బంగారం, వజ్రాల కోసం.. వేట

14 Aug, 2019 01:01 IST|Sakshi

ఎన్‌ఎండీసీకి అన్వేషణ బాధ్యత అప్పగించే యోచన 

జీఎస్‌ఐ సహకారంతో బంగారం, తగరం వెలికితీత 

ప్రతిపాదనలు సిద్ధం చేసిన భూగర్భ వనరుల శాఖ 

జిల్లాల పునర్విభజనకు ముందు మైనింగ్‌ ఆదాయంలో నల్లగొండ జిల్లాది అగ్రస్థానం. 

పునర్విభజన తర్వాత సిద్దిపేట జిల్లా ఆదాయంలో టాప్‌లో ఉండగా, తర్వాతి స్థానాల్లో కరీంనగర్, సూర్యాపేట ఉన్నాయి.

2018–19కు సంబంధించి సిద్దిపేట జిల్లాలో 230.65 కోట్ల ఆదాయం లభించింది.  

ఖనిజ ఆదాయంలో దేశంలోనే మూడోస్థానంలో ఉన్న రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ.. ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో భూగర్భ వనరుల సంపూర్ణ సమాచారాన్ని క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు చేసింది. ఆదాయ పెంపుదలకు బొగ్గు, యురేనియం, సున్నపురాయి, మాంగనీసు, ఇనుము తదితర ఖనిజాలతోపాటు ఇతర ఖనిజాలను వెలికితీయాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా జాతీయ మైనింగ్‌ సంస్థ (ఎన్‌ఎండీసీ) సహకారంతో బంగారం, వజ్రపు నిల్వల అన్వేషణ, వెలికితీత పనులు చేపట్టాలని నిర్ణయించింది. వజ్రాల జాడపై ఎన్‌ఎండీసీ ద్వారా సూర్యాపేట జిల్లాలో ఇదివరకే ప్రాథమిక సర్వే చేయించింది. మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వజ్రాల జాడ కోసం అన్వేషణ ప్రారంభించాలని ప్రతిపాదించింది. బంగారం, వజ్రాల వెలికితీత కోసం కొన్ని ప్రాంతాలను ఎన్‌ఎండీసీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సహకారంతో గద్వాల జిల్లాలో బంగారం, వనపర్తి జిల్లా ఆత్మకూరు ప్రాంతంలో తగరం నిల్వల అన్వేషణ, వెలికితీత చేపట్టేందుకు గనులశాఖ సిద్ధమవుతోంది. 

టూరింగ్‌ స్పాట్స్‌గా... 
ఖనిజాల వెలికితీత తర్వాత ఏర్పడుతున్న భారీ గుంతలను టూరిజం కేంద్రాలుగా మార్చాలనే ప్రతిపాదనను కూడా రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ ప్రతిపాదిస్తోంది. చైనాలోని షాంఘై, రొమేనియా, పోలాండ్‌లోని పోర్ట్‌లాండ్‌ తరహాలో మైనింగ్‌ గుంతల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, బోటింగ్‌ వంటి వాటిని ఎకో టూరిజంలో భాగంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సినిమా షూటింగ్‌ స్పాట్లు, చేపల పెంపకం, సాగు, తాగునీటి వనరులుగా కూడా ఈ గుంతలను ఉపయోగించేలా తీర్చిదిద్దే ప్రణాళికలు ఉన్నట్లు మైనింగ్‌ అధికారులు చెప్తున్నారు. 
    – సాక్షి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు