కోట్ల నిధులు ఏట్లో !

15 Jul, 2014 02:49 IST|Sakshi

 మణుగూరు :  ప్రభుత్వ నిధులు ‘నీళ్ల’ పాలు అన్న చందంగా ఉంది అధికారుల పనితీరు. కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలకు ఎక్కడా స్థలం దొరకలేదన్నట్లుగా వాగులో నిర్మిస్తున్నారు. దీంతో వాగులు నిండితే ఆ భవనాలు కూడా మునుగుతాయని, అవి ఎందుకూ పనికి రాకుండా పోతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ నిధులు ఏట్లో పోసినట్టేనని అంటున్నారు. ఇలాంటి నిర్మాణాలతో కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతారే తప్ప ప్రజలకు మాత్రం ఉపయోగం లేదని ఆరోపిస్తున్నారు.
 
 పినపాక నియోజకవర్గ కేంద్రమైన మణుగూరు మండల కేంద్రంలో అన్ని రకాల హాస్టళ్లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత చదువులు అందించే లక్ష్యంతో భవననాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి నిధులు కేటాయించింది. అయితే వచ్చిన నిధులను ఖర్చు చేయాలే తప్ప, వాటిని ఎలా సద్వినియోగం చేయాలనే ఆలోచన అధికారులకు లేకుండా పోయింది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మణుగూరు మండలంలో ఐటీడీఏ సహకారంతో నిర్మిస్తున్న ఎస్‌ఎంఎస్ హస్టల్ భవ నమే. మండలంలోని సమితిసింగారం కోడిపుంజుల వాగులో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇదే ప్రాంతంలో గతంలోనూ రూ.50 లక్షలతో మరో హాస్టల్ భవనాన్ని నిర్మించారు. అయితే వర్షాలు వస్తే వాగు పొంగితే ఈ భవనాలు ఎందుకూ పనికి రావని స్థానికులు అంటున్నారు.
 
వాగును ఎటూ డైవర్షన్ చేయలేదని, నీరొస్తే మునిగే ఈ భవనాలలో విద్యార్థులు ఎలా ఉంటారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కబ్జాదారులకు, ప్రైవేటు వ్యాపారులకు మంచి స్థలాలను చూపించే రెవెన్యూ అధికారులు ప్రభుత భవనాలకు మాత్రం స్థలం లేదంటూ ఇలా వాగులు వంకలు చూపించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనానికి ఐదేళ్లుగా స్థలం చూపించకపోవడంతో నిధులు వృథాగా పోవద్దనే ఉద్దేశంతో జూనియర్ కళాశాల ఆవరణలోనే దీన్ని కూడా నిర్మించారు. విద్యాలయాలకు సంబంధించిన భవనాల కే ఇలా ఆటంకాలు కల్పిస్తుంటే.. మారుమూల ప్రాంతాలలో విద్యాభివృద్ధి ఎలా సాధ్యమో ఉన్నతాధికారులే ఆలోచించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు