దేశవ్యాప్త రైతుబంధుతో రాష్ట్రానికి మేలు

5 Jan, 2019 03:52 IST|Sakshi

70% నిధులు కేంద్రం భరించే అవకాశం 

దీంతో తెలంగాణకు రూ.8 వేల కోట్లు మిగులు.. రైతుబంధు సొమ్ము పెంచినా తగ్గనున్న భారం 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం ఆలోచిస్తుండటం.. ఈ పథక రూపశిల్పి కేసీఆర్‌కు ఊరట కల్గించనుంది. కేంద్రమే నిధులు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఉపశమనం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది బడ్జెట్‌లో ఖరీఫ్, రబీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లను కేటాయించింది. ఎకరాకు రూ.8 వేల చొప్పున ఆ రెండు సీజన్లలో రైతులకు అందజేసింది. దీని ప్రకారం దాదాపు రూ.11 వేల కోట్లు రైతులకు అందినట్లయింది. వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. ఆ ప్రకారం బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు రుణమాఫీకి దాదాపుగా రూ.20 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వచ్చే బడ్జెట్లో దాదాపు రూ.35 వేల కోట్లు. ఇది కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తలకుమించిన భారమే. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చే ఆలోచన చేస్తుందని, ఎకరాకు రెండు సీజన్లకు కలిపి రూ.8 వేలు ఇచ్చేలా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే రైతుబంధు నిధులు ఎంతో ఊరటనిస్తాయన్న చర్చ జరుగుతోంది. 

70% నిధులు కేంద్రం ఇస్తే..  
దేశవ్యాప్తంగా రైతుబంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. అయితే నిధులను మొత్తంగా భరించకపోవచ్చు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోకి వస్తుంది కాబట్టి.. రాష్ట్రాలూ ఈ భారాన్ని కొంతమొత్తంలో పంచుకునే దిశగా కేంద్రం ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల్లో అమలు చేసే కేంద్ర పథకాలకు సాధారణంగా 60:40 నిష్పత్తిలో నిధుల కేటాయింపు ఉంటుంది. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి. ఈ పద్ధతిలోనే రైతుబంధు నిధులూ కేటాయించాలని కేంద్రం భావిస్తోందని రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ పథకం కేంద్రమే అమలు చేస్తుందన్న భావన తీసుకురావాలంటే ఎక్కువ మొత్తంలో నిధులు తామే భరిస్తున్నామనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రధాని ప్లాన్‌ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అందులో భాగంగానే కేంద్రం 70%, రాష్ట్రాలు 30% భరించేలా విధివిధానాలు రూపొందించే అవకాశం ఉండొచ్చన్నారు.

ఆ ప్రకారం కేంద్రం ఎకరాకు రూ.8 వేలలో 70%.. అంటే రూ.5,600 భరిస్తుంది. మిగిలిన రూ.2,400 రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తానని చెప్పింది కాబట్టి కేంద్రం ఇవ్వగా అవసరమైన దానికి అదనంగా రూ. 2 వేలు కలిపితే సరిపోతుంది. ఆ ప్రకారం ఎకరాకు రెండు సీజన్లకు కలిపి రూ.4,400 ఇస్తే సరిపోతుంది. అంటే రెండు సీజన్లకు కలిపి బడ్జెట్లో దాదాపు రూ.7 వేల కోట్లు కేటాయిస్తే సరిపోతుంది. అంటే రూ.15 వేల కోట్లలో ఇవిపోను రూ.8 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి మిగిలే అవకాశముంది. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే రూ. 3 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఎస్‌బీఐ పరిశోధన పత్రంలో పేర్కొంది. దేశవ్యాప్తంగా సాగు 34.59 కోట్ల ఎకరాలు కాగా ఆ స్థాయిలోనే ఖర్చవుతుందని తేల్చి చెప్పింది.  

మరిన్ని వార్తలు