జలదిగ్బంధంలో ఎడ్జెర్ల

11 Nov, 2019 03:24 IST|Sakshi

ఎస్సారెస్పీ కాల్వకు గండి పెట్టిన కొందరు వ్యక్తులు 

గ్రామాన్ని చుట్టుముట్టిన గోదావరి జలాలు

రాత్రంతా బిక్కుబిక్కు మంటూ గడిపిన గ్రామస్తులు 

మరిపెడ రూరల్‌: మబ్బు పట్టలేదు.. వర్షం కురవలేదు.. కానీ ఆ గ్రామం రాత్రికి రాత్రే జలమయమైంది. తెల్లవారేసరికి ఏ వీధిలో చూసినా సెలయేరులా నీటి ప్రవాహం కనిపిస్తోంది. ఇదీ మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామంలోని పరిస్థితి. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఇటీవల ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా మండలానికి గోదావరి జలాలను విడుదల చేసింది. అయితే ఎడ్జెర్ల గ్రామ శివారులో ఉన్న పెద్ద చెరువును నింపేందుకు జేసీబీతో తాత్కాలికంగా ఓ కాల్వను తవ్వుతున్నారు.

ఈ క్రమంలో కాల్వ సగం తవ్విన తర్వాత మధ్యలో ఓ రైతు తన పంట పొలం నుంచి కాల్వ తవ్వడానికి కుదరదని అడ్డుకున్నాడు. కాగా, ఇదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శనివారం రాత్రి పది గంటల సమయంలో గ్రామ సమీపం నుంచి ప్రవహిస్తున్న ఎస్సారెస్పీ కాల్వకు గండి పెట్టి తాత్కాలికంగా తవ్విన కాల్వలోకి నీటిని వదిలారు. ఆ నీరంతా పల్లపు ప్రాంతంలోని గ్రామంలోకి చేరింది. వీధులు, ఇళ్లచుట్టూ నీరు చేరడంతో రాత్రంతా ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. గ్రామాన్ని నీరు ముంచెత్తడంతో సర్పంచ్‌ ఆదివారం స్థానిక రైతులతో కలసి వెళ్లి ఎస్సారెస్పీ కాల్వకు పెట్టిన గండిని పూడ్చారు. దీంతో గ్రామంలోకి నీటి ప్రవాహం ఆగిపోయింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా