అర్చకులకు ఒకటినే వేతనాలు

2 Jan, 2017 05:48 IST|Sakshi
అర్చకులకు ఒకటినే వేతనాలు

ప్రభుత్వోద్యోగుల తరహాలో వేతన చెల్లింపు విధానం: కేసీఆర్‌

- అవసరమైతే చట్ట సవరణ.. ఈ సమావేశాల్లోనే బిల్లు
- న్యాయ నిపుణులతో చర్చించి ముసాయిదా రూపకల్పన  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాల యాల్లో అర్చకులకు ఒకటో తేదీనే కచ్చితంగా వేతనాలు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతన చెల్లింపు విధానాన్ని అమలు చేస్తామని, ఇందుకోసం దేవాదాయ చట్ట సవరణ చేస్తామని తెలిపారు. అవసరమైతే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతామని తెలిపారు. సమాజంలో గౌరవంగా బతికే రీతిలో వేతనాల చెల్లింపు ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు చెల్లించాలని అర్చకులు, దేవాలయాల ఉద్యోగులు కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్ల సాధన కోసం దేవాలయ అర్చకులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి ఆందోళన చేపట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సలహాదారు రమణాచారి, కమిషనర్‌ శివశంకర్‌లతో సుదీర్ఘంగా సమీక్షించారు. అర్చక సంఘాల ప్రతినిధులు గంగు భానుమూర్తి, గంగు ఉపేంద్రశర్మ, దేవాలయ ఉద్యోగుల ప్రతినిధులు రంగారెడ్డి, మోహన్‌ తదితరులు కూడా భేటీలో పాల్గొన్నారు.

ప్రత్యేక నిధి నుంచి...
దేవాదాయ శాఖ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న 642 ఆలయాలకు సంబంధించి దాదాపు 5,800 మంది అర్చకులు, ఉద్యోగులకు వర్తించేలా కొత్త వేతన చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అయితే తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే వేతనాలు చెల్లించాలని అర్చకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కోరారు. కానీ అది సాధ్యమయ్యే అవకాశం లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ‘‘అర్చకత్వం గౌరవమైన వృత్తి. కానీ వారి వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పోటీ సమాజంలో ఇది పెద్ద సమస్యగా మారింది. అర్చకత్వం చేసే యువకులకు పిల్లనివ్వడానికి ముందుకు రాని దుస్థితి రావడం బాధాకరం. ఈ పరిస్థితి మారాలి.

వారికీ గౌరవప్రదమైన వేతనాలు అందాలి. అది కూడా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఒకటో తారీఖునే చేతిలో పడాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. ప్రతి నెలా ఆలయాల నుంచి దేవాదాయశాఖ వసూలు చేసే 12 శాతం మొత్తాన్ని ఒకచోట నిధిగా చేసి.. దాని నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఠంచన్‌గా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని అధికారులకు సూచించారు. ఆ నిధి చాలని పక్షంలో ప్రభుత్వం కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వారి వేతనాలను కూడా క్రమబద్ధీకరించాలని.. అందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ సంక్రాంతి నాటికే అర్చకులు, ఆలయ ఉద్యోగులకు కొత్త వేతన విధానం అమల్లోకి రావాలన్నారు.

భూముల లెక్కలు తేల్చండి
గత ప్రభుత్వాల మితిమీరిన రాజకీయ జోక్యం వద్ద ఆలయాల్లో ఆధ్యాత్మిక భావన భగ్నమైందని, కౌలు పేరుతో దేవాలయ భూములు కబ్జాకు గురయ్యాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆలయ భూముల వివరాలను పక్కాగా సేకరించి అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పాలక వర్గాల్లో ధార్మిక, భక్తి భావాలున్నవారే సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఈమేరకు నియమావళి రూపొందించాలని సూచించారు. కాగా రాష్ట్రంలో 11 వేల వరకు ఆలయాలుంటే కేవలం 642 మాత్రమే దేవాదాయ శాఖ పరిధిలో ఉండాల్సిన గందరగోళం ఏమిటని సీఎం ప్రశ్నించారు. వేతన క్రమబద్ధీకరణ ఈ 642 ఆలయాలకే వర్తిస్తే మిగతా వారు నష్టపోతారని, అందరికీ లబ్ధి కలిగేలా చూడాలని పేర్కొన్నారు.

ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ..
అర్చకులు, దేవాలయ ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కూడా సమావేశమై మూడు నాలుగు రోజుల్లో పూర్తి నివేదికను తనకు అందజేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ అంశంపై శాసనసభలో బిల్లు పెడతామన్నారు. బిల్లు ముసాయిదా రూపకల్పన కోసం దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఎస్‌ ఎస్‌పీ సింగ్, దేవాదాయ కమిషనర్‌ శివశంకర్, అడ్వొకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి, లాసెక్రటరీ సంతోష్‌రెడ్డి, అర్చక–ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భానుమూర్తి, ఉపేంద్రశర్మ, రంగారెడ్డి, మోహన్‌లు అందులో సభ్యులుగా ఉన్నారు. దేవాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, రోస్టర్‌ సమస్యలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కమిటీని సీఎం ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు