10 Aug, 2018 04:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సీఎం ఆమోదిస్తే ప్రకటించే చాన్స్‌ 

పీఆర్సీ నివేదిక సమర్పించిన శ్రీనివాసరావు కమిటీ

ఫిట్‌మెంట్‌ శాతంపై విద్యుత్‌ ఉద్యోగుల్లో ఉత్కంఠ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగులకు తీపికబురు. విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెలాఖరులోగా ప్రకటన చేసేందుకు తెలంగాణ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు నేతృత్వంలో నియమించిన విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణ సంప్రదింపుల కమిటీ (పీఆర్‌సీ) గురువారం ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావుకు నివేదిక సమ ర్పించింది. వేతన సవరణ ఫిట్‌ మెంట్‌ శాతం, వెయిటేజీ ఇంక్రి మెంట్ల సంఖ్య, వైద్య సదుపాయం తదితర అంశాలపై విద్యుత్‌ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో త్వరలో విద్యుత్‌ సంస్థల యాజ మాన్యాలు చర్చలు జరపను న్నాయి. అనంతరం ఈ నెల 26లోగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పీఆర్సీ నివేదికను పంపిస్తామని, సీఎం ఆమోదిస్తే ఈ నెలాఖరులోగా పీఆర్సీపై ప్రకటన విడుదల చేస్తామని డి.ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు.

గత ఫిట్‌మెంట్‌కన్నాఎక్కువ ఇవ్వాలంటున్న ఉద్యోగులు
ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లలో పని చేస్తున్న 25 వేల మంది విద్యుత్‌ ఉద్యోగులు కొత్త పీఆర్సీపై యాజమాన్యాల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరిసారిగా నాలుగేళ్ల కింద విద్యుత్‌ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్, 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో కలిపి పీఅర్సీ ప్రకటించారు. అయితే ఇటీవల ఏపీలో విద్యుత్‌ ఉద్యోగులకు 25 శాతం ఫిట్‌మెంట్‌తోపాటు 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో వేతన సవరణపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఫిట్‌మెంట్‌ శాతంపై విద్యుత్‌ సంస్థలు తీసుకునే నిర్ణయంపై విద్యుత్‌ ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. చివరిసారిగా ప్రకటించిన 30 శాతం ఫిట్‌మెంట్‌కన్నా ఎక్కువ మొత్తంలో ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఏపీలో 25 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో అంతకంటే కొద్దిగా ఎక్కువ శాతం ఫిట్‌మెంట్‌ను తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులకు ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిట్‌మెంట్‌ శాతంపై సీఎం నిర్ణయం కీలకంగా మారనుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను గాడినపెట్టి నిరంతర విద్యుత్‌ సరఫరాను అమలు చేసేందుకు విద్యుత్‌ ఉద్యోగులు బాగా పని చేశారని కేసీఆర్‌ పలుమార్లు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఫిట్‌మెంట్‌ శాతంపై ముఖ్యమంత్రి నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31తో గత పీఆర్సీ కాలపరిమితి ముగిసిపోగా ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉంది.

ప్రస్తుత వైద్య సదుపాయానికి మెరుగులు...
విద్యుత్‌ ఉద్యోగులకు అమలు చేస్తున్న ప్రస్తుత వైద్య పథకాన్ని మెరుగుపరిచి కొనసాగించాలని పీఆర్సీ కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. ఎన్టీపీసీ తరహాలో అపరమిత నగదురహిత వైద్య సదుపాయం అందించాలని విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాన్ని మరింత సరళీకృతం చేయాలని కమిటీ సూచించినట్లు సమాచారం. ఈఎన్‌టీ, దంత, కంటి వైద్యానికి ప్రస్తుత పథకంలో ఉన్న పరిమితులను తొలగించాలని కమిటీ కోరినట్లు చర్చ జరుగుతోంది. 

తక్షణమే సంప్రదింపులు: ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌
కొత్త పీఆర్సీ అమలులో భాగంగా విద్యుత్‌ ఉద్యోగుల వేతన స్కేలు, అలవెన్సులు, ఈపీఎఫ్, జీపీఎఫ్, సమగ్ర వైద్య సదుపాయ పథకంపై తుది నిర్ణయం తీసుకునేందుకు తక్షణమే విద్యుత్‌ ఉద్యోగుల సంఘాలతో యాజమాన్యాలు సంప్రదింపులు ప్రారంభించాలని తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ నెల 26లోగా పీఆర్సీపై ప్రకటన చేయాలని లేకుంటే 27న విద్యుత్‌ సౌధలో మహాధర్నా నిర్వహిస్తామని జేఏసీ ప్రతినిధుల బృందం గురువారం ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు వినతిపత్రం అందజేసింది. 

మరిన్ని వార్తలు