అంబులెన్స్‌..ఫిట్‌‘లెస్‌’!

23 Aug, 2019 12:06 IST|Sakshi

గ్రేటర్‌లో డొక్కు బండ్లే ప్రాణదాతలు

సకాలంలో సర్వీసింగ్, నిర్వహణ లేకపోవడమే కారణం

నగరంలో సుమారు 2500కి పైగా అంబులెన్స్‌లు

మరో 50కి పైగా 108 వాహనాలు

సాక్షి, సిటీబ్యూరో: అంబులెన్స్‌ సైరన్‌ వినిపిస్తే చాలు ప్రతి ఒక్కరూ అప్రమత్తమవుతారు. ఎవరికి ఏ ఆపద ముంచుకొచ్చిందో తెలియదు. ఎక్కడో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతమంది తీవ్రంగా గాయపడ్డారో  తెలియదు. అలా రోడ్డుపైన అంబులెన్స్‌ కనిపిస్తే ఏ మానవతా  హృదయమైనా స్పందిస్తుంది. కాలంతో పోటీ పడి పరుగులు తీసే అంబులెన్స్‌లు క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చి ప్రాణాలను కాపాడతాయి. ఆపదలో ఉన్నవారికి ప్రాణ దాతల్లా  నిలుస్తాయి. అలాంటి అంబులెన్స్‌లు మార్గమధ్యలో ఆగిపోతే ఎలా ఉంటుంది. గుండెపోటుతో బాధపడుతున్న ఆనంద్‌ అనే ఎంఎంటీఎస్‌ ప్రయాణికుడు ఆస్పత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయినట్లుగా ఉంటుంది. ప్రమాదాలు జరిగిన సంఘటనా స్థలానికి సకాలంలో చేరుకోలేకపోవడం వల్ల ఎంతోమంది క్షతగాత్రులు అసువులు బాస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో చాలా వరకు అంబులెన్స్‌ల పరిస్థితి ఇలాగే ఉంది. ఫిట్‌నెస్‌ లేనివి, కాలం చెల్లినవే ఎక్కువ శాతం ప్రాణాలు నిలిపే వాహనాలుగా  కనిపిస్తున్నాయి. ఒక్క 108 అంబులెన్స్‌లే కాకుండా ఆసుపత్రుల నిర్వహణలో ఉన్నవి, ప్రైవేట్‌ వ్యక్తులు సొంతంగా నడిపించుకొనేవి కూడా చాలా వరకు ఫిట్‌నెస్‌ లేకుండా తిరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి, రెండు కార్పొరేట్‌ ఆసుపత్రులు మినహా అనేక ఆసుపత్రుల్లో ఇలాంటి వాహనాలే ప్రాణప్రదాతలుగా దర్శనమిస్తున్నాయి.

వేగం కంటే కూతే ఎక్కువ
అంబులెన్స్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలు కాకుండా చాలా వరకు మారుతీ ఓమ్నిలను అంబులెన్స్‌లుగా మార్చేస్తున్నారు. పేషెంట్‌ కోసం ఒక స్ట్రెచర్‌ పట్టేంత స్థలం, ఇద్దరు అటెండర్స్‌ కూర్చొనే వెసులు బాటు ఉంటే చాలు సైరన్‌ అమర్చేస్తున్నారు. ఇలాంటి వాహనాల వేగం కంటే సైరన్‌ మోతలే ఎక్కువ. అంబులెన్స్‌ ఎంతో సమీపంలో ఉన్నట్లుగా సైరన్‌  వినిపిస్తుంది. కానీ వాహనం మాత్రం అల్లంత దూరంలో కనిపిస్తుంది. నిర్వహణ లోపం వల్లనే ఇలా నత్తనడక నడిచే వాహనాలు అంబులెన్స్‌లుగా రోడ్డెక్కుతున్నట్లు రవాణా నిపుణులు భా విస్తున్నారు. ట్రాఫిక్‌ రద్దీ కారణంగా అంబులెన్స్‌లు సకాలంలో సంఘటనా స్థలానికి అక్కడి నుంచి ఆసుపత్రికి చేరుకోలేకపోతున్నాయి. కానీ ఆ సమస్యతో పాటు ఫిట్‌నెస్‌ లేకపోవడం కూడా మరో ప్రధానమైన అంశమే. రవాణా వాహనాలకు ఏడాదికి ఒకసారి  అధికారులు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించి వాటి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు. కానీ అంబులెన్స్‌లకు మాత్రం సకాలంలో ఫిట్‌నెస్‌ పరీక్షలు జరగడం లేదు. ఒకవైపు అధికారులు నిర్లక్ష్యం, మరోవైపు  ఆసుపత్రులు, వాహన యజమానుల నిర్లక్ష్యం వల్ల  ఫిట్‌నెస్‌ లేని బండ్లే రోడ్డెక్కుతున్నాయి. 

అంబులెన్స్‌లా అయితే ఓకే
గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 50 కి పైగా 108 వాహనాలు ఉన్నాయి. 2009 నుంచి అంటే గత పదేళ్లుగా  ఇవి సేవలందజేస్తున్నాయి. వీటిలో చాలా వరకు డొక్కు వాహనాలుగా మారాయి. ఆసుపత్రులు, ప్రైవేట్‌ వ్యక్తుల నిర్వహణలో మరో 2500కు పైగా  ఉన్నట్లు  అంచనా.  చాలావాటికి సర్వీసింగ్‌ చేయించకపోవడం వల్ల నాణ్యత దెబ్బతింటుంది. లక్షలకొద్దీ కిలోమీటర్లు తిరిగిన వాహనాలను కూడా అంబులెన్స్‌లుగా వినియోగిస్తున్నారు. వాహనాలు కొనుగోలు చేసిన రోజు నుంచి 8 ఏళ్ల వరకు  ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫిట్‌నెస్‌ పరీక్షలు  చేయాలి. తర్వాత క్రమం తప్పకుండా ఏటా పరీక్షలు జరగాలి. ఇంజన్‌ సామర్ధ్యంతో పాటు బాడీ, బ్రేక్‌లు, డోర్‌లు, తదితర అన్ని భాగాలను క్షుణ్ణంగా పరీక్షించిన తరువాత మాత్రమే వాటి సమర్ధతను నిర్ధారించవలసి ఉంటుంది. కానీ ఆర్టీఏ అధికారులు  అంబులెన్స్‌ల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిట్‌నెస్‌ లేని వాటిపైన ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు పరీక్షలకు వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించకుండానే వదిలేస్తున్నారు. ‘అంబులెన్స్‌లే కదా బాగానే ఉంటాయిలే అనుకోవడం వల్లనే ఫిట్‌నెస్‌ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం  చోటుచేసుకుంటుంద’ని  ప్రాంతీయ రవాణా అధికారి  ఒకరు వ్యక్తం చేసిన అభిప్రాయం ఆ వాహనాల సమర్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది.

మరిన్ని వార్తలు