మా పనితీరును శంకించొద్దు

30 Jun, 2020 02:34 IST|Sakshi

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు అన్ని చర్యలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పట్టించుకోవట్లేదనేది దుష్ప్రచారమే..

దేశంలో 3 శాతం కరోనా మృతులుంటే.. రాష్ట్రంలో 1.7 శాతమే..

అవసరమైతే హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ పెడదామని సీఎం అన్నారు.

కోవిడ్‌ చికిత్స కోసం కొత్తగా 4,700 మంది ఉద్యోగులు విధుల్లోకి..

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.. మా పనితీరుని శంకించొద్దు..’అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులను పట్టించుకోవడం లేదని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుందని, ఇది సరైన పద్ధతి కాదని మంత్రి అన్నారు. అలాంటి ప్రచారం వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల మీద నమ్మకం సన్నగిల్లుతుందని, ఇది ప్రజలకు నష్టం చేకూరుస్తుందని చెప్పారు. సోమవారం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్న వారి మాటలు ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. చెస్ట్‌ హాస్పిటల్‌లో మరణించిన వ్యక్తి అంతకుముందు అనేక ఆస్పత్రులు తిరిగి వచ్చాడన్నారు. అర్ధరాత్రి వచ్చినా కూడా అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందించామని చెప్పారు.

కానీ గుండె సమస్యతో చనిపోయాడని, ఇందుకు సంబంధించి వైద్యులు కూడా ప్రకటన చేశారని, కానీ అతనికి ఆక్సిజన్‌ అందలేదనడం సరికాదని, ఆ వీడియో గమనిస్తే అతనికి ముక్కులో ఆక్సిజన్‌ పైపున్న సంగతి కనిపిస్తుందని వెల్లడించారు. ఇదే ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు చికిత్స అందించి కరోనా బారిన పడి హెడ్‌నర్స్‌ విక్టోరియా చనిపోయిందని, ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తుంటే ఇలాంటి విమర్శలు చేయడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది, వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది 3 నెలలుగా విరామం లేకుండా పనిచేస్తున్నారని, కరోనా వచ్చిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు మాత్రమే చనిపోతున్నారని మంత్రి వివరించారు. పరీక్షలు అవసరమున్న వారందరికీ చేస్తామని ప్రకటించారు.  
జాతీయ సగటు కంటే 

తక్కువ మరణాలు.. 
రాష్ట్రంలో కోవిడ్‌–19 మరణాలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నట్లు ఈటల చెప్పారు. దేశంలో మరణాలు 3 శాతం ఉండగా.. మన రాష్ట్రంలో మాత్రం 1.7 శాతంగా ఉందని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉందని, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల్లో బాధితుల సంఖ్య భారీగా ఉందని, హైదరాబాద్‌లో కూడా కేసుల సంఖ్య పెరుగుతున్నందున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమీక్షిస్తున్నారని చెప్పారు. ‘కరోనా పాజిటివ్‌ ఉండి లక్షణాలు లేని వాళ్లను ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం హోమ్‌ ఐసోలేషన్‌లో పెట్టి చికిత్స అందిస్తున్నాం. లక్షణాలున్న వాళ్లను మాత్రం వైద్యుల సలహా మేరకు ఆస్పత్రుల్లో చికిత్స చేస్తున్నాం.

రేపట్నుంచి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ ల్యాబ్‌ల ఆధ్వర్యంలో మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ప్రస్తుతం 2 వేల శాంపిల్స్‌ మాత్రమే ఉన్నాయి. వీటి పరీక్షలు పూర్తి చేస్తే అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించే వీలుంటుంది. కోవిడ్‌–19 కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ పెడదామని సీఎం అన్నారు..’అని మంత్రి ఈటల స్పష్టం చేశారు.

ప్రైవేటుకు వెళ్తే డబ్బులు వృథా
కరోనా లక్షణాలున్నవారు కింగ్‌ కోఠి, చెస్ట్‌ హాస్పిటల్, ఫీవర్‌ హాస్పిటల్‌కి రావాలని మంత్రి ఈట ల సూచించారు. ‘ప్రైవేట్‌ ల్యాబ్‌లో చేస్తున్న పరీ క్షల్లో 70 శాతం పాజిటివ్‌ రావడం గమనించాం. ఇది చాలా ఎక్కువని ఆ ల్యాబ్‌ల మీద నిపుణులతో పరిశీలన చేయిస్తున్నాం. తేడాలుంటే ల్యా బ్‌ యాజమాన్యంపైనా కఠిన చర్యలు ఉంటా యి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17,081 బెడ్లు సిద్ధం గా ఉన్నాయి. అందులో మూడున్నర వేల బెడ్ల కు ఆక్సిజన్‌ అందుబాటులో ఉందని, మరో ఆరున్నర వేల బెడ్లకు ఆక్సిజన్‌ సప్లై రెండ్రోజుల్లో పూర్తవుతుంది.

ప్రజలు ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్ళి డబ్బులు వృథా చేసుకోవద్దు. రాష్ట్రంలో కొత్తగా 4,700 మంది వైద్య సిబ్బందిని నియమించామని, కొత్తగా 150 అంబులెన్స్‌లు కూడా సమకూర్చుకున్నాం..’అని ఈటల చెప్పారు. అ త్యవసర పరిస్థితి ఉంటే 104 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌ పంపిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వెల్లడించారు. అనుమానితులు గాంధీ ఆస్పత్రికి వెళ్లొద్దని, ముందు పరీక్షలు నిర్వహించిన తర్వాతే తీవ్రతను బట్టి అక్కడికి పంపిస్తామని వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తెలిపారు. 

మరిన్ని వార్తలు