగా పెరుగుతుండడం, ఇసుక తోడేస్తుండడం వల్ల ఏడాదికేడాదికి నీళ్లు అడుగంటిపోతున్నాయి.

మరిన్ని వార్తలు