‘వార్దా’ కారిడార్‌ రద్దు?

4 Jul, 2018 02:38 IST|Sakshi

2015లోనే కారిడార్‌ను బుక్‌ చేసుకున్న ప్రభుత్వం 

ప్రస్తుతం దక్షిణాదిన సరిపడినంత విద్యుత్‌ లభ్యత

దీంతో 1000 మెగావాట్ల లైన్ల రద్దు యోచన

రద్దు చేసుకుంటే ఏటా రూ.350 కోట్ల జరిమానా

12 ఏళ్లలో రూ.4 వేల కోట్లకుపైగా నష్టపోనున్న డిస్కంలు   

సాక్షి, హైదరాబాద్‌: నవంబర్‌ నుంచి రాష్ట్రానికి అందుబాటులోకి రానున్న1000 మెగావాట్ల వార్దా–డిచ్‌పల్లి ట్రాన్స్‌మిషన్‌ కారిడార్‌ను వదులుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో మరో 1000 మెగావాట్ల కారిడార్‌ అవసరం లేదని తెలంగాణ ట్రాన్స్‌కోకు చెందిన అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో తీవ్ర విద్యుత్‌ కొరత నెలకొని ఉండేది. కొనుగోలు చేద్దామన్నా దక్షిణాదిన ఎక్కడా విద్యుత్‌ లభ్యత లేదు. ఉత్తర భారత దేశంలో పెద్దఎత్తున మిగులు విద్యుత్‌ ఉన్నా, అక్కడి నుంచి తరలించుకోవడానికి విద్యుత్‌ లైన్లు లేవు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టు కున్న రాష్ట్ర ప్రభుత్వం 2015లో ‘‘వార్దా–డిచ్‌ పల్లి 765 కేవీ డబుల్‌ సర్క్యూట్‌ పవర్‌ ట్రాన్స్‌ మిషన్‌ కారిడార్‌’’లో 2000 మెగావాట్ల లైన్లను 12 ఏళ్ల కాలానికి రాష్ట్ర అవసరాల కోసం ముందస్తుగా బుక్‌ చేసుకుంది.

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్లకోసం ఏడాది కాలంగా 1000 మెగావాట్ల సరఫరా లైన్లను వినియోగించుకుం టుండగా, మిగిలిన 1000 మెగావాట్ల లైన్లను వచ్చే నవంబర్‌ నుంచి వినియోగించుకోవాల్సి ఉంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచే మరో 1000 మెగా వాట్ల విద్యుత్‌ కొనుగోలు చేయాలని అప్పట్లో మరో కారిడార్‌ను బుక్‌ చేసుకుంది. అయితే, ప్రస్తుతం పరిస్థితుల్లో పూర్తి మార్పు వచ్చింది. గత మూడేళ్లల్లో పెద్దఎత్తున కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం పూర్తి కావడంతో దక్షిణాదిన అవసరమైనంత విద్యుత్‌ లభ్యత ఏర్పడింది. ఇక ఉత్తర భారతదేశం నుంచి విద్యుత్‌ కొను గోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కొనుగోలు చేస్తున్న 1000 మెగావాట్ల విద్యుత్‌కు సంబంధించిన ధరలను భారీగా పెంచాలని ఆ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ ఇటీవల అక్కడి విద్యుత్‌ నియంత్రణ మండలికి ప్రతిపాదించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి కొనుగోలు చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించు కుంది. ఇదే కోవలో వార్దా కారిడార్‌నూ రద్దు చేసుకోవాలని యోచిస్తోంది.

వదులుకుంటే నష్టమే !
ఉత్తర–దక్షిణ భారతదేశాన్ని అనుసంధానం చేస్తూ 4,350 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా సామర్థ్యంతో వార్దా–డిచ్‌పల్లి పవర్‌ ట్రాన్స్‌ మిషన్‌ కారిడార్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (పీజీసీఎల్‌) నిర్మించింది. విద్యుత్‌ సరఫరా లైన్ల కేటాయింపు జరిగాక రద్దు చేసుకుంటే కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) మార్గదర్శకాల ప్రకారం పీజీసీఎల్‌కు భారీ జరిమా నాలు కట్టాలి. ఒకసారి ట్రాన్స్‌మిషన్‌ కారిడార్‌ కేటాయింపులు జరిగిన తర్వాత అందులో కనీసం 66% సామర్థ్యాన్ని తప్పని సరిగా వినియోగిం చుకోవాల్సి ఉంటుంది. కారిడార్‌ను రద్దు చేసుకున్నా 66 శాతం విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన సరఫరా చార్జీలను పీజీసీఎల్‌కు జరిమానాగా చెల్లించక తప్పదని ప్రస్తుత నిబంధనలు పేర్కొంటున్నాయి. వార్దా–డిచ్‌పల్లి కారిడార్‌లో రాష్ట్రానికి కేటా యించిన వెయ్యి మెగావాట్ల లైన్ల ద్వారా రాష్ట్రానికి ఏటా 876 కోట్ల యూనిట్ల విద్యుత్‌ సరఫరాకు వీలు కలిగింది.

ఈ లైన్లను వినియోగించుకోకపోయినా 876 కోట్ల యూని ట్లలో 66 శాతమైన 578.6 కోట్ల యూనిట్ల విద్యుత్‌కు సంబంధించిన ట్రాన్స్‌మిషన్‌ చార్జీ లను పీజీసీఎల్‌కు జరిమానాగా చెల్లించాల్సి ఉండనుంది. విద్యుత్‌ సరఫరా చార్జీలు యూని ట్‌కు 55పైసల నుంచి 65 పైసల వరకు కానున్నాయి. యూనిట్‌కు సగటున 60 పైసలను సరఫరా చార్జీలుగా చెల్లించినా 578.6 కోట్ల యూనిట్ల విద్యుత్‌కు సంబంధించి ఏటా రూ.346.8 కోట్లు చొప్పున 12 ఏళ్ల పాటు పీజీసీఎల్‌కు రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు రూ.4,161 కోట్లకు పైగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. వార్దా–డిచ్‌పల్లి కారిడార్‌లోని రెండో 1000 మెగావాట్ల కారిడార్‌ను రద్దు చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రాన్స్‌ కోకు చెందిన సీనియర్‌ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రద్దు చేసుకుంటే జరిమానాలు వసూలు చేయాలా? వద్దా? అన్న అంశంపై అధ్యయ నం కోసం సీఈఆర్సీ గతంలో ఓ కమిటీని నియమిం చిందని, సాంకేతికంగా జరిమానాలు వసూలు చేయడం సాధ్యం కాదని ఆ కమిటీ నివేదిక ఇచ్చిందని ఆ అధికారి స్పష్టం చేశారు. వార్దా– డిచ్‌పల్లి కారిడార్‌ను రద్దు చేసుకున్నా జరిమానాలు చెల్లించాల్సి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు