మద్యం వ్యాపారుల ముందు చూపు!

26 May, 2014 02:49 IST|Sakshi

 కామారెడ్డి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో మద్యం సరఫరా నిలిపివేయడానికి ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యాపారులు ముందుచూపుతో వ్యవహరించారు. విభజన విరామ సమయంలో మద్యం కొరత లేకుండా చూసుకోవడానికి గాను రెగ్యులర్ కన్నా రెట్టింపు డీడీలు చెల్లించి మద్యం తెప్పించుకుంటున్నారు. ఈ నెల 24 లోపు డీడీలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వ్యాపారులు ఇండెంట్ భారీగా ఇచ్చినట్టు సమాచారం. జూన్ 2న కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాతనే మద్యం సరఫరా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నెల 27 వరకే మద్యం సరఫరా అవుతుంది. దీంతో మద్యం వ్యాపారులు తమకు కావలసిన ఇండెంట్ ఇచ్చేసుకుని స్టాక్ కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చిన స్టాక్‌ను తమకు అనుకూలమైన ప్రాంతాల్లో భద్రపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల తరువాతనే మద్యం వచ్చే అవకాశం ఉండడంతో అప్పటి వరకు కొరత లేకుండా చూసుకోవాలని వ్యాపారులు ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మద్యం కొరత ఉంటే ఎక్కువ  ధరలకు అమ్ముకోవచ్చన్న భావనతో ఉన్న కొందరు వ్యాపారులు ముందుచూపుతో స్టాక్ తెప్పించుకుని నిల్వ చేస్తున్నారు.

వరుసగా వచ్చిన ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. చాలా చోట్ల మద్యం దొరక్క దుకాణాలు మూసి ఉంచాల్సి వచ్చింది. ఈ సమయంలో కొందరు వ్యాపారులు అడ్డగోలు ధరలకు మద్యం అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితిని ఊహించుకుంటున్నారు. తెలంగాణ రాష్ర్టం అధికారికంగా ఏర్పడిన సమయంలో ప్రజలు పండుగ చేసుకోవడానికి సన్నద్ధమవుతుండడంతో దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి మద్యం వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు.

జూన్ ఒకటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ సంబరాలు జరుపుకోవడానికి ఉద్యమకారులు, తెలంగాణ వాదులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరు దశాబ్దాల ఆకాంక్షకు అధికారిక గుర్తింపు వచ్చిన రోజును ఎప్పటికీ గుర్తుండేలా సంబరాలు చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. దీన్ని గుర్తించిన మద్యం వ్యాపారులు పెద్ద ఎత్తున మద్యం నిల్వలు చేస్తున్నట్టు సమాచారం. మద్యం నిల్వల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోవడంతో వ్యాపారులు భారీ ఎత్తున సొమ్ము చేసుకోనున్నారు.

 నకిలీ మద్యం వచ్చే అవకాశం...
 మద్యం సరఫరాకు విరామం ప్రకటించిన నేపథ్యంలో వ్యాపారులు ఒకవైపు నిల్వలు చేసుకుంటూనే మరోవైపు నకిలీ మద్యంను రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నాన్ డ్యూటీ పెయిడ్ మద్యంను తీసుకురావడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల సమయంలో కూడా కొందరు వ్యాపారులు నకిలీ మద్యం, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని తీసుకువచ్చి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారు. ఇప్పుడు అదే రకంగా ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. నకిలీ మద్యంపై ఆబ్కారీ అధికారులు  దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు