పల్లె నాడి పట్టని డాక్టర్‌

19 Dec, 2019 02:46 IST|Sakshi

గ్రామాల్లో పనిచేసేందుకు వైద్యుల విముఖత

జిల్లా కేంద్రాలు, రాజధాని చుట్టుపక్కల ఆసుపత్రుల్లోనే ఉద్యోగానికి సిద్ధం 

దూర ప్రాంతాలకు పోస్టింగ్‌ ఇస్తే దీర్ఘకాల సెలవులో వెళ్తున్న వైనం

ప్రభుత్వ వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలు

90 శాతం మంది డాక్టర్ల  నివాసం  ఇతర ప్రాంతాల్లోనే...

సాక్షి, హైదరాబాద్‌: నగరాలకు సమీపంలోని ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అనేకచోట్ల పూర్తిస్థాయిలో వైద్యులు, ఇతర సిబ్బంది ఉంటున్నారు. కానీ సుదూర ప్రాంతాల్లోని అవే కేటగిరీ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత భారీగా ఉంది. హైదరాబాద్‌ సమీపంలో పనిచేసే వారంతా సొంత క్లినిక్‌లు లేదా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఉన్నవారు కూడా హైదరాబాద్‌లోనో ఇతర నగరాల్లోనో ఉంటూ అప్పుడప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వస్తున్నారు. 

డాక్టర్‌ కృష్ణమోహన్‌ (పేరు మార్చాం) సూర్యాపేట జిల్లాలోని ఓ పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లో ఉంటూ అప్పుడప్పుడూ వెళ్లి వస్తుంటారు. వారానికి రెండుసార్లకు మించి వెళ్లరు. హైదరాబాద్‌లో క్లినిక్‌ నడుపుతున్నందున దీనిపైనే దృష్టి అంతా. దీంతో ఆ పీహెచ్‌సీ పరిధిలోని రోగులు ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్తున్నారు. 

90 శాతం మంది అంతే.. 
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వారిలో 90 శాతం మంది వైద్యులు ఇతర ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. 40 శాతం మంది వైద్య సిబ్బంది విధులకు గైర్హాజరు అవుతున్నారని, సమయ పాలన లేకుండా డ్యూటీలకు హాజరవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇటీవల నిర్వహించిన సమీక్షలో జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు సుదూర ప్రాంతాల్లో ఉండటంతో రోగులకు అవసరమైనప్పుడు వైద్య సేవలు అందట్లేదు. ఒకవేళ డాక్టర్లకు ఇష్టం కాని ప్రాంతాలకు పోస్టింగ్‌ ఇస్తే అంతే సంగతులు.. దీర్ఘకాలిక సెలవులపై వెళ్తున్నారు. విచిత్రమేంటంటే గతేడాది వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆసుపత్రుల కోసం 919 మంది స్పెషలిస్టు వైద్యుల పోస్టులను భర్తీ చేస్తే, తమకు ఇష్టమైన చోట పోస్టింగ్‌ ఇవ్వలేదని ఏకంగా 200 మంది తమ ఉద్యోగాలను వదిలేసుకున్నారు. ఆ తర్వాత 90 మంది స్పెషలిస్టులు సమాచారం లేకుండా గైర్హాజరవుతున్నారని షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. అయినా మార్పు లేకపోవడంతో వారిని విధుల నుంచి తొలగించారు.
 
పేరుకుపోయిన ఖాళీలు.. 
రాష్ట్రంలో 885 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) ఉన్నాయి. 30 నుంచి 40 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) 41 ఉన్నాయి. అలాగే ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రులు, బోధనాసుపత్రులు ఉన్నాయి. పీహెచ్‌సీలకు మంజూరైన పోస్టులకు, వాస్తవంగా పనిచేస్తున్న సిబ్బందికి మధ్య తేడా కనిపిస్తోంది. ఒక్కో పీహెచ్‌సీకి ఒక మెడికల్‌ ఆఫీసర్, ఒక స్టాఫ్‌ నర్సు సహా ఇతర పారామెడికల్‌ సిబ్బందితో కలిపి మొత్తం 8 మంది ఉండాలి. 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీల్లో ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు సహా ఇతర పారామెడికల్‌ సిబ్బందితో కలిపి 12 మంది ఉండాలి. ఇక 30–40 పడకలున్న సీహెచ్‌సీల్లో ఒక సూపరింటెండెంట్, ముగ్గురు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, ఆరుగురు స్టాఫ్‌ నర్సులు సహా మొత్తం 14 మంది ఉండాలి.

ఏరియా ఆస్పత్రుల్లో గైనిక్, పీడియాట్రిక్, జనరల్‌ సర్జన్, అనస్థీషియా స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండాలి. జిల్లా ఆస్పత్రుల్లో దాదాపు అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు ఉండాలి. కానీ ఖాళీలు మాత్రం చాలా ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, బోధనాసుపత్రులు, వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు మొత్తం కలిపి 26,404 మంది ఉండాలి. అందులో 17,148 మంది పనిచేస్తుండగా.. 9,256 ఖాళీలున్నాయి. అందులో వైద్య ఖాళీలే ఏకంగా 4,201 ఉండటం గమనార్హం. అందులో వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో 4,500 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 2,100 మంది మాత్రమే ఉన్నారు. 2,400 ఖాళీలు ఉండటం గమనార్హం. ఈస్థాయిలో ఖాళీలు ఏర్పడటంతో ఎక్కడికక్కడ వైద్య సిబ్బంది కొరత రోగులపాలిట శాపంగా మారింది.
 
సర్కారు వర్సెస్‌ వైద్యాధికారులు.. 
ఖాళీలను ఇప్పటికిప్పుడు నింపే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న వైద్యులను, ఇతర వైద్య సిబ్బందిని సర్దుబాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల పదేపదే చెబుతున్నారు. హేతుబద్ధీకరించడం ద్వారా వైద్యుల కొరతను తాత్కాలిక తీర్చొచ్చని ఉన్నతాధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు నిబంధనల ప్రకారం 1512 స్టాఫ్‌ నర్సులు కావాలి. కానీ 1276 మాత్రమే ఉన్నారు. ఇంకా 236 మంది స్టాఫ్‌నర్సుల కొరత ఉంది. వారిలో కొందరిని అవసరం లేని చోట నుంచి అవసరమున్న చోటకు తరలించాలని ఆదేశించారు. అయితే హేతుబద్ధీకరణకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. మంత్రి ఆదేశాలను అమలు చేయాల్సిన వైద్యాధికారులే అడ్డంకులు సృష్టిస్తున్నారు. ‘ప్రైవేటు ప్రాక్టీస్‌ అలవెన్స్‌ 20 శాతం వరకు ఇస్తే, అప్పుడు వైద్యులను ఒప్పించడానికి వీలుంటుందని’ఓ కీలక వైద్యాధికారి వ్యాఖ్యానించారు. 

ఎంబీబీఎస్‌ డాక్టర్లే పరిష్కారం 
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో ఎలాగూ స్పెషలిస్టులు పని చేయడానికి ముందుకు రావట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పేద ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ఎంబీబీఎస్‌ డాక్లర్లను నియమిస్తే బాగుంటుందని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. జ్వరం, కడుపునొప్పి, విరేచనాలు వంటి చిన్న చిన్న జబ్బుల చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్తులకు వెళ్లాల్సి వస్తోందని, దీన్ని నివారించేందుకు ఎంబీబీఎస్‌ డాక్టర్ల నియామకం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. ఎంతో మంది ఎంబీబీఎస్‌ వైద్యులు తక్కువ వేతనాలతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పని చేస్తున్నారని, వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ప్రజలకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు. 

ఎక్కడికంటే అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు: డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, వైద్య విద్య డైరెక్టర్‌ 
వైద్యుల హేతుబద్ధీకరణ నిర్ణయం మంచిదే. కానీ స్పెషలిస్టు వైద్యులు తమకు నచ్చని చోటకు బదిలీ చేస్తే వెళ్లడానికి ముందుకు రావట్లేదు. అవసరమైతే తమ ఉద్యోగాలను వదిలేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సర్దుబాటు చేయడం అంత సులువైన వ్యవహారం కాదు. దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు చేయాలి. వైద్యులతో మాట్లాడి కౌన్సిలింగ్‌ చేసి వారిని ఒప్పించి పంపాలి. ఒత్తిడి చేస్తే వెళ్లే పరిస్థితి ఉండట్లేదు. ఎందుకంటే సొంత ప్రాక్టీసు వారికి ముఖ్యం. ఆ ధీమాతోనే వారు ఎక్కడికీ వెళ్లట్లేదు.   

మరిన్ని వార్తలు