‘పిచ్‌’ విజేత అజైతా షా

1 Dec, 2017 01:59 IST|Sakshi

జీఈఎస్‌ తుది పోటీలో గెలుపొందిన భారత స్టార్టప్‌

సదస్సు ముగింపు వేడుకల్లో విజేతల ప్రకటన

అజైతా షాకు 4 లక్షల డాలర్ల విలువైన బహుమతులు

తుది పోరుకు చేరిన వారందరికీ నజరానాలు

పలు స్టార్టప్‌లకు గూగుల్‌ ప్రత్యేక బహుమతి

ప్రపంచ పారిశ్రామిక సదస్సులో ఉత్కంఠ రేపిన స్టార్టప్‌ల ‘పిచ్‌’ కాంపిటీషన్‌లో భారత్‌కు చెందిన అజైతా షా తుది విజేత (గ్రాండ్‌ చాంపియన్‌)గా నిలిచారు. జీఈఎస్‌ను పురస్కరించుకుని స్టార్టప్‌ కంపెనీలకు ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ త్రూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (జిస్ట్‌)’ఆధ్వర్యంలో పిచ్‌ కాంపిటీషన్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు విభాగాలకు విజేతలను బుధవారమే ప్రకటించగా గురువారం మరో రెండు విభాగాల్లో విజేతలను ఎంపిక చేశారు. అనంతరం సదస్సు ముగింపు వేడుకల్లో తుది విజేతను ప్రకటించారు. నాలుగు విభాగాల విజేతల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అజైతా షాను తుది విజేతగా ఎంపిక చేశారు. – సాక్షి, హైదరాబాద్‌


4 లక్షల డాలర్ల బహుమతులు
భారత్‌కు చెందిన అజైతా షా రాజస్థాన్‌లో ‘ఫ్రాంటియర్‌ మార్కెట్స్‌’స్టార్టప్‌ను నిర్వహిస్తున్నారు. జీఈఎస్‌ దృష్టి సారించిన నాలుగు రంగాల్లో ఒకటైన ‘ఇంధనం, మౌలిక వసతుల’విభాగం నుంచి ఈ స్టార్టప్‌ గ్రాండ్‌ ఫైనల్‌కు చేరింది. సౌరశక్తి వినియోగం, సౌరశక్తి ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటంతో పాటు మహిళలకు వ్యాపార అవకాశాలను పెంపొందించేందుకు ఆమె చేస్తున్న కృషిని.. పోటీ న్యాయ నిర్ణేతలు అభినందించారు.

ఆమెకు దాదాపు 4 లక్షల డాలర్ల విలువైన బహుమతులను అందజేశారు. ఇందులో 50 వేల డాలర్ల అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌ క్రెడిట్స్‌తో పాటు డెల్‌ లాప్‌టాప్, లక్ష డాలర్ల గూగుల్‌ క్లౌడ్‌ క్రెడిట్‌ను అందించారు. కాగ్నిజెంట్‌ కంపెనీ ఆమెను ‘జెన్‌సిస్‌ అవార్డు’గ్రహీతగా ప్రకటించటంతో పాటు రెండు వేల డాలర్ల నగదు బహుమతిని అందించింది. ఐఎన్‌సీ మేగజైన్‌లో ఆమె ఇంటర్వ్యూను ప్రచురించనున్నారు. ఇక తుది పోటీలో నిలిచిన నలుగురు విజేతలకు వచ్చే ఏడాది మార్చిలో వాషింగ్టన్‌లో జరిగే అలైస్‌ సర్క్యులర్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.


మొల్లీ మోర్స్‌కు ‘విమెన్‌ ఫస్ట్‌’ అవార్డు
జీఈఎస్‌ ముగింపు వేడుకల్లో అమెరికాకు చెందిన మ్యాంగో మెటీరియల్స్‌ స్టార్టప్‌ నిర్వాహకురాలు మొల్లీ మోర్స్‌కు ‘విమెన్‌ ఫస్ట్‌’ అవార్డును ప్రకటించారు. పోటీలో పాల్గొన్న తొలి మహిళగా ఆమెను దీనికి ఎంపిక చేశారు. బహుమతిగా 50 వేల డాలర్ల అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌ క్రెడిట్, డెల్‌ ల్యాప్‌టాప్‌ను అందించారు. తర్వాతి స్థానాల్లో నిలిచిన పలువురికి కూడా వివిధ బహుమతులు అందించారు.

ముగ్గురికి గూగుల్‌ బహుమతి
పోటీల్లో ప్రతిభ ఆధారంగా ముగ్గురు మహిళలకు గూగుల్‌ కంపెనీ ప్రత్యేకంగా బహుమతులను అందించింది. ఎవలిన్‌ చిలోమో (లూపియా సర్కిస్‌ సంస్థ–జాంబియా), క్రిస్టి గొరెనాస్‌ (డిపెండబుల్‌ సంస్థ–అమెరికా), వైశాలి నియోటియో (మెరిక్సియస్‌ సాఫ్ట్‌వేర్‌–భారత్‌)లు గూగుల్‌ కంపెనీ నుంచి 20 వేల డాలర్ల క్లౌడ్‌క్రెడిట్‌ను అందుకున్నారు.


గ్రాండ్‌ ఫైనల్‌ పోరులో నలుగురు
జిస్ట్‌ పిచ్‌ కాంపిటీషన్‌లో వివిధ దేశాలకు చెందిన 75 మంది స్టార్టప్‌ల నిర్వాహకులు పోటీ పడ్డారు. సెమీఫైనల్‌కు చేరిన 24 మందికి జీఈఎస్‌లో పిచ్‌ కాంపిటీషన్‌లో తలపడే అవకాశం కల్పించారు. జీఈఎస్‌ ప్రాధాన్యంగా ఎంచుకున్న ఇంధనం–మౌలిక వసతులు, హెల్త్‌కేర్‌–లైఫ్‌ సైన్సెస్, డిజిటల్‌ ఎకానమీ–ఫైనాన్షియల్‌ టెక్నాలజీ, మీడియా–ఎంటర్‌టైన్‌మెంట్‌... ఈ నాలుగు విభాగాల్లో ఒక్కొక్కరిని విజేతలుగా ఎంపిక చేశారు.

ఈ నలుగురిలో ముగ్గురు భారతీయులే ఉండటం విశేషం. అజైతా షాతో పాటు ఇతర రంగాల నుంచి జైనేష్‌ సిన్హా (జ్ఞాన్‌ధన్‌ వ్యవస్థాపకుడు), వైశాలి నియోటియా (మెర్క్సియస్‌ సాఫ్ట్‌వేర్‌), ఫియోనా ఎడ్వర్డ్స్‌ మర్ఫీ (ఎపిస్‌ ప్రొటెక్ట్‌–ఐర్లాండ్‌)లు తమ విభాగాల్లో విజేతలుగా నిలిచి గ్రాండ్‌ ఫైనల్‌లో పోటీపడ్డారు. వీరందరికీ 10 వేల డాలర్ల అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌ క్రెడిట్స్, డెల్‌ ల్యాప్‌టాప్, అలైస్‌ సర్క్యులర్‌ సమ్మిట్‌ స్కాలర్‌షిప్, లక్ష డాలర్ల విలువైన గూగుల్‌ క్లౌడ్‌ క్రెడిట్స్‌ను అందించారు.

మరిన్ని వార్తలు