ఆత్మహత్యలపై ‘లెక్క’లేనితనం!

2 Mar, 2015 03:50 IST|Sakshi

- రైతుల బలవన్మరణాల నిర్ధారణలో అశాస్త్రీయత
- గత అక్టోబర్ వరకు 69 మంది చనిపోయారని సర్కారు ఉవాచ
- ఇప్పటివరకూ 130 మంది ఆత్మహత్యలు చేసుకొని ఉండొచ్చని అంచనా
- ఆ సంఖ్య 760 ఉంటుందని స్పష్టీకరించిన రైతు సంఘాలు
- ‘ఇతర కారణాలు’ అంటూ పక్కన పెడుతోన్న డివిజినల్ కమిటీలు

 
వ్యవ‘సాయం’ వెక్కిరించడంతో పురుగు మందు తాగి ప్రాణాలొదిలింది ఒకరు.. ఎండుతున్న పంటలను చూసి గుండెమండి మరణించిందొకరు.. దిగుబడి రాక, అప్పులు తీర్చలేక ఉరితాడుకు వేలాడిందొకరు.. కారణమేదైనా.. సమాజానికి అన్నం పెట్టే రైతన్నల నిండుప్రాణాలు నిలువునా నీరుగారుతున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి (2014 జూన్ 2 నుంచి) ఇప్పటిదాకా మరణించిన రైతులెందరో తెలుసా? టీఆర్‌ఎస్ సర్కారు చెబుతున్నట్లుగా 130 మంది మాత్రం కాదు.. ఆ సంఖ్య 760 వరకూ ఉండొచ్చని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఆత్మహత్యల్ని శాస్త్రీయంగా లెక్కించకపోవడం వల్లే బలవన్మరణాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలు కకావికలవుతున్నాయి.              - సాక్షి, హైదరాబాద్


 
మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని పెనిమిళ్లలో గత ఏడాది సెప్టెంబర్ 27న అప్పుల బాధతో రైతు కొట్టం బచ్చయ్య (48) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ బాధను జీర్ణించుకోలేని అతని భార్య కొట్టం వెంకటమ్మ (38) కూడా మరుసటి రోజు (భర్త అంత్యక్రియల రోజే) తనువు చాలించింది. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే... తన ఆరెకరాల భూమిలో బచ్చయ్య పత్తి వేశాడు. అది తెగుళ్లు సోకి మొత్తం పాడై పోయింది. అప్పటికే ఆయన అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో ఏం చేయాలో అర్థంకాక ఒక ఎకరం భూమి అమ్మాడు. అయినా ఇంకా రూ. 4 లక్షల అప్పు మిగిలివుంది. దీంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
వెంకటమ్మ తల్లిది అదే ఊరు కావడంతో పిల్లలు రాధిక, శివ అమ్మమ్మ, నాన్నమ్మల ఇంటివద్ద ఉంటున్నారు. ఇప్పటివరకు ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు సరికదా ఆత్మహత్య చేసుకున్న కుటుంబంగా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు. స్థానిక తహసీల్దార్ వివరాలు రాసుకొని వెళ్లాడేకానీ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదని అక్కడి అధికారులే చెబుతున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలపై ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తోన్న తీరుకు ఇదో నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి ఆత్మహత్య సంఘటనలు అనేకం జరిగినా జిల్లా యంత్రాంగం వాటిని ఆత్మహత్యలుగా గుర్తించడం లేదు.
 
పెరిగిన అప్పులతోనే జీవితంపై విరక్తి...
రాష్ట్రంలో గత ఖరీఫ్ నాటికి రుతుపవనాలు రాక వర్షాలు కురవలేదు. జూన్ 1 నుంచి ఖరీఫ్ సీజన్ ముగిసిన సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొత్తం 464 మండలాలకుగాను.. 339 మండలాల్లో లోటు వర్షపాతమే. 80 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షపాతం లోటుతో భూగర్భ జలాలు అడుగంటి సాగు విస్తీర్ణం పడిపోయింది. ఈ ఖరీఫ్‌లో ఆహారధాన్యాల సాగు 20.60 లక్షల హెక్టార్లలో జరగాల్సి ఉండగా.. 17.18 లక్షల హెక్టార్లకు (83%) పడిపోయింది. మొత్తం సాగులో దాదాపు 40 శాతం పంటలు ఎండిపోయినట్లు సమాచారం. అనేకచోట్ల రైతులు పంటలను తగులబెట్టారు. బోర్లు, బావులకు, పంటల సాగు కు అప్పులు చేయడంతో భవిష్యత్తు కానరాక రైతన్నలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో చాలా మంది కౌలుదారులే. వీరికి బ్యాంకు రుణాలు రాకపోవడంతో ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశారు. వడ్డీవ్యాపారుల వేధింపులకు తాళలేక చాలామంది ఆత్మహత్యలే శరణ్యమనుకున్నారు.
 
పరిహారం ఎగ్గొట్టేందుకే...

ప్రభుత్వం పరిహారాన్ని ఎగ్గొట్టేందుకే రైతు ఆత్మహత్యలను తక్కువ చేసి చూపిస్తోంది. 421 జీవో ప్రకారం ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి  లక్షన్నర ఇవ్వాలి. అది ఇవ్వకుండా చేయడానికే ఈ ప్రయత్నం. మా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 760 మంది చనిపోయారు. పత్రికల్లోనూ ఇవే వాస్తవాలు వచ్చాయి. ప్రతీ ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను తక్కువగా  చూపడం దారుణం. ఐదెకరాలలోపున్న రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందజేయాలి. వడ్డీలేని రుణాలివ్వాలి. అప్పుడే ఆత్మహత్యలు ఆగుతాయి.
     - సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం నేత
 
 
పొంతన లేని అధికారుల లెక్క..
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను నిర్ధారించేందుకు జిల్లాల్లో డివిజన్ స్థాయిలో ఆర్డీవో చైర్మన్‌గా, డీఎస్పీ, వ్యవసాయశాఖ ఏడీలు సభ్యులుగా ముగ్గురు సభ్యులతో కమిటీలు వేశారు. వారు నిర్దారించిన ప్రకారం తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అక్టోబర్ చివరి నాటికి రాష్ట్రంలో 69 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు నిర్ధారించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని స్పష్టంగా నిర్ధారించలేదు. అయితే వ్యవసాయశాఖ అధికారులు మాత్రం రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 69తో కలుపుకొని దాదాపు 130 మంది వరకు ఆత్మహత్య చేసుకోవచ్చని అంచనా వేశారు. ఇంత తక్కువగా అంచనా వేయడంపై రైతు సంఘాలు, ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతులు 760 మంది ఉంటారని రైతు సంఘాల నేతలు ప్రకటించారు.
 
గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు 578 మంది, ఈ ఏడాది ఇప్పటివరకు 182 మంది చనిపోయారని వారు లెక్కగట్టారు. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం చాలా ఆత్మహత్యలను ‘ఇతర కారణాలతో’ జరిగినవిగా అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు ఒక రైతు పంటలు ఎండి అప్పుల పాలై వాటిని తీర్చలేక మానసిక వ్యధతో ఇంట్లో చిన్నచిన్న గొడవలు పడి ఆత్మహత్య చేసుకుంటే అటువంటి మరణాన్ని ‘కుటుంబ కారణాల వల్ల ఆత్మహత్య’ చేసుకున్నట్లుగా యంత్రాంగం లెక్కగడుతోంది.

ఇటువంటివి కుటుంబ కలహాలుగా ఎలా లెక్కిస్తారని... అప్పుల బాధ, ఎండిన పొలమే ఆత్మహత్యకు ప్రేరేపించిందని రైతు నేతలు చెబుతున్నారు. ఆత్మహత్యల సంఖ్య ఎక్కువైతే అది ప్రభుత్వ ప్రతిష్టకు దెబ్బ. పరిహారం ఇవ్వాలి. ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు నిర్ధారిస్తే ఇంకా అనేకమంది రైతులు పరిహారం కోసం ఆత్మహత్యలు చేసుకుంటారన్న విచిత్ర వాదననూ కొందరు కీలకస్థాయి అధికార పార్టీ నేతలు, అధికారులు లేవనెత్తుతున్నారు. అందుకే ఆత్మహత్యల నిర్ధారణ కమిటీలు అశాస్త్రీయ పద్ధతుల్లో తక్కువ ఆత్మహత్యలు జరిగినట్లుగా లెక్కగడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు