ఏజెన్సీలో రుణమాఫీ

15 Nov, 2014 04:27 IST|Sakshi

భద్రాచలం: జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన, గిరిజనేతరులకు రుణమాఫీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ గ్రామీణ వికాస బ్యాంకు రీజనల్ మేనేజర్ జె. రాజగోపాల్ తెలిపారు. శుక్రవారం భద్రాచలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాచలం ఏబీజీవీబీ రీజనల్ పరిధిలోని 36 మండలాల్లో 42,135 మంది రైతులకు రూ.240 కోట్లు రుణాలను మాఫీ చేయనున్నట్లు చెప్పారు. ఇందులో తొలివిడతగా రూ.58.59 కోట్లు మంజూరయ్యాయని, 25 శాతం చొప్పున త్వరలోనే రైతుల ఖాతాలలో వీటిని జమ చేస్తామని తెలిపారు.

 రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను అన్ని గ్రామీణ బ్యాంకుల పరిధిలో ఉంచామన్నారు. వీటిని రైతులు పరిశీలించుకోవచ్చన్నారు. అయితే రుణాలు రీషెడ్యూల్ చేసుకుంటేనే మాఫీకి అర్హత ఉంటుందని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు. రైతు రుణాలను ఏడాది కాలవ్యవధితోనే ఇస్తామని, ప్రస్తుతం కాలపరిమితి దాటినందను తీసుకున్న రుణంపై 14 శాతం వరకూ వడ్డీ లెక్కిస్తున్నామని తెలిపారు. సక్రమంగా రుణాలను చెల్లించిన వారికే ప్రభుత్వ రుణమాఫీ పథకంలో భాగంగా మూడు దఫాలుగా మంజూరయ్యే మాఫీ మొత్తాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. రైతులకు దీనిపై అవగాహన కల్పించేందుకు గ్రామాలలో టమాకా వేయించాలని రెవెన్యూ అధికారులను కోరారు.  

 డిసెంబర్ 31లోపు రీషెడ్యూల్ చేసుకోండి...
 రీజియన్ పరిధిలోని 36 మండలాల్లో గల 65 శాఖలలో మొత్తం 54,856 మంది రైతులకు గాను 42,135 మంది రుణమాఫీకి అర్హత ఉందని, రెండవ దఫాగా మరో 9 వేల మందికి కూడా వర్తింపజేసేందుకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. రుణమాఫీకి అర్హులైన రైతులు డిసెంబర్ 31 లోగా రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలని కోరారు.

 ముంపు మండ లాల్లో వర్తింపు లేదు...
 ఏపీకి బదలాయించిన ముంపు మండలాల్లో రుణమాఫీ వర్తింపు ఆ ప్రభుత్వమే చెల్లించాల్సి ఉన్నందున, తాము వారి జాబితాను వేరు చేశామని చెప్పారు. ఏపీకి బదలాయించిన 7 మండలాల్లో 10 బ్రాంచీలు పూర్తిగా, 1 బ్రాంచి పాక్షికంగా ఆంధ్రలోకి వెళ్తున్నాయని, వీటిలో సుమారు రూ.10 కోట్ల వరకు రైతు రుణాలు ఉంటాయని చెప్పారు.
 వీటిపై ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.ఎస్‌హెచ్‌జీ గ్రూపులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని, మహిళలు తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించాలని కోరారు.

మరిన్ని వార్తలు