ప్రజలు, ప్రభుత్వానికి వారథికండి

30 Aug, 2016 02:31 IST|Sakshi
ప్రజలు, ప్రభుత్వానికి వారథికండి

సివిల్స్ ట్రైనీ అధికారులకు గవర్నర్ పిలుపు
ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఫౌండేషన్ శిక్షణను ప్రారంభించిన నరసింహన్

 సాక్షి, హైదరాబాద్: సామాజిక, ఆర్థిక అసమానతలకు పరిష్కారం చూపగ లిగే సామర్థ్యం సివిల్ సర్వీసెస్ అధికారులకే ఉంటుం దని, కొత్తగా సర్వీసులోకి వచ్చిన అధికారులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా పనిచేయాలని గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై 15 వారాల శిక్షణ నిమిత్తం ఇక్కడి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి వచ్చిన 120 మంది ట్రైనీ అధికారులకు సోమవారం ఫౌండేషన్ శిక్షణను గవర్నర్ ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం అందించే అభివృద్ధి ఫలాలను సమాజానికి దూరమైన వ్యక్తులకూ అందించాల్సిన బాధ్యత మీదే.

సమాజం మీపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చడమే మీ ముందున్న పెద్ద సవాల్’’ అని గవర్నర్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే సాధారణ ప్రజలకు అధికారులు కొంత సమయాన్ని  కేటాయించాలని...లేకుంటే అధికారులు, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్నారు. అధికారులు తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించినంత కాలం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగులకైనా, అధికారులకైనా ప్రభుత్వమిచ్చే జీత భత్యాలు సరిపోతాయని, జీవితాన్ని గడిపేందుకు అవి నీతికి పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. పోలీసు అధికారులు మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడాలన్నారు.

అన్ని సర్వీసులూ ముఖ్యమైనవేనన్నారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డెరైక్టర్ జనరల్ వీకే అగ్రవాల్ మాట్లాడుతూ ముఖ్యమైన అంశాలను ఇష్టపూర్వకంగా నేర్చుకొని సమాజం, దేశానికి మేలు జరిగేలా పనిచేయాలని ట్రైనీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కోర్సు సమన్వయకర్త అనితా బాలకృష్ణ, అదనపు కో ఆర్డినేటర్ ఆర్.మాధవి, అక డమిక్ అడ్వైజర్ విజయశ్రీ, జనరల్ మేనేజర్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు