రూ.120 కోట్లు కావాలి !

27 Jun, 2019 14:06 IST|Sakshi
ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల 

సాక్షి, ఆదిలాబాద్‌ : జిల్లాలోని సర్కారు బడుల్లో సమస్యలు వేధిస్తున్నాయి. చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక పాఠశాలల్లో అదనపు తరగతి గదుల కొరత, ప్రహరీలు లేకపోవడం, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఏటా సరిపడా నిధులు విడుదల కాకపోవడంతో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందగా ఉన్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారం కోసం, వసతుల కల్పనకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. 2019– 20 విద్యాసంవత్సరానికి అవసరం అయ్యే నిధుల కోసం అధికారులు ప్రణాళిక తయారు చేసి ఇటీవల ప్రభుత్వానికి పంపించారు. 

రూ.120 కోట్లతో ప్రతిపాదనలు
జిల్లాలో 1,282 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 970 ప్రాథమిక పాఠశాలలు, 122 ప్రాథమికోన్నత, 195 ఉన్నత పాఠశాలలు ఉన్నా యి. వీటిలో 94,737 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా విద్యాశాఖ అధికారులు విద్యాసంవత్సరంలో పాఠశాలల నిర్వహణ, వాటిలో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనకు అవసరమయ్యే నిధుల కోసం కలెక్టర్‌ ఆమోదంతో ప్రభుత్వానికి రూ.120.55 కోట్ల ప్రతిపాదనలు పంపిం చారు. ఏయే అవసరాలకు ఎన్ని లక్షల నిధులు అవసరమవుతాయనే వివరాలతో సమగ్ర నివేదికను తయారు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి నివేదిక పంపారు. ఈ నివేదికను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఆమోదిస్తే నిధులు విడుదల అవుతాయి.

కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి నిధులు విడుదల చేస్తుంది. నిధులు మంజూరు కాగానే పాఠశాలల్లో మౌలిక వసతులు, తదితర అభివృద్ధి కార్యక్రమాలను విద్యాశాఖ అధికారులు చేపడుతారు. కాగా అధికారులు ప్రతిపాదనలు పంపిన వాటిలో పాఠశాలల బలో పేతం కోసం రూ.40 కోట్లు, విద్యార్థుల రవాణాభత్యం కోసం రూ.37లక్షలు, ఉచిత పాఠ్యపుస్తకాల కోసం రూ.2.36 కోట్లు, వసతిగృహల నిర్వహణ కోసం రూ.46 లక్షలు, గుణాత్మక విద్యకురూ.18 కోట్లు, స్కూల్‌ గ్రాంటు కోసం రూ.4 కోట్లు, డిజిటల్‌ తరగతులు, ఉపాధ్యాయుల శిక్షణ, మధ్యాహ్న భోజ న పథకం, ఉచిత యూనిఫాం, మౌలిక వసతులు కోసం ప్రణాళిక తయారు. అలాగే కేజీబీవీల కోసం రూ.37.44 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. 

వేధిస్తున్న సమస్యలు..
జిల్లాలోని చాలా పాఠశాలల్లో సమస్యలు వేధిస్తున్నాయి. పాఠశాలల్లో వంట గదులు లేకపోవడంతో నిర్వాహకులు వర్షాకాలంలో వంట చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మరుగుదొడ్లు ఉన్నా నీటిసౌకర్యం లేకపోవడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. కొన్ని పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం కూడా లేదు. అదేవిధంగా ప్రహరీలు లేవు, కొన్ని పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేకపోవడంతో చెట్ల కింద చదువులు సాగుతున్నాయి. గతంలో ఆర్వీఎం పథకం ద్వారా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అధిక మొత్తంలో విడుదలయ్యేవి.

ఈ నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, తదితర కార్యక్రమాలు నిర్వహించే వారు. అయితే ఆర్వీఎంను సమగ్ర శిక్ష అభియాన్‌ పథకంలో విలీనం చేయడంతో తక్కువ మొత్తంలో నిధులు విడుదల అవుతున్నాయి. విద్యాశాఖ అధికారులు పంపిన ప్రతిపాదనల్లో దాదాపు 60 శాతం నిధులను మాత్రమే ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో పాఠశాలల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారు. కాగా ఈ విద్యాసంవత్సరం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,644 కోట్ల విడుదల చేసిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే జిల్లాకు రూ.70కోట్ల నిధుల వరకు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రతిపాదనలు పంపించాం
విద్యావార్షిక ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. రూ.120కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. విడుదలైన నిధులతో పాఠశాలలో మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, యూనిఫాం, విద్యార్థులకు వసతులు కల్పిస్తాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు విడుదలైన నిధులు ఖర్చు చేస్తాం.    
– రవీందర్‌రెడ్డి, డీఈవో 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా