షాబాద్‌లో ‘వెల్‌స్పన్‌’ పరిశ్రమలు!

24 Mar, 2018 02:35 IST|Sakshi

రెండు వస్త్ర పరిశ్రమలు, మరో లైన్‌పైప్‌ తయారీ పరిశ్రమ 

ప్రత్యేక రాయితీలు ప్రకటించిన ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 3 పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన వెల్‌స్పన్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను మంజూరు చేసింది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందన్వెల్లిలో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమలకు సంబంధించి.. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటికి పెట్టుబడి రాయితీతోపాటు పెట్టుబడి రుణాలపై 8 ఏళ్లపాటు ఏడా దికి 8% చొప్పున వడ్డీ రీయింబర్స్‌మెంట్, పదేళ్ల పాటు ఉత్పత్తులపై రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు తదితర రాయితీలు అందజేస్తున్నారు. 

ఉలెన్, నాన్‌ ఉలెన్‌ వస్త్రాల పరిశ్రమ 
ఉలెన్‌ వస్త్రాలు, నాన్‌–ఉలెన్‌ వస్త్రాల ఉత్పత్తికి  రూ.409 కోట్లతో 150 ఎకరాల్లో టెక్నికల్‌ టెక్స్‌ టైల్స్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి పెట్టుబడి రాయితీ కింద రూ.40 కోట్లు ఇస్తున్నారు. దీని ద్వారా 686 మందికి ప్రత్యక్షంగా.. 1000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. 

కార్పెట్ల తయారీ పరిశ్రమ 
నేలపై వేసే ఫ్లోర్‌ కవరింగ్‌ కార్పెట్లు, ఎల్‌వీటీ తదితర ఉత్పత్తుల కోసం రూ.1,261 కోట్లతో 500 ఎకరాల్లో మరో టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి రూ.80 కోట్ల పెట్టుబడి రాయితీ ఇస్తుండగా 1,000 మందికి ప్రత్యక్షంగా.. 2 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. 

లైన్‌పైప్‌ల తయారీ పరిశ్రమ: లైన్‌పైప్‌ల తయారీకి 266 కోట్లతో 150 ఎకరాల్లో పరిశ్రమను నిర్మించనున్నారు. దీనికి ప్రభుత్వం 10% పెట్టుబడి రాయితీ, ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.  

మరిన్ని వార్తలు