కరోనా రోగులకు ఎన్జీవోల అండ

20 Jul, 2020 01:27 IST|Sakshi

స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సర్కారు నిర్ణయం

కరోనా ఆసుపత్రులు, ఐసోలేషన్‌లో ఉన్న వారికి వైద్య సాయ

మంత్రి ఈటలతో ఐదారు సంస్థల చర్చలు.. కుదిరిన ఒప్పందం  

సాక్షి, హైదరాబాద్ ‌: కరోనా మహమ్మారిపై పోరులో స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోలు) సహకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ ఆసుపత్రి సహా పలు కరోనా చికిత్స కేంద్రాలు, ఐసోలేషన్‌ సెంటర్లలో వారి సేవలను ఉపయోగించు కోనుంది. కరోనా కేసులు పెరుగు తుండటం, కొన్ని చోట్ల ప్రభుత్వ వైద్యులు, నర్సులు వైరస్‌ బారిన పడిన నేపథ్యంలో  రోగులకు చికిత్స, ఉపశమన చర్యల్లో ఎన్జీవోలను భాగస్వాములను చేయనుంది. ఇందు కోసం ఐదారు ఎన్జీవోలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సంస్థల ప్రతినిధులు తాజాగా మంత్రి ఈటల రాజేందర్‌తో ఒప్పందానికి వచ్చారు. ఆ సంస్థల్లోని వారంతా వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందే కావడం గమనార్హం. ఒక్కో ఎన్‌జీవోలో 100 మంది వరకు వైద్య సిబ్బంది ఉన్నారు. ఆ ప్రకారం ఐదారు వందల మంది ఎన్జీవోల సభ్యులు.. ప్రభుత్వ ఆసుపత్రులు, ఐసోలేషన్‌ వార్డులు, హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులకు సేవలు అందించనున్నారు.

ఎలాంటి సేవలంటే?
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 44 వేలు దాటింది. బాధితుల్లో కొందరు కోలుకోగా మిగిలిన వారిలో అనేక మంది వివిధ ఆసుపత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు క్వారంటైన్, ఐసోలేషన్‌ కేంద్రాల్లో సేవలు అందించడానికి ముందుకు వచ్చాయి. ఆయా కేంద్రాల్లో అవసరమైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి. మరికొన్ని సంస్థలు సామాన్య ప్రజలలో అవగాహన పెంచడానికి, సోషల్‌ మీడియాలో వస్తున్న అపోహలను నివృత్తి చేయడానికి నడుంబిగించాయి. అందుకోసం అవసరమైన పోస్టర్లు, వీడియోలు, ఆడియోలు తయారు చేసి చైతన్యం కలిగించనున్నాయి. ఈ ప్రచారంలో టీవీ చానళ్లు, రేడియోలను భాగస్వాములను చేసుకోనున్నాయి.

మరికొన్ని సంస్థలు కరోనాతో చనిపోయిన వారిని ఖననం చేయడంలో సహకారం అందించనున్నాయి. యువజన సంక్షేమ బృందాల సహకారంతో గౌరవప్రదమైన ఖనన సేవలను అందించనున్నాయి. అలాగే వేలాది మాస్క్‌లను ప్రజలుకు అందించడంతోపాటు ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. లైసెన్స్‌ పొందిన, పేరున్న బ్లడ్‌ బ్యాంక్‌తో కలసి ప్లాస్మా డొనేషన్‌ బ్యాంక్‌ను ప్రారంభించాలని నిర్ణయించాయి. కోలుకున్న రోగులు వారి ప్లాస్మాను దానం చేసేలా ప్రోత్సహించనున్నాయి. కరోనా అనుమానితులకు వీడియో సంప్రదింపుల ద్వారా చికిత్స చేయడం, ఇంట్లో చికిత్స పొందే వారికి ఆక్సిజన్‌ ఏర్పాటు చేయడంలో సాయం అందించనున్నాయి.

ఉపశమన చర్యలు కూడా...
తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగుల్లో ధైర్యం నింపడం, అవసరమైన సేవలు అందించడం ద్వారా వారి రోగాన్ని తగ్గించేలా స్వచ్ఛంద సంస్థలు పనిచేయనున్నాయి. పాలియేటివ్‌ కేర్‌గా పిలిచే ఈ విధానంలో రోగులకు తరచూ ఉపశమనం కల్పించడం, ఓదార్చడం కీలకంగా ఉంటుంది. ఇటువంటి సేవలకూ ఎన్జీవోలు ముందుకొచ్చాయి. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో ఇటువంటి సేవలు అందించనున్నాయి.

అలాగే హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందే వారిని చూసుకోవడానికి కమ్యూనిటీ నర్సింగ్‌ సిబ్బందిని నియమించనున్నాయి. నిపుణులు అందుబాటులో లేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు మందుల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నాయి. ఒకవేళ ఆసుపత్రిలో ఉంటే బంధువులతో ఫోన్‌ లేదా వీడియో కాల్‌ ద్వారా రోగులు మాట్లాడే అవకాశం కల్పించనున్నాయి. రోగుల్లో ఎవరైనా మరణశయ్యపై ఉంటే భావోద్వేగ, ఆధ్యాత్మిక సాయం అందించనున్నాయి.  

మరిన్ని వార్తలు