అద్దె భవనాల్లోనే గురుకుల విద్య

19 Jan, 2018 01:30 IST|Sakshi

కొత్త భవన నిర్మాణాలకు  అనుమతివ్వని ప్రభుత్వం 

అద్దె భారం ఏటా  రూ.65 కోట్లు పైమాటే... 

సాక్షి, హైదరాబాద్‌: కొత్త గురుకుల పాఠశాలలకు అద్దె భవనాలే దిక్కు అయ్యాయి. ప్రైవేటు భవనా ల్లో ప్రారంభించి దశలవారీగా శాశ్వత భవనాలు నిర్మిస్తామన్న ప్రభుత్వం మాటలు ఇప్పట్లో కార్యరూపం దాల్చేలా లేవు. 2017–18లో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో నియోజకవర్గానికొకటి చొప్పున 119, మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో 65 గురుకులాలను ప్రైవేటు భవనాల్లో ప్రారంభించింది.  

శాశ్వత భవనాలకు రూ.3,680 కోట్లు... 
గురుకులాలపై భారీ ప్రణాళికలతో ప్రభుత్వం ప్రకటనలు చేయడంతో వీటి పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కొత్తవాటిలో దాదాపు అన్ని గురుకులాలు హౌస్‌ఫుల్‌ బోర్డులు పెట్టేశాయి. కనిష్టంగా పది ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన భవనాలను నిర్మించాలని సొసైటీలు ప్రణాళికలు రూపొందించాయి. ఒక్కో గురుకుల భవన నిర్మాణానికి రూ.20 కోట్లు, అన్నింటికి కలిపి దాదాపు రూ.3,680 కోట్లు అవసరమవుతాయని అధికారులు తేల్చారు. ప్రతి సంవత్సరం పావువంతు భవనాలు నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఏటా రూ. 1,000 కోట్లు కేటాయించాలి. కానీ, ఇంతపెద్దమొత్తంలో నిధులివ్వడం సాధ్యం కాదని తాజాగా ఆర్థిఖ శాఖ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో కొత్త గురుకులాలకు ఇప్పట్లో శాశ్వత భవనాలు ఏర్పాటయ్యే అవకాశం లేనట్లే. కొత్త గురుకులాలకు అద్దె భారం తడిసిమోపెడవుతోంది. ఒక్కో గురుకులంపై ఏటా రూ.25 లక్షలు, అన్నింటికి కలిపి రూ.65 కోట్ల అద్దె భారం పడుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన అద్దెధరలకు చాలాచోట్ల భవనాలు లభించలేదు. దీంతో ఎక్కువ అద్దెలు చెల్లించి భవనాలు తీసుకోవాల్సి రావడంతో అద్దె భారం మరింత పెరిగే అవకాశముంది.   

మరిన్ని వార్తలు