ప్రభుత్వ స్కూల్‌లో గూగుల్‌ ల్యాబ్‌

26 Sep, 2019 05:44 IST|Sakshi

విజయనగర్‌కాలనీ హైస్కూల్‌లో ఏర్పాటు

టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ అద్భుతాలు చేస్తున్న విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గూగుల్‌ సహకారంతో ఏర్పాటు చేసిన గూగుల్‌ ల్యాబ్‌ సదుపాయంతో విద్యార్థులు అద్భుతాలు చేస్తున్నారు. ఓక్రిడ్జ్, గ్లోబల్, అరబిందో వంటి ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఆధునిక గూగుల్‌ ల్యాబ్‌ను దేశంలో తొలిసారి విజయనగర్‌ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోకి తెచ్చారు. ఈ ల్యాబ్‌లో 6 నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు వారంలో 2 క్లాస్‌లు డిజిటల్‌ బోధన అందించేలా చర్యలు చేపట్టారు. పాఠశాల సిలబస్‌కు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి బోధనను నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. రొబోటిక్‌ ల్యాబ్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం సబ్జెక్టులకు సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నారని తెలిపారు. అదే స్కూల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.
 
టీచర్లకు గూగుల్‌ శిక్షణ

ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఏర్పా టు చేసుకుంటే సాఫ్ట్‌వేర్‌ సహాయం అందించడంతోపాటు టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు గూగుల్‌ ముందుకు వచి్చందని విజయకుమార్‌ తెలిపారు. ఈ మేరకు గూగుల్‌ ప్రతినిధులు 2 రోజుల కిందట తమతో సమావేశమై అంగీకారం తెలిపారన్నారు. ల్యాబ్‌ల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, వాటి ఏర్పాటుతో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించవచ్చన్నారు. గూగుల్‌ ల్యాబ్‌ సదుపాయంతో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో మెరుగైన ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీతోపాటు నగదున ఆయన అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల విద్య అదనపు డైరెక్టర్‌ పీవీ శ్రీహరి, జాయింట్‌ డైరెక్టర్లు రమేశ్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు