భలే డిమాండు.. సరఫరా కూడా మెండు..!

25 Apr, 2020 03:20 IST|Sakshi

ప్రతిరోజూ రాష్ట్ర మార్కెట్‌లోకి 20వేల క్వింటాళ్లకు పైగా పండ్లు రాక

280 మొబైల్‌ రైతుబజార్‌ల ద్వారా 620 ప్రాంతాల్లో అమ్మకాలు

ఇంటికే పండ్ల సరఫరాకు పెరిగిన డిమాండ్‌..రోజుకు 1,500కు పైగా కాల్స్‌

ఇప్పటికే 35వేల మందికి డోర్‌ డెలివరీ..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లను అధికంగా తీసుకోవాలన్న ప్రభుత్వ సూచనల నేపథ్యంలో వాటి వినియోగం పెరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఫ్రూట్‌ జూస్, ఐస్‌క్రీం పార్లర్‌లు మూతబడ్డప్పటికీ డిమాండ్‌ మాత్రం సాధారణ రోజుల మాదిరే ఉంటోంది. మొబైల్‌ వాహనాల ద్వారా ప్రజల దగ్గరకే పండ్లను చేర్చడంతో పాటు కొత్తగా ఇంటికే పండ్ల సరఫరాతో  మంచి గిరాకీ ఉంటోంది.

పెరిగిన లభ్యత.. మెరుగైన కొనుగోళ్లు.. 
రాష్ట్రంలో బత్తాయి, మామిడి, నిమ్మ, బొప్పాయి, జామ, దానిమ్మ వంటి పండ్ల తోటల సాగు 4.40 ఎకరాల్లో సాగవుతుండగా, ప్రస్తుతం బత్తాయి, మామిడి పంటల కోతలు పెరిగాయి. దీంతో వీటి లభ్యత మార్కెట్‌లో విపరీతంగా పెరిగింది. భారతీయ వైద్య పరిశోధనా సంస్థ (ఐసీఎంఆర్‌) సిఫార్సుల మేరకు ప్రతీ మనిషి రోజుకు 100 గ్రాముల పోషక విలువలు గల పండ్లను తీసుకోవాలి. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రతీ మనిషి నెలకు 3 కిలోల పండ్లు తినాల్సి ఉంది. ఈ లెక్కన 1.20లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి, బత్తాయి తినాల్సి ఉంటుందని అంచనా వేశారు.

మన మార్కెట్‌లో ఏప్రిల్, మే నెలలో 70వేల టన్నుల బత్తాయి, మామిడి 5 నుంచి 6 లక్షల మేర ఉత్పత్తి ఉంటోంది. హైదరాబాద్‌ మార్కెట్‌లోకి మామిడి ప్రతి రోజూ 600 నుంచి 1000 టన్నుల మేర వస్తోంది. బత్తాయి, వాటర్‌మిలన్, దానిమ్మ, ద్రాక్ష ఇతర రకాల పండ్లు రోజుకు 22వేల క్వింటాళ్లకు మించి వస్తున్నాయి. వాటి లభ్యత పెరగడంతో వీటిని వినియోగదారులకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 280 మొబైల్‌ రైతు బజార్‌ల ద్వారా 620 ప్రాంతాల్లో అమ్మకాలు చేపట్టారు. ఇవి విజయవంతమయ్యాయి. వీటి ద్వారా రోజుకు 15వేలకు పైగా వినియోగదారులు కొనుగోళ్లు చేస్తున్నారు.

ఇంటికే సరఫరాకు శ్రీకారం... 
దీనికి అనుబంధంగా మార్కెటింగ్‌ శాఖ ఇంటికే పండ్ల సరఫరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 8875351555 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు, రూ.300 విలువ చేసే మామిడి (1.5కిలోలు), బొప్పాయి(3 కిలోలు), నిమ్మ (12 కాయలు), బత్తాయి (2 కిలోలు), సపోటా (కిలో) పండ్లు డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే 35వేల మంది వినియోగదారులు ఈ సౌలభ్యాన్ని వినియోగించుకున్నారని మార్కెటింగ్‌ శాఖ అధికారులు వెల్లడించారు. రోజుకు 1,500 నుంచి 2వేల కాల్స్‌ వస్తున్నాయని, 78 గంటల్లో వీటిని సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు.

గడ్డిఅన్నారం మార్కెట్‌ వికేంద్రీకరణ.. 
ఇక గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేయగా, వికేంద్రీకరణ చేసేందుకు  నిర్ణయించింది. సరుకు రవాణా వాహనాలతో ఇక్కడ  భౌతిక దూరం పాటించే అవకాశాలు లేకపోవడం, మహారాష్ట్ర నుంచి ద్రాక్ష, బత్తాయి, మామిడి వాహనాల నుంచి పండ్లు దించేందుకు హమాలీలు వెనకాడటం, దీన్ని మూసివేసి ఇతర ప్రాంతాలకు తరలించాలని స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో దీన్ని బుధవారం నుంచి మూసివేశారు. ఈ మార్కెట్‌కు ప్రతిదినం 18వేల నుంచి 20వేల క్వింటాళ్ల వివిధ రకాల పండ్లు వస్తుంటాయి. ఇప్పుడు సోమవారం నుంచి మామిడి  మార్కెట్‌ను కోహెడకు, బత్తాయి, సపోటా, కమలాపండ్లను ఎల్బీనగర్‌ సమీప విక్టోరియా హౌస్‌ ప్రాంతానికి, వాటర్‌ మిలన్, కర్భూజ పండ్లను స్థానిక రోడ్డుమీద పెట్టి అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో కొనుగోళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు