ఆహార భద్రతా కార్డుదారులకు శుభవార్త

26 Apr, 2020 08:23 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ఆహార భద్రత కార్డుదారులకు శుభవార్త. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వచ్చే(మే) నెలలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యంతోపాటు కంది పప్పు కూడా అందనుంది. తాజాగా పౌరసరఫరాల శాఖ మే నెల రేషన్‌ సరుకుల కోటా కింద ఉచిత బియ్యం, కందిపప్పుతో పాటు గోధుమలు, చక్కెర కోటాను కేటాయించింది. ప్రతి కార్డుదారుడికి యూనిట్‌కు 12 కిలోల చొప్పున బియ్యం, కిలో కంది పప్పు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.. సబ్సిడీ ధరపై రెండు కిలోల గోధుమలు అందిస్తారు. 

కోటా కేటాయింపు ఇలా.. 
గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో కలిపి మొత్తం ఆహార భద్రత కార్డు కలిగిన సుమారు 16 లక్షల 930  కుటుంబాలు ఉన్నాయి. అందులో  55,75,583 లబ్ధిదారుల(యూనిట్‌)లకు గాను 6,83,06,702 కిలోల బియ్యం కేటాయించారు. అదేవిధంగా 16 లక్షల 930 కిలోల కంది పప్పు, 32 లక్షల 1860 కిలోల గోధుమల కోటా అలాట్‌ అయింది. అయితే గోధుమలు, చక్కెర కోటాలకు సంబంధించిన రిలీజింగ్‌ ఆర్డర్‌ (ఆర్వో)ల కోసం మాత్రమే మీ సేవా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేయాలని పౌర సరఫరాల శాఖ డీలర్లను ఆదేశించింది. దీంతో ఈసారి ఉచిత బియ్యంతో పాటు కిలో కంది పప్పు కూడా ఉచితంగా పంపిణీ చేసే అవకాశం ఉందని పౌరసరఫరాల అధికారి ఒకరు ‘సాక్షి‘కి తెలిపారు. 

గోదాముల్లో కోటా సిద్ధం.. 
మహానగరంలోని పౌరసరఫరాల గోదాముల్లో ఉచిత బియ్యం, కంది పప్పు కోటా సిద్ధంగా ఉంది. కరోనా పై ప్రభుత్వాల హెచ్చరికలతో పేదలంతా పనులకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటూ ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వారికి కొంత సాంత్వన చేకూర్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం  గత నెల ప్రతి రేషన్‌ కార్డులోని యూనిట్‌కు 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. అదేవిధంగా నిత్యావసర సరుకుల కోసం రూ.1500 బ్యాంకులో జమ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కంది పప్పుకూడా ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికి సాధ్యపడలేదు. ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియను పొడిగించి ఈ నెల 21 వరకు కొనసాగించారు. తాజాగా మే నెల కోటాను కేటాయించి గోదాముల్లో సరుకులను సిద్ధంగా ఉంచింది. 

మరిన్ని వార్తలు