ఏ ఊరికెంత?

29 Mar, 2018 04:04 IST|Sakshi

గ్రామాలకు నిధుల కేటాయింపుపై ప్రభుత్వం వివరాల సేకరణ

సాక్షి, హైదరాబాద్‌: గ్రామాల అభివృద్ధికి నిధుల కేటాయింపుపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. వరుసగా మూడేళ్లపాటు గ్రామాలకు కేటాయించే నిధులపై ప్రణాళిక రూపొందిస్తోంది. 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో కేటాయించిన, కేటాయించాల్సిన నిధుల వివరాలను ఇవ్వాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించింది. పంచాయతీ ఎల్‌జీడీ కోడ్‌తోపాటు ఆర్థిక సంవత్సరాల వారీగా కేటాయింపులను పొందుపరచాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల  పథకాలకు మంజూరయ్యే నిధుల వివరాలను పేర్కొనాలని ఆదేశించింది.

గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు ఈ ఏడాది జూలై 31తో ముగుస్తున్న నేపథ్యంలో పంచాయతీరాజ్‌ కొత్త చట్టం అమల్లోకి తెచ్చిన తర్వాతే వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయిస్తామని సీఎం కేసీఆర్‌ పలుసార్లు ప్రకటించారు. దీంతో కొత్త పంచాయతీల ఏర్పాటు తర్వాత ప్రత్యేక అభివృద్ధి నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి గ్రామ పంచాయతీలకు రూ.1500 కోట్లతో పాటు ఇవి కాకుండా ఇతర సాధారణ అభివృద్ధి నిధులను మంజూరు చేస్తారు. ఏ గ్రామానికి ఎన్ని నిధులు కేటాయించాలనే అంచనా కోసం ప్రస్తుత కేటాయింపు  వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు