‘అతిథి దేవోభవ’తో మలేసియా వాసికి ప్రాణదానం 

7 Nov, 2017 03:34 IST|Sakshi

మెరుగైన చికిత్స అందేలా చేసిన ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల్లో ఉన్న ఓ మలేసియా ప్రతినిధికి సకాలంలో ‘అతిథి దేవోభవ’తో మెరుగైన చికిత్స అందించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సెపక్‌తక్రా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన మలేసియా జట్టు మేనేజర్‌ యూనిస్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పర్యాటక, క్రీడా శాఖల కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆయననను మెరుగైన వైద్య చికిత్స కోసం కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులతో మాట్లాడి వెంటనే శస్త్రచికిత్స చేయించారు. సకాలంలో వైద్యం అందడంతో యూనిస్‌ కోలుకున్నారు.

సోమవారం వెంకటేశం యూనిస్‌ను పరామర్శించారు. అవసరమైతే వైద్య ఖర్చులు, విమాన టికెట్‌ను కూడా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సకాలంలో వైద్యం అందించటంతో పాటు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసినందుకు మలేసియా ప్రతినిధులు బుర్రా వెంకటేశంకు కృతజ్ఞతలు తెలిపారు. ‘అతిథి దేవోభవ’కార్యక్రమంతో కొంతకాలంగా విదేశీయుల విషయంలో రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక గౌరవాన్ని చూపుతోంది. మన రాష్ట్రానికి వచ్చి, ఇబ్బందుల్లో చిక్కుకున్న వారిని చేరదీసి క్షేమంగా స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తోంది.  

మరిన్ని వార్తలు