మిద్దె సాగు.. బహు బాగు

21 Mar, 2018 08:14 IST|Sakshi

సిటీజనుల్లో పెరుగుతున్న ఆసక్తి  

‘మన ఇల్లు– మన కూరగాయలు’ పథకానికి స్పందన  

నగరంలో 5వేల ఇళ్లలో మిద్దెపై పంటల సాగు

సిటీజనులు మిద్దె సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇళ్ల మిద్దెపై ఆకు కూరలు, కూరగాయలు సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. పట్టణ ప్రజలకు పోషకాలున్న కూరగాయలను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఉద్యాన శాఖ ప్రవేశపెట్టిన ‘మన ఇల్లు – మన కూరగాయలు’ పథకంతో ఇదంతా సాధ్యమవుతోంది. నగరంలో ఈ పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. దాదాపు 5వేల ఇళ్ల మిద్దెపై పంటల సాగు జరుగుతోంది.

నాంపల్లి: 2010లో రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్‌ ఎల్‌.వెంకట్రామిరెడ్డి పర్యవేక్షణలో ఉద్యోగులు వేసిన తొలి అడుగు ఇప్పుడు నగరమంతా విస్తరించింది. ‘మన ఇల్లు – మన కూరగాయలు’ పేరుతో ఉద్యాన శాఖ ప్రవేశపెట్టిన పథకం దినదినాభివృద్ధి చెందింది. గ్రేటర్‌లో 30 లక్షల ఇళ్లు ఉండగా... దాదాపు 5వేల ఇళ్ల మిద్దెపై ఆకుకూరలు, కూరగాయలు సాగు చేయడం విశేషం. ప్రభుత్వం కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కలిసొచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా రైతు కావడం, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథికి వ్యవసాయంపై మక్కువ ఉండడంతో ఈ పథకానికి మరిన్ని సొబగులు అద్దారు. ఈ పథకం కింద పరికరాలు, విత్తనాలు, సేంద్రియ ఎరువులు సబ్సిడీ కింద అందించడంతో పాటు సాగు విషయంలో నిపుణులతో మెలకువలు అందిస్తున్నారు. సిటీజనులకు దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ ఏడాది శ్రీకారం చుట్టారు.

శిక్షణ సైతం...
వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించి పంటల సాగు చేయడంపై ఉద్యాన శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన మెలకువలను అందించేందుకు నగరవాసులకు శిక్షణనిస్తున్నారు. ఇప్పటికే 18 వేల మందికి శిక్షణనిచ్చారు. ప్రతిరోజు ఒక గంట సమయం కేటాయిస్తే మిద్దెపై అద్భుతాలు చేయొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. పొట్లకాయ, గోంగూర, తోటకూర, దోసకాయ, మిర్చి, కాకర, టమాట, వంగ, బెండ, బీరకాయ, మెంతికూర, పాలకూరలతో పాటు ఉల్లి, ఎల్లిగడ్డలు మిద్దెపై పండించుకోవచ్చని తెలిపారు. అదే విధంగా ఇంటి ఆవరణలో స్థలం ఉన్నవారు పండ్ల మొక్కలు పెంచుకోవచ్చని సూచించారు. మేలైన జాతి మొక్క కేవలం రూ.30కే అందజేస్తున్నట్లు చెప్పారు. ఉద్యాన శాఖ పర్యవేక్షణలో 20 లక్షల మొక్కలను 17 నర్సరీల్లో పెంచుతున్నారు.

పథకంపై ప్రచారం..  
ఈ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది అనూహ్య ఫలితాలు సాధించేందుకు వినూత్న తరహాలో ప్రచారం చేయనుంది. ఇందుకు కళా బృందాల ద్వారా సిటీజనులకు అవగాహన కల్పించేందుకు సమాయత్తమవుతోంది. ఈ కళా బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే దీనిపై ప్రచారం చేయనున్నాయి.

పథకం ప్రయోజనాలు

50–100 చదరపు అడుగుల వరకు పెరటి స్థలం లేదా బాల్కానీ, ఇంటి పైకప్పు ఉండి నీటి సదుపాయం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి 200 చదరపు అడుగులు.  
ఈ పథకం కింద కూరగాయల సాగుకు కావాల్సిన సిల్పాలిన్‌ కవర్స్, మట్టి మిశ్రమం, విత్తనాలు, వేప పిండి, వేప నూనె, పనిముట్లను 25 శాతం
రాయితీతో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి రెండు యూనిట్లు అందజేస్తున్నారు. లబ్ధిదారులకు సబ్సిడీ సౌకర్యం కూడా ఉంటుంది.  
ఆసక్తి ఉన్నవారు నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లోని ఉద్యాన శాఖ కార్యాలయంలో పని దినాల్లో సంప్రదించొచ్చు.   

లభించే విత్తనాలు..
టమాట, వంగ, బెండ, పొట్ల, కాకర, బీర, దోస, గోరు చిక్కుడు, క్యాబేజి, కాలిఫ్లవర్, క్యారెట్, ఉల్లి, పాలకూర, మెంతికూర, కొతిమీర, చుక్క కూర, గోంగూర, బచ్చలి, తోటకూర, పుదీనా, ముల్లంగి, ఆలుగడ్డ, బీట్‌రూట్‌.  పండ్లలో అరటి, ఆపిల్, రేగు, సీతాఫలం, బొప్పాయి తదితర అందజేస్తున్నారు.  

సద్వినియోగం చేసుకోండి...  
మిద్దె పంటలతో తాజా ఆకు కూరలు, కూరగాయలు పొందొచ్చు. వీటిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మిద్దె పంటల సాగుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. పంటల సాగుకు కావాల్సిన సలహాలు, సూచనలు, మెలకువలు మేం అందజేస్తాం.  – ఎల్‌.వెంకట్రామిరెడ్డి, ఉద్యాన శాఖ కమిషనర్‌

మరిన్ని వార్తలు