నిమజ్జనానికి గూగుల్‌ సాయం 

22 Sep, 2018 02:07 IST|Sakshi

     ఊరేగింపు, ట్రాఫిక్‌ స్థితిగతులు అప్‌డేట్‌ 

     తొలిసారిగా ఏర్పాటు చేయిస్తున్న వైనం 

     ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : ఏటా హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే గణేశ్‌ ఉత్సవాల్లో కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం గూగుల్‌కు ఎక్కనుంది. దీనికి సంబంధించి తొలిసారిగా ఈ ఏడాది ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్‌ అదనపు పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ తెలిపారు. ట్రాఫిక్‌ డీసీపీ–1 ఎల్‌ఎస్‌ చౌహాన్‌తో కలసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏటా గణేశ్‌ నిమజ్జనం సందర్భంలో హైదరాబాద్‌ వ్యాప్తంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తుంటారు. వాహనాల నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఊరేగింపు మార్గంలో ఉన్న వాహనాలు, విగ్రహాలతో ఉన్న వాహనాలు చేరిన ప్రాంతాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఆంక్షలు, మళ్లింపుల్లో మార్పులు చేస్తుంటారు.

బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు ఉన్న ప్రధాన ఊరేగింపు మార్గంతో పాటు మరో 20 ఉపమార్గాల్లోని 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటా యి. వీటి ప్రభావం సాధారణ వాహనచోదకుల పైనా ఉంటోంది. ఆయా మార్గాల్లో ఉన్న పరిస్థితులు, ఊరేగింపు ముగింపు ఉన్న ప్రాంతాలపై ప్రజలు సమాచారం ఇవ్వడానికి ఇప్పటి వరకు ట్రాఫిక్‌ పోలీసులు వారి అధికారిక సోషల్‌మీడియాతోపాటు మీడియాను, రేడియోలను వినియోగిస్తున్నారు. ఇటీవల స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగటంతోపాటు గూగుల్‌ నావిగేటర్, మ్యాప్స్‌లతోపాటు ట్రాఫిక్‌ లైవ్‌ను వాహనచోదకులు, ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ గూగుల్‌ సంస్థతో సంప్రదింపులు జరిపారు.

గణేశ్‌ ఊరేగింపుతోపాటు ఆ రోజు, ఆయా మార్గాల్లో ఉన్న ట్రాఫిక్‌ స్థితిగతుల్ని ప్రత్యేకంగా అందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)కు చెందిన అధికారులు ఊరేగింపు, ట్రా ఫిక్‌ స్థితిగతులు గమనిస్తూ ఉంటారు. దీనికోసం నగరంలోని జంక్షన్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను వినియోగిస్తుంటారు. ఈ వివరాల ను సీసీసీ సిబ్బంది ఎప్పటికప్పుడు గూగుల్‌కు అందిస్తూ మ్యాప్‌లో అప్‌డేట్‌ అయ్యేలా చూస్తా రు. ఇది సాధారణ వాహనచోదకులకు ఉపయుక్తమని అనిల్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. 

వీక్షణకు యాప్‌... 
గణేశ్‌ నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు తొలిసారిగా ఒక యాప్‌ అందు బాటులోకి వచ్చింది. ఈ వీఆర్‌ డివోటీ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని 360డిగ్రీస్‌ వర్చువల్‌ రియాలిటీ పిక్చర్‌తో 23న హైదరాబాద్‌లో జరిగే నిమజ్జన దృశ్యాలను ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీక్షించవచ్చునని రూపకర్తలు కాల్పనిక్‌ టెక్నాలజీస్‌ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణేశ్‌ భక్తులు ఎక్కడ నుంచైనా సరే వేలాదిగా ప్రయాణించే వినాయకుడి రూపాలను, ఊరేగింపు విశేషాలను, పండుగ సంబరాన్ని చూడొచ్చునన్నారు. వీక్షకులు తాము సైతం హుస్సేన్‌సాగర్‌ సమీపంలోనే ఉన్నామని అనుభూతి చెందేలా, స్పష్టంగా ఈ దృశ్యాలను యాప్‌ అందిస్తుందన్నారు. దీనిని గూగుల్‌ ప్లే స్టోర్, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ల నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని ఆ ప్రతినిధులు వివరించారు.  

సిటీని 38 సెక్టార్లుగా విభజించి..
‘నిమజ్జన ఘట్టం నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా నగరాన్ని 38 సెక్టార్లుగా విభజించి ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 2,100 మంది సిబ్బంది, అధికారులు విధుల్లో ఉంటారు. సిటీలోని ప్రతీ జంక్షన్‌లోనూ ఓ ఎస్సై, కీలక ప్రాంతాల్లో ఆపై స్థాయి అధికారులు ఉంటారు. మొత్తమ్మీద ఇద్దరు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, 10 మంది ఏసీపీలు, 32 మంది ఇన్‌స్పెక్టర్లు, 100 మంది ఎస్సైలు, 1,950 మంది ఇతర సిబ్బందిని మోహరిస్తున్నాం. అనేక ప్రాంతాల్లో శాంతిభద్రతల విభాగం అధికారుల సాయం తీసుకోనున్నాం. ప్రజలకు సూచనలు చేయడానికి నగర వ్యాప్తంగా 2 వేల సైనేజ్‌ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. సౌత్‌జోన్‌లో ఊరేగింపు పూర్తికావడం కీలకం కావడంతో ప్రతి ఒక్కరూ త్వరగా ప్రారంభించాలి. ఊరేగింపు ముగిసిన ప్రాంతాల్లో ఆంక్షల్ని దశల వారీగా ఎత్తివేస్తాం’ 
– అనిల్‌కుమార్, ట్రాఫిక్‌ చీఫ్‌ 

మరిన్ని వార్తలు