-

బంగారు భవనం

29 Mar, 2018 09:22 IST|Sakshi

హైదరాబాద్‌ రైల్వే భవన్‌కు గోల్డ్‌ రేటింగ్‌

విద్యుత్‌ పొదుపులో అద్భుత ఫలితాలు  

పర్యావరణ పరిరక్షణ 

సహజ వనరుల సమర్థ నిర్వహణ  

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ రైల్వే డివిజనల్‌ కార్యాలయం హైదరాబాద్‌ భవన్‌కు ప్రతిష్టాత్మక ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) నుంచి గోల్డ్‌ రేటింగ్‌ లభించింది. సహజ వనరుల సమర్థ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్‌ పోదుపులో సాధించిన అద్భుత ఫలితాలకు ఈ అవార్డు లభించినట్లు  దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యర్థాల నిర్వహణకు హైదరాబాద్‌ భవన్‌ అనేక చర్యలు చేపట్టి సత్ఫలితాలు సాధించింది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు డస్ట్‌బిన్‌లు, నీటి సంరక్షణకు నాలుగు వాటర్‌ మీటర్లు ఏర్పాటు చేశారు.

భవన పరిసరాలను  పరిశుభ్రం చేసేందుకు హానికారక రసాయనాలకు బదులు పర్యావరణప్రియమైన వాటినే వినియోగిస్తున్నారు. మొక్కలు పెంపకానికి సేంద్రియ ఎరువులే వాడుతున్నారు. అలాగే విదేశీ వృక్షాలకు బదులు దేశవాళీ వృక్షాల పెంపకానికే ప్రాధాన్యమిస్తున్నారు. భవనంలో గాలి, వెలుతురు, చల్లదనం ఉండేందుకు వీలుగా 2,300 చదరపు మీటర్ల పైకప్పునకు సోలార్‌ రిఫ్లెక్షన్‌ ఇండెక్స్‌ పెయింటింగ్‌ను అమర్చారు. విద్యాంగుల సౌకర్యార్థం చేపట్టిన చర్యలు, ఆటలు, యోగా కోసం ఏర్పాటు చేసిన వసతులు తదితర సదుపాయాలకు గాను ఈ భవనానికి  గోల్డ్‌ రేటింగ్‌ లభించింది. 

మరిన్ని వార్తలు