రెండు రిజర్వాయర్లకు బ్రేక్‌

10 Jan, 2019 01:52 IST|Sakshi

మల్కాపూర్, లక్ష్మీదేవునిపల్లి ఆపాలని నిర్ణయం

నిధుల భారం దృష్ట్యా కొద్దికాలం పనులకు బ్రేక్‌ వేసినట్లు అంచనా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టు ల్లో భాగంగా చేపడుతున్న రెండు రిజర్వాయర్ల పనులను తాత్కాలికంగా పక్కనపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదులలో భాగం గా నిర్మిస్తున్న మల్కాపూర్, పాలమూరు–రంగారెడ్డిలో భాగంగా నిర్మిస్తున్న లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌ పనులను ప్రస్తుతం చేపట్టరాదని నీటిపారుదల శాఖకు సంకేతాలు వచ్చినట్లుగా తెలిసింది. ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఇతర పనుల పూర్తికి నిధుల అవసరాలుండటం, అవి పూర్తయితే కానీ ఈ రిజర్వాయర్‌లతో ఉపయో గం లేకపోవడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

అంతా సిద్ధం.. ఆలోపే నిశ్శబ్దం..
గోదావరి జలాలను వినియోగించుకునేందుకు చేపట్టిన దేవాదుల ప్రాజెక్టులో అదనపు నీటి నిల్వలు పెంచేందుకు కొత్త రిజర్వాయర్‌ నిర్మా ణం చేయాలని సీఎం కేసీఆర్‌ తొలినుంచీ చెబుతున్నారు. సీఎం సూచనలకు అనుగుణంగా 10.78 టీఎంసీల సామర్థ్యంతో, రూ.3,672 కోట్లతో వరంగల్‌ జిల్లా ఘనపూర్‌ మండలం లింగంపల్లి వద్ద దీన్ని నిర్మించాలని నీరుపారుదల శాఖ నిర్ణయించింది. గోదావరికి వరద ఉండే 3 నెలల కాలంలో ధర్మసాగర్‌ నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా దీన్ని డిజైన్‌ చేసింది. ఈ రిజర్వాయర్‌తో 4,060 ఎకరాల మేర ముంపు ఉంటుందని తేల్చింది. నీటిని ఎత్తిపోసేందుకు 72 మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుందని, ఏటా రూ.67.55 కోట్ల వరకు  విద్యుత్‌ ఖర్చు ఉంటుందని అంచనా వేసింది.

రిజర్వాయర్‌ను రెండున్నరేళ్లలో పూర్తి చేసేలా ఇటీవలి రాష్ట్ర ఎన్నికలకు ముందు ఈ పనుల ను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులకు సిద్ధమైంది. దేవాదులలోని మూడో ఫేజ్‌లోని మూడో దశ పను ల్లో సొరంగం పనులు పూర్తి కాలేదు. ఇది పూర్తయితే కానీ 25 టీఎంసీల మేర నీటిని వినియోగించుకునే అవకాశం లేదు. ఇక్కడ 49 కి.మీ. సొరంగం పనుల్లో 7కి.మీలు పెండింగ్‌లో ఉంది. ఈ పనులను ప్రస్తుత ఏజెన్సీతో పూర్తి చేయ డం సాధ్యం కాకపోవడంతో మరో ఏజెన్సీతో పనులు చేయించాలని సీఎం ఆదేశిం చారు. ఈ పనుల పూర్తికే రెండేళ్లు పట్టనుంది. నిధుల అవసరాలు భారీగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుపై మరింత ఆర్థిక భారం వేయరాదన్న భావనలో ఉన్న ప్రభుత్వం, మల్కాపూర్‌ రిజర్వాయర్‌ను కొద్దికాలం పక్కనపెట్టాలని నిర్ణయించినట్లుగా నీటిపారుదల వర్గాలు చెప్పాయి.

లక్ష్మీదేవునిపల్లిపై అదే మౌనం..
ఇక 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌ నగరానికి తాగునీరు, పరిశ్రమలకు నీటివసతిని కల్పించే ఉద్దేశంతో రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు ప్రాజెక్టును చేపట్టగా ఇందులో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదే వునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులను 18 ప్యాకేజీలుగా విభజించి, మొత్తంగా రూ.30 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి రెండున్నరేళ్ల కిందటే పనులు ప్రారంభించారు. అయితే రెండున్నరేళ్లుగా ఉద్దండాపూర్‌ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి అనుసంధాన ప్రక్రియ, రిజర్వాయర్‌ నిర్మాణంపై స్పష్టత రాలే దు. 2.80 టీఎంసీల సామర్ధ్యంతో రూ.915 కోట్లతో దీని అం చనాలు సిద్ధం చేసినా టెండర్లు మాత్రం పిలవలేదు. అయితే ప్రస్తుతానికి పాలమూరు ప్రాజెక్టులో ఉద్దండాపూర్‌ వరకు పనులను వేగిరం చేయాలని సూచించిన ప్రభుత్వం, ఆ పనులు పూర్తయ్యాకే లక్ష్మీదేవునిపల్లిని చేపట్టాలనే సంకేతాలిచ్చింది. ఎగువ పనులు పూర్తవ్వాలంటే మరో రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. అవి పూర్తయితేకానీ లక్ష్మీదేవునిపల్లి చేపట్టే అవకాశం లేదు. 

మరిన్ని వార్తలు