ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోత

12 Feb, 2020 04:25 IST|Sakshi

నంది, గాయత్రి ద్వారా మిడ్‌మానేరుకు పంపింగ్‌

మిడ్‌మానేరు నుంచి లోయర్‌ మానేరుకు నీటి విడుదల

ఐదు టీఎంసీల మేర ఎత్తిపోసేందుకు నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత మళ్లీ మొదలైంది. లోయర్‌ మానేరు డ్యామ్‌(ఎల్‌ఎండీ)లో నీటి నిల్వలు తగ్గడంతో ఎల్లంపల్లి దిగువన ఉన్న పంపుల ద్వారా నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల ప్రకారం ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా ఎల్‌ఎండీకి 5 టీఎంసీల మేర నీటిని తరలించాలని నిర్ణయించినట్లు నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఎస్సారెస్పీ–2 కింద చివరకు చేరిన నీరు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నింపుతూనే ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్‌ఎండీలను పూర్తిగా నింపారు. 24 టీఎంసీల పూర్తి సామర్థ్యాన్ని చేరిన అనంతరం ఎల్‌ఎండీ నుంచి దాని కింద ఉన్న ఎస్సారెస్పీ–2 ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించేందుకు నీటిని వినియోగిస్తూ వచ్చారు.

ఎస్సారెస్పీ–2 కింద నిర్ణయించిన 592 చెరువులను నింపుతూ, వరంగల్‌ రూరల్, ఖమ్మం, జనగాం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 3.97 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించారు. దీంతో సూర్యాపేట జిల్లాలో చిట్టచివర ఉన్న పెన్‌పహాడ్‌ మండలంలోని మాచారం రాయిచెరువుకు గోదావరి నీళ్లు చేరాయి. ఎస్సారెస్పీ–2కి నీటి విడుదల జరగడంతో ఎల్‌ఎండీలో నిల్వ 24 టీఎంసీలకు గానూ 8.31 టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుతం ఎల్‌ఎండీ నుంచి మరింత నీటి విడుదల అవసరాలున్న నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్‌మానేరు మీదుగా తరలించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రస్తుతం ఎల్లింపల్లిలో 20.18 టీఎంసీలకు గానూ 13.40 టీఎంసీల నీటి లభ్యత ఉంది.

అక్కడి నుంచి నంది, గాయత్రి పంప్‌హౌస్‌లలోని 5 మోటార్లను సోమవారం రాత్రి 9 గంటలకు ప్రారంభించి సుమారు 16వేల క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు. రాత్రి సమయంలో విద్యుత్‌ కొనుగోళ్ల ధరలు తక్కువ ఉంటున్న నేపథ్యంలో రాత్రిపూట 8 గంటల పాటు నడపాలని ప్రభుత్వ పెద్దలు సూచించినట్లు చెబుతున్నారు. దీంతో మంగళవారం సైతం ఇదేరీతిన మోటార్లను నడిపించి నీటిని మిడ్‌మానేరుకు ఎత్తిపోశారు. ఇక మిడ్‌మానేరులో 25 టీఎంసీల మేర నిల్వ తగ్గకుండా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎల్‌ఎండీకి తరలిస్తున్నారు. కనిష్టంగా ఎల్‌ఎండీలో నిల్వలు 13 టీఎంసీలకు చేరే వరకు నీటి పంపింగ్‌ కొనసాగే అవకాశం ఉంది. ఇక నీటి ఎత్తిపోతలతో ఎల్లంపల్లిలో నిల్వలు తగ్గితే, ఎగువ మేడిగడ్డ నుంచి నీటిని తరలించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

మరిన్ని వార్తలు