టపాసుల గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

12 Oct, 2014 04:33 IST|Sakshi
టపాసుల గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

అబిడ్స్/దత్తాత్రేయనగర్: బేగంబజార్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫీల్‌ఖానా నింబూ మార్కెట్ ఎదురుగా ఉన్న టపాసుల గోడౌన్‌లో  శనివారం మధ్యాహ్నం భారీ మంటలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. దుకాణ యజమాని టపాకాయలు విక్రయిస్తుండగా మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. కొద్ది క్షణాల్లోనే భారీ శబ్దాలు రావడంతో స్థానిక వ్యాపారులు, కొనుగోలుదారులు పరుగులు పెట్టారు.  మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు రెండో, మూడో అంతస్తుల్లోని టాయిస్ గోడౌన్‌లోకి విస్తరించాయి. తోటి వ్యాపారులు దుకాణాలను మూసేసి మంటలు ఆర్పేందుకు సహకరించారు.
 
లెసైన్ ్సలతోనే...

శ్రీనివాస ఏజెన్సీ పేరిట రమేష్ గుప్తా చెన్నై ఎక్స్‌ప్లోజివ్ శాఖ లెసైన్స్‌తో టపాసుల హోల్‌సేల్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. మొదటి అంతస్తులో నిబంధనలకు విరుద్ధంగా  గోడౌన్ పెట్టడంతో ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఫైర్ సేఫ్టీ  నిబంధనల ప్రకారం ఇనుప బక్కెట్లు, నీరు, మంటలు ఆర్పే పరికరాలు లేకపోవడంతో ఫైరింజన్లు వచ్చేవరకు మంటలు అదుపులోకి రాలేదు. దాదాపు రూ.4 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు.
 
యజమానిపై కఠిన చర్యలు - డీసీపీ

దుకాణ యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించి మంటలను ఆర్పేందుకు సహకరించిన వ్యాపారులు, స్థానికులను ఆయన ప్రశంసించారు. టపాకాయల దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైదానాల్లోనే తాత్కాలిక టపాకాయల దుకాణాలకు అనుమతిస్తామన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో దుకాణాలకు అనుమతి ఎలా వచ్చిందో పూర్తి విచారణ చేపడతామన్నారు. రమేష్ గుప్తా పై కేసు నమోదుచేసినట్లు డీసీపీ తెలిపారు.
 
నిబంధనలు పాటించండి-ఫైర్ అధికారి

టపాసుల దుకాణాల వారు నిబంధనలు పాటించి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ అసిస్టెంట్ ఫైర్ అధికారి ఎం.భగవాన్‌రెడ్డి పేర్కొన్నారు. సమాచారం అందింన వెంటనే ఆరు ఫైరింజన్లను రప్పించామన్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పినట్లు వివరించారు.
 
సంఘటనలు ఎన్నెన్నో...


ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతంలో టపాసుల దుకాణాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. 2002లో ఉస్మాన్‌గంజ్‌లోని శాంతి ఫైర్ వర్క్స్ టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించి 13 మంది మృతి చెందారు. ఐదేళ్ల క్రితం గోషామహాల్ చందన్‌వాడీలో ఓ ఇంట్లో టపాకాయలు తయారు చేస్తుండగా నలుగురు మృతి చెందారు.

అలాగే మూడేళ్ల క్రితం బేగంబజార్ ఛత్రీ ప్రాంతంలోని హోల్‌సేల్ దుకాణంలో మంటలు చెలరేగి  టపాకాయలు కాలిబూడిదయ్యాయి.  ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. శాంతి ఫైర్ వర్క్స్ ఘటన సమయంలో  మంత్రులు, ఉన్నతాధికారులు పలు ప్రకటనలు చేసినా అవి నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
 
నగరంలో వ్యాపారం.. అనుమతులు చెన్నైలో..

టపాకాయల హోల్‌సేల్ వ్యాపారం నిర్వహించాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెన్నైలో ఎక్స్‌ప్లోజివ్ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. ఈ అనుమతి ఉంటేనే హోల్‌సేల్ దుకాణాలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ శాఖ అనుమతి సునాయాసంగా తీసుకువస్తున్న కొంతమంది, జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రద్దీ ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేయకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు