పరుగులు తీస్తున్న పుత్తడి!

13 Jul, 2019 09:38 IST|Sakshi

10 గ్రాములు రూ. 34,700 

పది రోజుల్లో రూ.వెయ్యి పెరుగుదల 

కొనుగోలుదారుల్లో ఆందోళన

సాక్షి, కామారెడ్డి: కేంద్ర బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్‌ సుంకం 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన నేపథ్యంలో ఒక్కసారిగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. బడ్జెట్‌కు ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.33,700 వరకు ఉండగా, కస్టమ్స్‌ సుంకం పెరగడంతో ధర రూ.34,700 లకు చేరింది. అంటే ఒక్కసారిగా రూ. వెయ్యి వరకు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.

వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండడంతో కొనుగోళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌ కూడా కాకపోవడంతో బంగారం క్రయవిక్రయాలు తక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో బంగారంపై సుంకం పెంచడంతో ధరలు మాత్రం పెరుగుతున్నాయి. దీంతో కొనుగోళ్లు చాలావరకు పడి పోయినట్టు బంగారం వర్తకులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో అరవైకి పైగా బంగారం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ భారీ ఎత్తున బంగారం అమ్మకాలు సాగుతుంటాయి.

అయితే పెళ్లిళ్ల సీజన్‌ కాకపోవడం, ధరలు పెరగడంతో బంగారం దుకాణాలు వెలవెలబోతున్నా యి. పెరుగుతున్న ధరలను చూసి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం ధర లు పెరగడంతో బంగారం కొనేదెలా అం టూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం విక్రయదారులు కూడా అమ్మకాలు తగ్గిపోవడంతో ఇబ్బంది పడతున్నారు. సుమారు మూడు నెలల వరకు శుభ ముహూర్తాలు కూడా లేవు. అటు సీజన్‌ లేకపోవడం, ఇటు ధర పెరగడంతో బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు పని లేక ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు