అద్దె కారుపై మోజు.. సర్కారు వాహనానికి బూజు!

4 Nov, 2017 13:12 IST|Sakshi

పెద్దపల్లిరూరల్‌: సర్కారు జీపులో తిరగడం సారుకు నామూషీగా అనిపించిందేమో.. మరో కారును అద్దెకు తీసుకొని తిరిగారు. కొత్తగా ఏర్పడ్డ పెద్దపల్లి జిల్లాకు వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టిన తిరుమల్‌ప్రసాద్‌కు ప్రభుత్వం ఓ జీపును కేటాయిం చి, దానిని నడిపేందుకు శ్రీనివాస్‌ అనే డ్రైవర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ జీపులోనే జిల్లా కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్, ఇతర సామగ్రిని సైతం తరలించారు. ఆతర్వాత నిబంధనలకు విరుద్ధంగా టాక్సీ కాకుండా సొంత రిజిస్ట్రేషన్‌ కలిగిన కారును అద్దెకు తీసుకోవడంతో సర్కారు జీపు మూలన పడింది. కారును అద్దెకిచ్చిన యజమాని అద్దె డబ్బుల కోసం ఒత్తిడి తేవడంతో అప్పటి జిల్లా కలెక్టర్‌ను నిధులు కేటాయించాలంటూ విన్నవించగా తిరస్కరించినట్లు తెలిసింది. 

దీంతో ఏదో ఓరకంగా సమకూర్చుకొని రెండు నెలల అద్దెను చెల్లించినట్లు సమాచారం. మిగతా అద్దెను ఇవ్వకుండా సదరు యజమానినే తన కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా కాంట్రాక్ట్‌ పద్ధతిన పని చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తిరిగి ప్రస్తుతం మంథని డివిజన్‌లో అన్‌ అకౌంట్‌ టేబుల్‌లో నిల్వ ఉన్న నిధుల నుంచి అద్దె కోసం రూ. 2లక్షలు కేటాయించాలంటూ ప్రస్తుత ఇన్‌చార్జి కలెక్టర్‌ను అభ్యర్థించి ఆమోదం పొందాడు. అయితే మంథని డివిజన్‌ అధికారి మాత్రం లక్ష నిధులను జిల్లా అధికారికి బదలాయించినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రామాల్లో తిరిగేందుకు తానే సొంతంగా కారును కొనుగోలు చేసిన సదరు అధికారి ప్రభుత్వ వేతనం పొందే డ్రైవర్‌ శ్రీనివాస్‌నే తన వాహనం నడిపించేందుకు ఉపయోగించడం విశేషం. 

ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల్‌ప్రసాద్‌ను వివరణ కోరగా కార్యాలయ అంతర్గత విషయాలు మీకెలా తెలుస్తాయి.. వివరాలు కావాలంటే మీరు కలెక్టర్‌నే అడగండి.. ఏదైనా వివరణ కావాలనుకుంటే ముఖాముఖి మాట్లాడాలని ఫోన్‌లో చెప్పడం కుదరదన్నారు. ఇదే విషయమై ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అధికారి శ్రీధర్‌ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో జగిత్యాల, పెద్దపల్లిలకే డ్రైవర్లు, వాహనాలను కేటాయించామన్నారు. సిరిసిల్లకు సౌకర్యం లేదన్నారు. వాహనాలు పాతవి కావడంతో మరమ్మతులు ఎక్కువైన కారణంగా అద్దెకు తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా