లక్కీ డ్రా గెల్చుకున్నారంటూ ఘరానా దోపిడీ

28 Feb, 2017 18:52 IST|Sakshi
(బాధిత మహిళ లక్ష్మి)

కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ఘరానా దోపిడీ జరిగింది. ముదాంగల్లిలో నివాసముంటున్న లక్ష్మి, లింగం భార్యాభర్తలు. మంగళవారం మధ్యాహ్నం పల్సర్‌ బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ను రీచార్జి చేయడం ద్వారా మీ మొబైల్‌ నంబర్‌కు లక్కీ డ్రాలో స్కూటీ గెల్చుకున్నారని వారిని బురిడీ కొట్టించాడు.

స్కూటీ తీసుకోవాలంటే తమ ఆఫీసుకి వచ్చి సంతకాలు పెట్టాలని చెప్పాడు. ఆఫీసుకు వచ్చేటప్పుడు బంగారు ఆభరణాలు తీసేసి రావాలన్నాడు. పేదవారిలా కనిపిస్తేనే బండి ఇస్తారని నమ్మబలికాడు. భార్యాభర్తలకు మొదట అనుమానం వచ్చినా డబ్బులేం అడగకపోవడంతో బంగారు ఆభరణాలను ఇంట్లో ఉన్న కూతురికి ఇచ్చి అతనితో పాటు బయలుదేరారు. బంగారు ఆభరణాలను లింగం కుమారై దాచడం పల్సర్‌పై వచ్చిన వ్యక్తి గమనించాడు.

లింగం దంపతులను కొంతదూరం బైక్‌పై తీసుకెళ్లిన తర్వాత మీలాగే ఇంకొకరికి కూడా లక్కీ డ్రాలో బహుమతి వచ్చిందని వారిని కూడా తీసుకువస్తానని చెప్పాడు. అక్కడే వారిద్దరినీ ఉండమని చెప్పి లింగం వాళ్ల ఇంటికే వెళ్లాడు. మీ అమ్మ ఫోటోలు దిగాలి..ఇంట్లో దాచిన బంగారు ఆభరణాలు తీసుకురమ్మని చెప్పింది అని లక్ష్మి కూతురికి మాయమాటలు చెప్పాడు. మా అమ్మ వస్తేనే ఆభరణాలు ఇస్తానని చిన్నారి చెప్పటంతో బలవంతంగా ఇంట్లో దూరి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. సదరు వ్యక్తి తిరిగి రాకపోవడంతో భార్యాభర్తలు ఇంటికి వచ్చేశారు. ఇంటి నుంచి ఆభరణాలను ఎత్తుకుపోయాడని తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వెంటనే కామారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు